రాయల తెలంగాణను ఒప్పుకోం: కోదండరాం
నల్లగొండ, న్యూస్‌లైన్: రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని టీజేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ, తెలంగాణ ప్రజల సంస్కృతీ సంప్రదాయాలకు ఎక్కడా పొంతన కుదరదని తెలిపారు. రాయల తెలంగాణతో తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం దెబ్బతింటుందని చెప్పారు. మునగాల, భద్రాచలం సరిహద్దుల నిర్ణయం, పాలకుల కోసం కాకుండా ప్రజల ఆకాంక్షల మేరకు జరగాలని కోరారు. రాష్ట్ర ఏర్పాటులో కేంద్రం ఎలాంటి కిరికిరి పెట్టినా మరోసారి ఉద్యమించక తప్పదని హెచ్చరించారు.