Samaikya Agitation
-
తగ్గని ఉద్యమ వేడి
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను సిక్కోలు జిల్లాను వణికించినప్పటికీ ప్రజల్లో సమైక్యవాదం మాత్రం తగ్గలేదు. ప్రజ లు, ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు. మంగళవారం జిల్లా వ్యాప్తం గా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయం వద్ద మినిస్టీరియల్ ఉద్యోగులు, కలెక్టరేట్ వద్ద రెవెన్యూ , గృహనిర్మాణ శాఖ ఉద్యోగులు దీక్షలు కొనసాగించారు. కలెక్టరేట్ వద్ద కేంద్ర మంత్రులు కిల్లి కృపారాణి, పల్లంరాజుతో పాటు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తదితరులు బొమ్మలతో రావణాసుర వధ పేరిట జెడ్పీ ఉద్యోగులు ధర్నా చేశారు. అనంతరం కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కలెక్టరేట్ సమావేశ మందిరంలో పై-లీన్ తుపాను నష్టంపై ఆధికారులతో సమీక్షిస్తున్నారు. మంత్రులు రాజీనామాలు చేయాలని, టీ నోట్‌ను వెనుక్కితీసుకోవాలని, రాష్ట్రాన్ని సమైక్య ఉంచాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు కిల్లారి నారాయణరావు, ప్రసాద్, శోభారాణి పాల్గొన్నారు. రాజాంలో ఎన్జీఓ దీక్షా శిబిరం 64వ రోజూ కొనసాగింది. పంచాయతీ రాజ్ ఉద్యోగులు ఆరుగురు దీక్షలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 14వ రోజు దీక్షలో ఆరుగురు కూర్చున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజే బాబు, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. పాలకొండ ఆంజనేయసెంటర్లో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ రిలే నిరాహారదీక్షా శిబిరంలో వీరఘట్టం మండలం కత్తులకవిటికి చెందిన జంపు ఉమామహేశ్వరరావు, రౌతు చంద్రరావు నేతృత్వంలోని 20 మంది ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. సమన్వయకర్తలు విశ్వాసరాయి కళావతి, పాలవలస విక్రాంత్ శిబిరాన్ని ప్రారంభించి సమైక్య ఉద్యమ ఆవశ్యకతను వివరించారు. పాలకొండ డివిజన్ సమైక్యాంధ్ర పరిరక్షణ ఆధ్వర్యంలో విద్యార్థులు కదంతొక్కారు. ఐదుచోట్ల వేలాది విద్యార్థులు ట్రాఫిక్‌ను దిగ్బంధించారు. శిబిరంలో ఉపాధ్యాయులు, సమైక్యాంధ్ర జేఏసీ ప్రతినిధులు దీక్ష చేపట్టారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం సందర్శించి సంఘీభావం తెలిపారు. కాశీబుగ్గ బస్టాండ్ వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. పాతపట్నంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షలు 70వ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం నాటి దీక్షలో మండల సాక్షరాభారత్ కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు. మంత్రి శత్రుచర్ల కాన్వాయ్‌పైకి చెప్పులు విసిరి నిరసన తెలిపారు. మెళియాపుట్టి, కొత్తూరులలో రిలేనిరహార దీక్షలు కొనసాగుతున్నాయి. -
జగన్ ను కలిసిన సీమాంధ్ర ఉద్యోగులు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ఫోరం బుధవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. సమైక్య ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా వారు జగన్‌కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తమ ప్రియతమ నేతను చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. దాంతో జగన్ నివాసం అభిమాన సంద్రంతో పోటెత్తింది. కాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఆయనను కలిసేందుకు పార్టీ నేతలు లోటస్ పాండ్‌కు చేరుకుంటున్నారు. -
జగన్‌తో సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం భేటీ
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ఫోరం బుధవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. సమైక్య ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా వారు జగన్‌కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తమ ప్రియతమ నేతను చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. దాంతో జగన్ నివాసం అభిమాన సంద్రంతో పోటెత్తింది. కాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఆయనను కలిసేందుకు పార్టీ నేతలు లోటస్ పాండ్‌కు చేరుకుంటున్నారు. -
రామయ్యా వస్తాడా... అత్తారింటికి వెళ్తాడా?
టాలీవుడ్ లో భారీ చిత్రాల నిర్మాతలను సమైక్యాంధ్ర ఉద్యమం గందరగోళంలో పడేసింది. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం జోరుగా సాగుతుండటంతో భారీ చిత్రాల విడుదలకు ఆటంకం ఏర్పడింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చిత్ర పరిశ్రమకు ప్రతికూలంగా మారడంతో అగ్రనిర్మాతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొద్దికాలం క్రితం తెలంగాణలో ఉద్యమ ప్రభావంతో ఉక్కిరిబిక్కిరైన నిర్మాతలు.. కాస్తా తేరుకుని ఊపిరి పీల్చుకునే సమయంలోనే రాష్ట్ర విభజన ప్రకటన మళ్లీ ఇబ్బందుల్లోకి వారిని నెట్టింది. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం భగ్గుమంది. అయితే రాష్ట్ర విభజన సమస్యకు తొందర్లోనే పరిష్కారం దొరుకుందని, త్వరలోనే సినిమాల విడుదల చేయవచ్చని ఆశించిన నిర్మాతలకు చుక్కెదురైంది. పలుమార్లు చిత్ర విడుదల తేదిన ప్రకటించి.. వాయిదా పరిస్థితి తెలెత్తింది. విడుదల తేదిని ప్రకటించిన వాయిదా వేసిన వాటిలో ఎవడు, అత్తారింటికి దారేది? రామయ్యా వస్తావయ్యా లాంటి భారీ చిత్రాలున్నాయి. ఓ దశలో ఓ చిత్ర నిర్మాతకు పెద్ద మొత్తంలో టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని అనధికారికంగా వార్తలు వెలువడ్డాయి. అయితే విడుదల వాయిదా పడి.. నెలకు పైగా వేచి ఉండాల్సి పరిస్థితి తెలెత్తడంతో ఆర్ధిక సమస్యలు ప్రారంభమైనట్టు తెలిసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే చిత్ర నిర్మాణం నుంచి తప్పుకునేందుకైనా సిద్ధం అన్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆరంభంలో ఉన్న పరిస్థితి కొంత సద్దుమణిగినట్టు కనిపించగానే చిన్న చిత్రాలు విడుదల జోరందుకుంది. అంతకుముందు..ఆ తర్వాత, పోటుగాడు, కమీనా, కిస్ లాంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. చిన్న చిత్రాలకు సమైక్య ఉద్యమకారుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకపోవడం గమనించిన చిత్ర పరిశ్రమ ప్రముఖులు భారీ చిత్రాల విడుదల తేదిలను ప్రకటించారు. పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది?', యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రం 'రామయ్య వస్తావయ్యా', రామ్ చరణ్ 'ఎవడు' సమైక్యాంధ్ర ఉద్యమ సెగతో విడుదలకు నోచుకోలేకపోయాయి. అయితే విజయదశమి కానుకగా భారీ చిత్రాల విడుదలకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేశారు. సాధారణంగా దసరా, దీపావళి, సంక్రాంతి పండగల అంటేనే టాలీవుడ్ లో భారీ చిత్రాలతో నిజమైన పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుత పరిస్థితులను బేరిజు వేసుకుని నిర్మాతలు కొంత ధైర్యాన్ని కూడగట్టుకుని విడుదల తేదిని ప్రకటించినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 9 తేదిన అత్తారింటికి దారేది?, 10 తేదిన రామయ్యా వస్తావయ్యా చిత్రాల విడుదలకు సన్నద్దం చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందిన జూనియర్ ఎన్టీఆర్ చిత్రం రామయ్యా వస్తావయ్యా చిత్రాన్ని అక్టోబర్ 10 తేదిన విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 2008 అక్టోబర్ 9న కొత్త బంగారులోకం, 2010 అక్టోబర్ 14న బృందావనం విడుదలై సూపర్ హిట్ ను సాధించాయి. ఈ విజయదశమి సందర్భంగా 2013 అక్టోబర్ 10న రామయ్యా వస్తావయ్యా చిత్రంతో హ్యట్రిక్ సాధించేందుకు సిద్దమవుతున్నాము అని అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియో విడుదలతో భారీ అంచాలు నెలకొన్న అత్తారింటికి దారేది చిత్రాన్ని దసరా పండుగ కానుకగా అక్టోబర్ 9న విడుదల చేస్తున్నట్టు నిర్మాత బి.ప్రసాద్ తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తే... సమైక్య ఉద్యమం జోరు ఏమాత్రం తగ్గకపోగా.. సెప్టెంబర్ నెలాఖరుకు మరికొంత ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ రాష్ట్ర విభజనపై నోట్ పై కేంద్ర ప్రభుత్వం ఏదైనా స్పష్టత ఇస్తే.. సీమాంధ్రలో ఉద్యమం మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ అలాంటి పరిస్థితే తలెత్తితే..అత్తారింటికి దారేది..రామయ్యా వస్తావయ్యా చిత్రాల విడుదల ప్రశ్నార్ధకమే. ఈ నేపథ్యంలో చిత్రాలు మరోసారి వాయిదా పడితే...ప్రేక్షకుల వద్దకు రామయ్యా వస్తాడా.. అత్తారింటికి వెళ్తారా అనేది సందేహమే. మళ్లీ అగ్ర నటుల చిత్రాలు మరోసారి వాయిదా పడితే సినిమా ప్రేక్షకులకు ఈ సంవత్సరపు దసరా సినీ పండుగ వాతావరణం దూరమైనట్టే. -రాజాబాబు అనుముల a.rajababu@sakshi.com -
`ఉద్యమం ముసుగులో దాడులు సహించం`
సాక్షి, హైదరాబాద్: సమైక్యోద్యమం ముసుగులో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే సహించేది లేదని ఉద్యోగ సంఘాలను, జేఏసీలను సీమాంధ్రకు చెందిన మంత్రులు హెచ్చరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకే తాము రాజీనామాలు చేయడం లేదని స్పష్టంచేశారు. సమైక్యోద్యమానికి సంబంధించి కాంగ్రెస్ కార్యాచరణను త్వరలోనే పార్టీ సీమాంధ్ర నేతల విస్తృతస్థాయి భేటీలో రూపొందిస్తామన్నారు. మంత్రుల క్వార్టర్లలో మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో సోమవారం సీమాంధ్ర మంత్రులు భేటీ అయ్యారు. గంటాతో పాటు శైలజానాథ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, పితాని సత్యనారాయణ, అహ్మదుల్లా, కాసు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. సమైక్యోద్యమంలో పాల్గొనే క్రమంలో ఉద్యమకారుల నుంచి ఇటీవల తమకు ఎదురవుతున్న చేదు ఘటనలు ఇబ్బందికరంగా మారుతున్నాయన్నారు. వాటిని అధిగమించి ప్రజల్లోకి వెళ్లే మార్గాలపై మల్లగుల్లాలు పడ్డారు. హైదరాబాద్‌లో ఉంటూ ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజలు నమ్మడం లేదని, వాటన్నింటినీ డ్రామాలుగానే భావిస్తుందున క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై 2 రోజుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో విస్తృతస్థాయి భేటీ ఏర్పాటు చేసి కార్యాచరణను రూపొందించనున్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులు, ఎంపీలతో సమావేశం కావాలని నిర్ణయించారు. భేటీ అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. సమైక్యం కోసం తొలి నుంచి పోరాడుతున్న తనను అడ్డుకున్న నేతలు, రాయలసీమను రాష్ట్రం చేయాలంటున్న బెరైడ్డి రాజశేఖరరెడ్డి తదితరులను ఎందుకు అడ్డుకోవడం లేదని టీజీ ప్రశ్నించారు. రౌడీ మూకలు ఉద్యమంలోకి చొరబడి తనపై దాడి చేశాయని ఆరోపించారు. ఉద్యమం ముసుగులో కొందరు కాంగ్రెస్‌పై దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామని పితాని అన్నారు. సమైక్యత కోసం పోరాడుతున్నది కాంగ్రెస్ సీమాంధ్ర నేతలేనని శైలజానాథ్ పేర్కొన్నారు. తాము హైదరాబాద్‌లో ఖాళీగా కూర్చోలేదని, సీమాంధ్రకు నష్టం జరగకుండా ఎలా నడవాలన్న దానిపై పోరాడుతున్నామని ఏరాసు అన్నారు. చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చినందునే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావే ప్రకటించారని గుర్తుచేశారు. -
బీజేపీ సమావేశంపై భగ్గు
అనకాపల్లి, న్యూస్‌లైన్: బీజేపీ విశాఖ జిల్లా కార్యవర్గ సమావేశానికి సమైక్య సెగ తగిలింది. సమావేశం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఉపాధ్యాయ జేఏసీ సభ్యులు అక్కడికి వెళ్లి సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఉపాధ్యాయ జేఏసీ సభ్యులపై బీజేపీ నేతలు దాడి చేశారన్న ప్రచారంతో సమైక్యవాదులంతా పెద్దఎత్తున తరలివచ్చి మూకుమ్మడి దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బీజేపీ నేతలు క్షమాపణ చెప్పి సమైక్యాంధ్రకు మద్దతు పలికితేనే వెనుతిరుగుతామని సమైక్యవాదులు భీష్మించుకొని కూర్చొన్నారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోడిగుడ్లు విసరడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. బీజేపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు కంభంపాటి హరిబాబు వాహనంపై సమైక్యవాదులు రాళ్లు విసరడంతో అద్దాలు పగిలాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమావేశం అర్ధంతరంగా రద్దయింది. మాకు భావప్రకటనా స్వేచ్ఛ లేదా? : బీజేపీ హైదరాబాద్ : బీజేపీ కార్యాలయాలపైనా, సమావేశాలపైనా దాడులను సహించబోమని ఆ పార్టీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ హెచ్చరించింది. ఈ తరహా దాడులు తమ భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడమేనని ప్రకటించింది. అనకాపల్లిలో జరిగిన దాడిని కమిటీ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్‌బాబు ఒక ప్రకటనలో ఖండించారు. -
ఏదో ఒకటి చేద్దాం!
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగసిపడుతుండడంతో తామూ ఆ ఉద్యమంలో భాగస్వాములవుతున్నామనే అభిప్రాయం ప్రజల్లో కల్పించాలని కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు భావిస్తున్నారు. దీక్షలు, సభలు నిర్వహించే యోచనలో ఉన్నారు. సమైక్య ఉద్యమం ఉధృతంగా ఉండడం, హైదరాబాద్‌లో ఏపీఎన్జీఓల సభ విజయవంతం కావడం, ఇతర పార్టీలు ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామాలు చేయడంతో పాటు ప్రజల్లోకి చొచ్చుకుపోతుండటంతో తామూ ఏదో చేస్తున్నామనిపించుకోవాలనే ప్రయత్నాల్లో పడ్డారు. అయితే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకాక తప్పదనే అభిప్రాయంతో ప్రత్యక్ష పోరాటం కాకుండా వేరే మార్గాలపై దృష్టి పెట్టారు. హైదరాబాద్ లేదా ఇబ్బందులు ఎదురుకాని సురక్షిత ప్రాంతాలను ఎంచుకుని దీక్షలు, సభలు నిర్వహించేందుకు వ్యూహాన్ని రచిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, ఆధిపత్యపోరు ఈ విషయంలోనూ బహిర్గతమవుతున్నాయి. విశాఖపట్నంలో సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ పేరిట రాజకీయేతర జేఏసీ సారథ్యంలో ఈ నెల 21న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రాజకీయేతర జేఏసీలో మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యభూమిక పోషిస్తుండడంతో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఈ సభపై విముఖతతో ఉన్నారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. సీఎం, ఆయన మద్దతుతో ఇతర మంత్రులు తనకు వ్యతిరేకంగా కొందరిని రెచ్చగొడుతున్నారనే అభిప్రాయం బొత్సలో ఉంది. తనపై వ్యతిరేకతను మరింత పెంచేందుకే ఈ సభకు పూనుకుంటున్నారని బొత్స భావిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరో ప్రాంతంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతృత్వంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నేతలు భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం సమావేశమై హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినందున తామూ అదే రీతిలో ఒక సభను పెట్టాలన్న ఆలోచనలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. దీంతోపాటు సమైక్యాంధ్ర ప్రదేశ్‌కు మద్దతుగా 48 గంటల నిరశన దీక్ష చేస్తామని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇదివరకు ప్రకటించారు. అయితే ఎప్పుడు ఎక్కడ చేయాలన్న దానిపై నేతల మధ్య స్పష్టత లేకుండాపోయింది. హైదరాబాద్‌లోనే ఈ దీక్షలు చేపడతామని, అయితే ఎప్పుడు ఏ ప్రాంతంలో చేయాలన్న దానిపై గురువారం అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ సాకే శైలజానాథ్ చెప్పారు. -
ఢిల్లీ వెళ్లి లేఖ ఇవ్వు బాబూ: ద్రోణంరాజు
హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశాను.. అమెరికా అధ్యక్షుడ్ని మిస్టర్ క్లింటన్ అని పిలిచాను.. అప్పట్లో ఢిల్లీలో చక్రం తిప్పాను.. పిల్ల కాంగ్రెస్ ఎప్పటికైనా తల్లి కాంగ్రెస్‌లో కలిసిపోతుంది... వంటి పిచ్చి ప్రేలాపనలు మాని ఢిల్లీ వెళ్లి సమైక్యంగా రాష్ట్రాన్ని ఉంచాలని ప్రధానమంత్రిని కలసి లేఖ ఇచ్చి అప్పుడు యాత్రలు చేసుకోవాలని ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ చంద్రబాబు నాయుడుకు సూచించారు. ఆయన ఇక్కడ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, బాబు తీరుపై విరుచుకుపడ్డారు. ఊరంతా కాలిపోతుంటే కోడిపెట్టలు పట్టుకుపోయి విందు చేసుకుందామన్నట్టుగా సీమాంధ్ర అంతా సమైక్య రాష్ట్రం కోసం ఆందోళనలతో అట్టుడికిపోతుంటే టీడీపీ అధినేత మాత్రం ఆత్మ గౌరవయాత్ర పేరుతో ఎన్నికల యాత్ర నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే ఉద్యమాన్ని నీరుగార్చడానికే ఆయన దొంగ యాత్ర చేపట్టారని ఆరోపించారు. వారంరోజులుగా యాత్రలో చంద్రబాబు చేస్తున్న ప్రసంగాలను వింటే రాష్ట్రం విడిపోతున్నందుకు బాధ పడుతున్నట్టు ఎక్కడా మాట్లాడడం లేదని కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్‌లను మాత్రమే దుమ్మెత్తి పోస్తున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణకు వ్యతిరేకంగా లేఖ ఇవ్వకుండా నోటికొచ్చినట్టు వాగుతూ యాత్ర చేస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ‘తెలుగువాడిగా ఢిల్లీ వెళ్లు, నావల్ల ఘోర తప్పు జరిగిపోయింది, తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను ఇచ్చేయండి అని ఆ లేఖను తీసుకుని వచ్చి యాత్ర చేస్తే’ సీమాంధ్రులంతా జేజేలు కొడతారన్నారు. ఆ లేఖను వెనక్కి తీసుకోకుండా ఎన్ని యాత్రలు చేసినా తెలుగు ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. -
ఉండవల్లి ప్రసంగాన్ని అడ్డుకున్న టీ.ఎంపీలు
న్యూఢిల్లీ : సీమాంధ్రలో ఉదృతంగా సాగుతోన్న సమైక్య ఉద్యమాన్ని గురించి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం లోక్‌సభలో ప్రస్తావించారు. ఆయన తన ప్రసంగంలో ముల్కీ నిబంధనల అంశాన్ని ప్రస్తావించడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉండవల్లి ప్రసంగాన్ని వారు అడ్డుకున్నారు. సీమాంధ్ర ఉద్యమం దేశంలోనే పెద్దదని ఉండవల్లి అన్నారు. రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని విడదీయటం చరిత్రలో ఇదే మొదటిసారి అని తెలిపారు. ఈ నేపథ్యంలో సభ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుండటంతో టి కాంగ్ ఎంపీలను కూర్చోవాలని స్పీకర్ మీరాకుమార్ కోరారు. దీంతో గొడవ సద్దు మణిగింది. -
సీమాంధ్ర ప్రజలదీ ఒకటే శ్వాస.. ఒకటే ఘోష!!
‘హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం..’ కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి ఈ ప్రకటన వెలువడింది మొదలు ఇప్పటిదాకా సీమాంధ్రలో సమైక్య నినాదాలు మిన్నంటుతూనే ఉన్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా వాడవాడలా జనం రోడ్డెక్కుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం తప్ప తమకు మరే ప్రత్యామ్నాయం వద్దంటూ నినదిస్తున్నారు. ఊళ్లుఊళ్లన్నీ ఏకమై గత 35 రోజులుగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సాగుతున్న ఉద్యమం రోజురోజుకు ఉధృతం అవుతోంది. ఉద్యమం సాగుతున్న తీరుతెన్నులు, తీవ్రతపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. రాజకీయ అండ లేకుండా నెలరోజులకు పైగా ఉధృతంగా ఉద్యమం సాగడంపై అధ్యయనం చేసింది. ఉద్యోగులు, టీచర్లు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు.. ఇలా అన్ని వర్గాలు ఎవరికి వారు సంఘాలుగా ఏర్పడి స్వచ్ఛందంగా ఉద్యమంలో పాలుపంచుకుంటున్నట్లు ఇందులో తేలింది. 13 జిల్లాల్లో అనేక వర్గాలు ఎక్కడికక్కడ సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)లు ఏర్పాటు చేసుకున్నాయి. రాష్ట్రం విడిపోతే వచ్చే సమస్యలపై మేధావులు, ఉద్యోగ సంఘాల నేతలు, వివిధ రంగాల్లో నిపుణులు ప్రజలకు వివరిస్తున్నారు. విద్య, ఉపాధి, విద్యుత్, సాగునీటి రంగాల్లో తలెత్తే సమస్యలను విడమరచి చెబుతున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఎవరికి వారు తలా కొంత చందాలు వేసుకొని ఉద్యమాన్ని సొంతంగా నడిపిస్తున్నారు. ఉద్యోగులు తమ జీతాల్లో నుంచి దాచుకున్న సొమ్మును కొంత ఉద్యమానికి వెచ్చిస్తున్నారు. కొన్నిచోట్ల రిక్షా, ఆటో, చిరు వ్యాపారులు సైతం ఒకరోజు సంపాదనను విరాళంగా ఇచ్చారు. కూలీలు సైతం చందాలు వేసుకొని సమ్మె చేస్తున్నారు. మరికొన్నిచోట్ల వాటర్ ట్యాంకర్స్, ట్రాక్టర్స్, లారీ, టాక్సీ అసోసియేషన్లు ఒకరోజు అద్దెను ఉద్యమానికి అందించారు. ఈ విరాళాలన్నీ షామియానాలు, కుర్చీలు, ఫ్లెక్సీలు, తెలుగుతల్లి విగ్రహాలకు అభిషేకం చే సేందుకు పాలు, పూలదండల కోసం వెచ్చిస్తున్నారు. బైక్ ర్యాలీల సమయంలో ఎవరికి వారే సొంతంగా పెట్రోలు పోయించుకొని ఉద్యమంలో పాల్గొంటున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ వైద్యురాలు సమైక్యాంధ్ర ఉద్యమం కోసం ఇప్పటిదాకా సొంతంగా రూ.5 లక్షల దాకా ఖర్చు చేశారు. షామియానాలు, కుర్చీలు, మైక్సెట్ల కోసం ఈమె రోజుకు రూ.5 వేల దాకా అద్దె చెల్లించారు. అద్దె చెల్లించడం కంటే వీటన్నింటినీ ఒకేసారి మొత్తంగా కొనుగోలు చేయడం మేలని రూ.లక్ష వెచ్చించి కొన్నారు. ఇక రహదారులపై చేపడుతున్న వంటావార్పు కార్యక్రమాల్లో కుటుంబాలు వంతులవారీగా అన్నదానాలు చేస్తున్నాయి. పాత్రలు ఒకరు, వంటచెరకు ఒకరు, బియ్యం, ఉప్పు, పప్పులు ఒకరు.. ఇలా ఎవరి శక్తి మేర వారు అందిస్తున్నారు. కిరాణా షాపులవారు సైతం అవసరమైన సామగ్రిని ఉచితంగా ఇస్తున్నారు. ఎక్కడికక్కడ సంఘాలుగా ఏర్పడి.. సమైక్య ఉద్యమంలో భాగంగా ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతున్నా జనం స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సొంత పనులు సైతం పక్కన పెట్టి ఉద్యమంలో తమంత తాముగా భాగస్వాములు అవుతున్నారు. సాధారణంగా రాజకీయ పార్టీలు, నేతల పిలుపు మేరకు ప్రజలు తరలిరావడం చూస్తుంటాం. కానీ సమైక్య ఉద్యమంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రజలే ముందుండి నడుస్తుండగా.. రాజకీయ నేతలు వారి వెనకాల ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సమైక్య ఉద్యమంలో పాల్గొనని వర్గమంటూ లేదు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలు సంయుక్త కార్యాచరణ కమిటీలుగా ఏర్పడ్డాయి. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే.. మైనారిటీలు, కుల వృత్తులవారు, ఉపాధి హామీ పథకం కూలీలు, కోనసీమలో కొబ్బరి ఒలుపు కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మత్స్యకారులు, కుమ్మర్లు, కమ్మర్లు, కళాకారులు.. ఇలా ఎవరికి వారు సంఘాలుగా ఏర్పడి ఉద్యమానికి కదం తొక్కుతున్నారు. ప్రతీ సంఘం చందాలు వేసుకొని ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఇలా 54 జేఏసీలు ఏర్పడ్డాయి. మిగతా జిల్లాల్లో కూడా ఇలాగే సంఘాలు ఏర్పడ్డాయి. వైద్యులు, న్యాయవాదులు, వాకర్లు, విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, చివరికి గృహిణులు కూడా రోడ్లపైకి వచ్చిన సమైక్య గొంతును వినిపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జూలై 31 నుంచి న్యాయవాదులు విధులు బహిష్కరిస్తున్నారు. సమైక్య ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న వారికి ఉచితంగా న్యాయసాయం అందిస్తున్నారు. ఇప్పటిదాకా ఇలా 59 కేసులు ఉచితంగా వాదించి బెయిల్ మంజూరు చేయించారు. ప్రకాశం జిల్లాలో ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు తామే నిధులు సమకూర్చుకొని ఉద్యమం నిర్వహిస్తున్నారు. వారికి జిల్లా అధికారులు కూడా సహకరిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగుల కీలక పాత్ర.. సమైక్యాంధ్ర ఉద్యమంలో ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రం విడిపోతే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్న భావన విద్యార్థుల్లో బలంగా నెలకొంది. దీంతో వారు ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకుంటున్నారు. సెంట్రల్ వర్సిటీ, తెలుగు వర్సిటీ, ఐఐటీ, మూడు డీమ్డ్ యూనివర్సిటీలు, ట్రిపుల్ఐటీలతోపాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, నల్సార్, ఐఐసీటీ, సీసీఎంబీ, ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, నిఫ్ట్ వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, 350 ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయి. డిగ్రీ కాగానే ప్రతి విద్యార్థి హైదరాబాద్ వైపు చూసే పరిస్థితి నెలకొంది. చదువు పూర్తయిన తర్వాత కూడా ఉపాధి కోసం రాజధాని వైపే అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగితే ఈ ఉపాధి అవకాశాలు కనుమరుగైపోతాయన్న ఆందోళన విద్యార్థులను ఉద్యమం వైపు మళ్లిస్తోంది. హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన ఐటీ కంపెనీల్లో క్యాంపస్ సెలక్షన్లు, ఇంటర్వ్యూల ద్వారా సీమాంధ్ర విద్యార్థులు ఏటా పెద్దసంఖ్యలో ప్రవేశం పొందుతున్నారు. హైదరాబాద్ చేజారితే తమ విద్యార్థులకు ఈ మార్గాలన్నీ మూసుకుపోతాయని ఇంజనీరింగ్ కాలేజీలు భావిస్తున్నాయి. ఈ కాలేజీలన్నింటికీ పాఠశాలలు కూడా ఉండడంతో విద్యార్థులను కూడా ఆందోళనల్లో భాగస్వాములు చేస్తున్నాయి. ఉద్యోగ వర్గాన్ని కూడా అనేక సమస్యలను తొలగిస్తున్నాయి. రాష్ట్ర ఆదాయంలో 50 శాతానికి పైగా హైదరాబాద్ నుంచే వస్తుండగా, 13 జిల్లాల సీమాంధ్రలో ఇది 23 శాతంగా ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఈ ఆదాయంతో ఉద్యోగులకు జీతాలు కూడా వచ్చే అవకాశం ఉండదన్నది వారి భావన. లక్షల సంఖ్యలో ఉన్న పెన్షనర్లూ ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. అందరి మాట ‘హైదరాబాదే’.. రాజధాని హైదరాబాద్‌తో సీమాంధ్రులు దశాబ్దాలుగా అనుబంధం పెంచుకున్నారు. చాలామంది తమవారు హైదరాబాద్‌లో ఉన్నారని, రాష్ట్రం విడిపోతే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే సగం కుటుంబాలకు హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. మిగతా జిల్లాల నుంచి రాజధానికి వచ్చి ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ స్థిరపడినవారు లక్షల్లో ఉన్నారు. ‘‘మా కుటుంబంలో ఇద్దరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. కుమార్తె బీటెక్ చేసిన తర్వాత హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సోదరుడు రామారావు ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. విభజన జరిగితే వారిద్దరికీ ఇబ్బందులు తప్పవు. అందుకే ఉద్యమంలో పాల్గొంటున్నా’’ అని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పంచిరెడ్డి ఆదినారాయణ చెప్పారు. ‘‘మనది అనుకున్న హైదరాబాద్ దూరమవుతుందన్న భావనే ప్రజలను ఉద్యమం వైపు మళ్లిస్తోంది. దీంతోపాటు నీటి పంపకాల్లో గొడవలు, ఆత్మగౌరవం దెబ్బతింటుందన్న కారణాలతోనే ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంది’’ అని అనంతపురం జిల్లా ఎన్జీవో సంఘం అధ్యక్షుడు దేవరాజు వ్యాఖ్యానించారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ సిబ్బంది కూడా విభజనపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘‘అధిక లాభాలు వచ్చే డిపోలన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. ఆర్టీసీకి ఉన్న రూ.20 వేల కోట్ల ఆస్తుల్లో రూ.15 వేల కోట్ల ఆస్తులు తెలంగాణలోనే ఉన్నాయి. విభజనతో సీమాంధ్ర కార్మికులకు జీతాలొచ్చే పరిస్థితి ఉండదు’’ అని నెల్లూరు జిల్లాకు చెందిన ఆర్టీసీ జేఏసీ నాయకులు పెంచలరెడ్డి పేర్కొన్నారు. రైతుల్లో ‘సాగునీరు’ ఆందోళన.. రాష్ట్రాన్ని విడదీస్తే సీమాంధ్ర ఎడారిగా మారిపోతుందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన వాటాయే సరిగ్గా రావడం లేదు. మహారాష్ట్ర, కర్ణాటకలు నీటిని కిందకు వదలక ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఫలితంగా నాగార్జునసాగర్‌కు నీటి ప్రవాహం తగ్గుతుండడంతో కృష్ణా ఆయకట్టుకు తీరని నష్టం వాటిల్లుతోంది. గోదావరిపై పోలవరం నిర్మించినా దానికి నీరు ఎలా వస్తుందన్న అంశంపై స్పష్టత లేదు. ఈ ప్రాజెక్టు పూర్తికాకుంటే గోదావరి మిగులు జలాలు కృష్ణాలోకి మళ్లించడం సాధ్యం కాదు. ఇదే జరిగితే అనేక ఎత్తిపోతల పథకాలు, చెక్‌డ్యాములు వట్టిపోతాయని, తమ పంటలకు నీరు అందదని రైతులు పేర్కొంటున్నారు. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే గత ఏడాది సాగర్ నుంచి కృష్ణా ఆయకట్టుకు నీరు రాని పరిస్థితి ఉంది. ఈ ఏడాది కూడా జూలైలో నీరు విడుదల చేసినా సాగర్‌కు వరదలు వస్తేగానీ ఆయకట్టుకు నీరివ్వలేదు. ఇక రాష్ట్రం విడిపోతే డెల్టా పరిధిలో లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందే పరిస్థితి ఉండదన్న భయం రైతులను వెంటాడుతోంది. ఫలితంగా అన్నదాతలు కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనంటూ రోడ్డెక్కుతున్నారు. ఊరుఊరంతా ‘గర్జన’ సమైక్య పోరులో భాగంగా నిర్వహిస్తున్న ‘గర్జన’లకు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వస్తోంది. ఎక్కడ ఈ కార్యక్రమం నిర్వహించినా ఊరుఊరంతా కదలి వెళ్లోంది. ఇప్పటిదాకా నిర్వహించిన గర్జనలు ఇవీ.. అనంతపురం జిల్లాలో.. హా ఆగస్టు 29న కదిరిలో ‘ఖాద్రీ లక్ష జన గర్జన’, సెప్టెంబర్ 2న ధర్మవరంలో ‘లక్ష గళ ఘోష’, సెప్టెంబర్ 3న అనంతపురంలో ‘అనంత జన గర్జన’ వైఎస్ఆర్ జిల్లాలో.. హా ఆగస్టు 31న కడపలో ‘ద్విలక్ష గళార్చన’ గుంటూరు జిల్లాలో.. హా ఈనెల 3న నరసరావుపేటలో ‘లక్షగళ ఘోష’ కర్నూలు జిల్లాలో.. హా ఆగస్టు 22న కర్నూలులో, ఆగస్టు 27న నంద్యాలలో, ఆగస్టు 31న ఎమ్మిగనూరులో, ఈనెల 3న ఆదోనిలో ‘లక్షగళ ఘోష’ ప్రకాశం జిల్లాలో.. హా ఒంగోలులో సెప్టెంబర్ 2న ‘ప్రకాశం ప్రజాగర్జన’ కృష్ణా జిల్లాలో.. హా ఆగస్టు 29న విజయవాడలో, ఆగస్టు 31 ఉయ్యూరులో ‘లక్షగళ ఘోష’ చిత్తూరు జిల్లా.. హా ఆగస్టు 26న మదనపల్లెలో ‘లక్ష గళార్చన’ పశ్చిమగోదావరి జిల్లా.. హా ఆగస్టు 24న భీమవరంలో ‘లక్ష గర్జన’ హా ఆగస్టు 25న ఏలూరులో 1,500 మంది విద్యార్థులు ‘జై సమైక్యాంధ్ర’ నినాదాన్ని తెల్లకాగితాలపై 5 లక్షల సార్లు రాసి జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. హా ఈనెల 3న భీమవరంలో ‘కోటి గర్జన’