అనంతపురం : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్రలో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అనంతపురం జిల్లాలో సమైక్య ఆందోళనలు నేటికి 50వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీ విద్యార్థులు, ఉద్యోగులు వినూత్నంగా తమ నిరసనలు తెలిపారు.
ప్రజల మనోభీష్టం కన్నా... పదవులు పట్టుకుని వేలాడుతున్న కేంద్ర మంత్రులకు విద్యార్థులు, ఉద్యోగులు బుధవారం ఉదయం సమాధి కట్టి నిరసనలు తెలియచేశారు. కేంద్రమంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఉరవకొండలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి సమైక్యవాదులు వంద టెంకాయలు కొట్టారు.
అలాగే జిల్లా వ్యాప్తంగా సమైక్య నినాదాలు మోర్మోగుతున్నాయి. అనంతపురం నగరంలో జాక్టో ఆధ్వర్యంలో నిన్న రిలే దీక్షలు కొనసాగించిన ఉపాధ్యాయులు... కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. సప్తగిరి సర్కిల్‌లో మానవహారం నిర్మించి... దిష్టిబొమ్మలను దహనం చేశారు. ‘మొద్దునిద్రలో ఉన్న మంత్రులను గునపాలతో గుచ్చి లేపుతున్నట్లు’గా ఉపాధ్యాయులు స్థానిక టవర్‌క్లాక్ సర్కిల్‌లో వినూత్న ప్రదర్శన చేపట్టారు.