చిన్న గ్రామాన్ని కూడా వదులుకోం: కోదండరాం
బొంరాస్‌పేట, న్యూస్‌లైన్: హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ కావాలని, ఈ ప్రాంతంలో చిన్న గ్రామాన్ని కూడా వదులుకునే ప్రసక్తేలేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టంచేశారు. ఇన్నేళ్ల పోరాటాల ఫలితంగా రాష్ట్రం ఏర్పాటు తుది దశకు వచ్చిందని నమ్ముతుండగా సీమాంధ్ర నేతలు, కేంద్ర ప్రభుత్వం తిరకాసు పెడుతూ తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తే మలివిడత ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేటలోని ఉపాధ్యాయ శిక్షణ సమావేశం, కోస్గిలో జరిగిన విద్యార్థి గ ర్జనలో కోదండరాం మాట్లాడారు. సీమాంధ్ర నేతలు భద్రాచలం, కృష్ణా, తదితర అంశాలతో దింపుడుకళ్లం ఆలోచనలు మానుకోవాలన్నారు. ముక్కలైన తర్వాత బలవంతంగా కలుపుతామనుకోవడం సీమాంధ్ర నేతల మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్రం అంశాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ చివరివరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో సామాన్య ప్రజలను సైతం పాల్గొనేలా స్ఫూర్తినిచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులు పోషించిన పాత్ర అమోఘమని టీజేఏసీ కో-చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ నిర్మాణంలో విద్య, తదితర రంగాలకు ప్రాధాన్యం కల్పించేలా ఉపాధ్యాయులు, ఉద్యోగులు బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు.