సమ్మెను నీరుగార్చింది అశోక్‌బాబే | Subbarayan takes on Ashok babu | Sakshi
Sakshi News home page

సమ్మెను నీరుగార్చింది అశోక్‌బాబే

Published Sun, Dec 8 2013 3:46 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

సమ్మెను నీరుగార్చింది అశోక్‌బాబే - Sakshi

సమ్మెను నీరుగార్చింది అశోక్‌బాబే

ఏపీఎన్జీవోల మాజీ నాయకుడు సుబ్బరాయన్ సంచలన వ్యాఖ్యలు
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఏపీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో 66 రోజుల పాటు చేసిన ఉద్యమం తాత్కాలిక అధ్యక్షుడు అశోక్‌బాబు స్వార్థం వ ల్లే నీరుగారిపోయిందని ఆ సంఘం మాజీ  ప్రధాన కార్యదర్శి సుబ్బరాయన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. శనివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన అశోక్‌బాబు తీరుపై విరుచుకుపడ్డారు. అశోక్‌బాబు రాజకీయంగా ఎదిగేక్రమంలోనే ఉద్యమాన్ని అవకాశంగా వాడుకుంటూ ఒంటెత్తు పోకడలతో స్వార్థ ప్రయోజనాలకోసం పనిచేస్తూ  పరోక్షంగా రాష్ట్ర విభజనకు సాయం చేస్తున్నారని ఆరోపించారు.
 
 స్వామిగౌడ్  లాంటి తెలంగాణ ఉద్యోగ సంఘం నేతలు అన్ని రాజకీయ పక్షాలను ఒకతాటిపైకి తెచ్చి తెలంగాణ ఏర్పాటుకు ముమ్మరంగా కృషి చేస్తే, అశోక్‌బాబు అందుకు విరుద్ధంగా వ్యక్తిగత ఎదుగుదలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారన్నారు. అన్ని రాజకీయపార్టీలతో రాజకీయ జేఏసీని ఏర్పాటు చేయకపోవటం ఆయన చేసిన చారిత్రక తప్పిదమన్నారు. ఉద్యమానికి ఎన్నో కార్పొరేట్ సంస్థలు, రాజకీయ నాయకులు భారీగా విరాళాలిచ్చినట్లు ఉద్యోగులే పేర్కొంటున్నారని, సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో కూపన్లు అమ్మగా భారీగా డబ్బులు సమకూరాయని, ఇప్పటి వరకు వీటి జమాఖర్చులు వెల్లడిచేయకపోవటమేమిటని ప్రశ్నించారు. అశోక్‌బాబును తాత్కాలిక అధ్యక్షుడిగా మాత్రమే నియమించారని, ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోవద్దనే ఆదేశాలు కూడా ఉన్నాయని, కానీ ఆయన నియంతలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
 
 పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు రాగానే పార్టీకి, పదవికి రాజీనామా చేస్తానని పేర్కొంటున్న ఓ ముఖ్య నేత ‘సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటి’ అనే పేరుతో పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారని, ఆ పార్టీ ఖరారు కాగానే అశోక్‌బాబు ఉద్యోగానికి రాజీనామా చేసి అందులో చేరటం ఖాయమన్నారు. చిలక జోస్యుడిలా మాట్లాడే కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎంపీ చేతిలో అశోక్‌బాబు కీలుబొమ్మగా మారాడన్నారు. పార్లమెంటు, అసెంబ్లీలో తెలంగాణ బిల్లును అడ్డుకోవటం ద్వారా విభజన ప్రక్రియను నిలవరించే అవకాశం ఉందని తెలిసీ అశోక్‌బాబు రాజకీయపార్టీలను అవమానించేలా ఎల్బీస్టేడియంలో సభ నిర్వహించారని విమర్శించారు. 66 రోజుల ఉద్యమ కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించాలని ఆయన ఏనాడూ ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదని, ఇప్పుడు మళ్లీ ఉద్యమంలోకి రమ్మంటే ఉద్యోగులు ఎలా వస్తారని ప్రశ్నించారు.
 
 అశోక్‌బాబు తీరుతో విసిగిపోయిన కొందరు ఏపీఎన్జీవో సంఘం నాయకులు ఈనెల 8న శ్రీకాకుళంలో సమావేశం నిర్వహిస్తున్నారని, దీనికి ఏపీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డిని కూడా ఆహ్వానించారని తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియ నిలిచిపోయేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సంఘాన్ని కాపాడుకునేందుకు వ్యవహరించాల్సిన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తారన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడడమే కాకుండా సమాజ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించే ఈ గొప్ప సంఘం కళ్లముందే నాశనమవుతుంటే చూడలేక, ప్రస్తుతం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌కు రాజీనామా చేసి ఏపీఎన్జీవోల సంఘం పునర్నిర్మాణం కోసం వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాలకు ఆదర్శంగా, అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌లో సీమాంధ్ర, తెలంగాణ ప్రజలు అన్నదమ్ముల్లా మెలుగుతున్న తరుణంలో విభజన పేరుతో వారిని విడ దీస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ సమావేశంలో సతీశ్‌కుమార్, రమణబాబు తదితరులు పాల్గొన్నారు.  
 
 ఆరోపణలు అవాస్తవం: అశోక్‌బాబు
 తనపై ఆరోపణలు చేసిన సుబ్బరాయన్ అసలు ఏపీఎన్జీవో సంఘం సభ్యుడే కాదని అశోక్‌బాబు పేర్కొన్నారు. మనసులో ఏదో కక్షపెట్టుకుని చవకబారు ఆరోపణలు చేస్తున్నారని, అసలు ఆయన చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని అశోక్‌బాబు కొట్టిపడేశారు. శనివారం సాయంత్రం ఎన్జీఓ హోమ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సుబ్బరాయన్ ఆరోపణలకు స్పందించాల్సిన అవససరం కూడా లేదన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement