సీమాంధ్ర నేతల వైఖరితోనే సంజీవ్ ఆత్మహత్య | Complaint lodged against Ashok Babu | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర నేతల వైఖరితోనే సంజీవ్ ఆత్మహత్య

Published Fri, Jan 17 2014 5:50 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

Complaint lodged against Ashok Babu

 గాంధారి, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర నేతలు, ఏపీఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వైఖరితోనే సర్వాపూర్ గ్రామానికి చెందిన గొడుగు సంజీవ్ ఆత్మ బలిదానం చేశారని జేఏసీ జిల్లా కన్వీనర్ గోపాల్‌శర్మ, అధికార ప్రతినిధి ప్రభాకర్, టీఎన్‌జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం ఆరోపించారు. గురువారం వారు సర్వాపూర్ గ్రామాన్ని సందర్శించి సంజీవ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీమాంధ్రలో తెలంగాణ బిల్లు ప్రతులను భోగి మంటలలో దహనం చేయడంతో సంజీవ్ తీవ్ర మనస్తాపం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లైన ఎనిమిది నెలలకే భర్తను కోల్పోయి భార్య అరుణ, చేతికొచ్చిన కొడుకును పోగొట్టుకొని తల్లి దండ్రులు దిక్కులేని వారయ్యారన్నారు. ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబానికి రూ. ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు, కుటుంబానికి రెండకరాల భూమి, మృతుడి సోదరునికి వీఆర్‌ఏ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం గాంధారి మండల కేంద్రంలోని నెహ్రూ విగ్రహం వద్ద అశోక్‌బాబు దిష్టి బొమ్మను దహనం చేశారు.
 
 ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షుడిపై ఫిర్యాదు
 ఏపీఎన్‌జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు రెచ్చగొట్టే మాటలకు తోడు తెలంగాణ బిల్లు ప్రతులను దహనం చేసి 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల మనోభావాలను కించపర్చినందుకే సంజీవ్ ఆత్మహత్య చేసుకున్నాడని గాంధారి ఠాణాలో జేఏసీ నాయకులు ఫిర్యాదు చేశారు. అశోక్‌బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తానాజీరావు, నాయకులు సంతోష్, కమ్మరి సాయిలు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement