ఢిల్లీ ధర్నాను విజయవంతం చేయండి: ఏపీఎన్జీవోలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో 17, 18 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న బహిరంగ ర్యాలీ, మహా ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్రం కోసం ఢిల్లీకి బయలుదేరిన ఉద్యమకారులను ఇబ్బందులకు గురిచేసేందుకు రైళ్ల బోగీలను మార్చి జనరల్ బోగీలను పెట్టారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కష్టాలకైనా ఓర్చి ఢిల్లీ చేరేందుకు ఉద్యోగులు, విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని.. ఆరు రైళ్లలో ఆరువేల మంది ఢిల్లీకి వస్తే దాన్ని ఢిల్లీపై దండయాత్ర అనడం సరికాదని వ్యాఖ్యానించారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో సీమాంధ్ర టీడీపీ ఎంపీ సుజనాచౌదరి నివాసంలో ఏపీజేఎఫ్ అధ్యక్షుడు కృష్ణాంజనేయులు, చలసాని ప్రసాద్, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకుడు అడారి కిశోర్‌బాబుతో కలిసి విలేకరులతో అశోక్‌బాబు మాట్లాడారు.
పార్లమెంట్‌లో మార్షల్స్ చేయాల్సిన పనిని కొందరు ఎంపీలు చేస్తూ సీమాంధ్ర ఎంపీలపై దాడికి దిగడం ప్రజాస్వామ్యంలో చీకటిరోజని వ్యాఖ్యానించారు. సీమాంధ్రులను హైదరాబాద్‌లో తిరగనివ్వబోమన్న హెచ్చరికలకు తాము బెదిరేది లేదన్నారు. బిల్లును అడ్డుకోవాలని కోరుతూ జాతీయ పార్టీల నేతలను కలవనున్నట్లు చెప్పారు. 17న రాంలీలా మైదానంలో జరిగే సమావేశానికి జాతీయ పార్టీలతో పాటు ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సమైక్యవాదాన్ని బలపరుస్తున్న వైఎస్సార్‌సీపీ, ఎంఐఎం, సీపీఎం నాయకులను సైతం రెండు రోజుల ర్యాలీలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నట్టు అశోక్‌బాబు చెప్పారు. సోమవారం నాటి ఆందోళనలతో సమైక్య ఉద్యమాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళతామన్నారు. సమైక్యాంధ్ర విషయంలో జాతీయ మీడియా ప్రవర్తన చూస్తే ప్రభుత్వానికి అమ్ముడుపోయినట్లు కనిపిస్తోందని విమర్శించారు. సమైక్య ఉద్యమకారులతో ఢిల్లీకి వస్తున్న రైళ్లను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్టు తమకు సమాచారం అందుతోందన్నారు.
ఆరు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి..
సాక్షి,హైదరాబాద్: ఢిల్లీలో జరగనున్న సమైక్య ర్యాలీకి ఏపీఎన్జీవోలు,సమైక్యవాదులు ఆరు ప్రత్యేక రైళ్లలో శనివారం బయలుదేరారు. అనంతపురం, రేణిగుంట, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, కాకినాడ స్టేషన్‌ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు బయలుదేరాయి. రేణిగుంట నుంచి వస్తున్న రైలులో హైదరాబాద్‌లోని ఎపీఎన్జీవోలు కాచిగూడ స్టేషన్‌లో ఎక్కారు. కాగా, ఉద్యోగ సంఘం నేతలు స్లీపర్‌కోచ్‌లను బక్ చేసినా, రైల్వే అధికారులు జనరల్ బోగీలు ఇవ్వడంతో ఉద్యోగులు ప్రయాణంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. ఆదివారం రాత్రి ఈ ప్రత్యేక రైళ్లు ఢిల్లీ చేరే అవకాశం ఉంది.
గద్వాల రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తత
గద్వాల, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై నిరసన తెలిపేందుకు ఢిల్లీ వెళ్తున్న ప్రత్యేక రైలు శనివారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల రైల్వేస్టేషన్‌లో ఆగిన సమయంలో అందులోని వారు సమైక్య నినాదాలు చేశారు. ప్రతిగా స్టేషన్‌లోని ప్రయాణికులు తెలంగాణ నినాదాలు చేశారు. వాదన పెరిగి ఇరువైపుల వారూ పట్టాల మీది రాళ్లు తీసి పరస్పరం రువ్వుకున్నారు. రాళ్ల దాడిలో ఓ హమాలీ గాయపడ్డాడు.