సమ్మె విరమించమని తమ మీద తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయని, ఒత్తిళ్లకు తలొగ్గి సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు.
* ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు
* 16న అన్ని ఉద్యోగ సంఘాలతో భేటీ
సాక్షి, హైదరాబాద్: సమ్మె విరమించమని తమ మీద తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయని, ఒత్తిళ్లకు తలొగ్గి సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే దిశగా స్పష్టమైన నిర్ణయం వెలువడే వరకు సమ్మె కొనసాగిస్తామని చెప్పారు. ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి అశోక్‌బాబు మంగళవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.
మంగళవారం తొలిరోజు సమ్మెలో 99 శాతం మంది ఉద్యోగులు పాల్గొన్నారని, సీమాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె వల్ల రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయిందన్నారు. సమ్మెను విజయవంతం చేయడం ద్వారా.. రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయం ఎంత వివాదాస్పదమో ఉద్యోగులు, ప్రజలు చెప్పకనే చెప్పారన్నారు. విభజనవాదుల చర్యలకు భయపడబోమని, వారు చేసే ప్రకటనలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పోటీగా వ్యాఖ్యలు చేయబోమని చెప్పారు.
ఇరు ప్రాంతాల ఉద్యోగుల మధ్య ఉన్న సత్సంబంధాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేయడం మంచిదికాదని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలకు హితవు పలికారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను బెదిరించడం, మహిళలను అసభ్య పదజాలంతో దూషించడం తెలంగాణ ఉద్యోగులకు తగదన్నారు. నిరసన వ్యక్తం చేయడానికి ఇబ్బందిలేకుండా చర్య లు చేపడతామని మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చింద ని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా సీమాంధ్ర ఎంపీలు రాజీనామాలు చేసి ఉద్యమంలో కలవాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 16న గుంటూరు లేదా విజయవాడలో అన్ని సంఘాలతో సమావేశం కానున్నామని, ఆ సమావేశంలో ఢిల్లీ యాత్ర తేదీలను ఖరారు చేస్తామని తెలిపారు. వి
భజన నిర్ణయం జరిగిపోయిందనే వాదనలో వాస్తవం లేదన్నారు. రాజకీయ కారణాల మీద ఉద్యోగులు సమ్మెకు ఎలా వెళతారని ప్రశ్నించగా.. ‘‘విభజన తర్వాత 8.5 లక్షల మంది ఉద్యోగులకు స్థానభ్రంశం ఉండదని, సీనియారిటీ, పదోన్నతుల విషయాల్లో మార్పులు లేకుండా యథావిధిగా ఉంచుతామని ప్రభుత్వం ప్రకటిస్తే సమ్మె విరమించడానికి సిద్ధం’’ అన్నారు.
ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఉపసంఘం
సమ్మె విరమించుకునేలా సీమాంధ్ర ఉద్యోగ సంఘాలను ఒప్పించటానికి మంత్రివర్గ ఉపసంఘం ప్రయత్నాలు ప్రారంభించింది. బుధవారం ఉదయం 11.30 గంటలకు చర్చలకు రావాల్సిందిగా. ఏపీఎన్‌జీవో, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులను ఉపసంఘం ఆహ్వానించింది.