ఢిల్లీ వెళ్లి లేఖ ఇవ్వు బాబూ: ద్రోణంరాజు | Dronamraju Srinivas Attack on Chandrababu Naidu | Sakshi

ఢిల్లీ వెళ్లి లేఖ ఇవ్వు బాబూ: ద్రోణంరాజు

Sep 8 2013 9:58 PM | Updated on May 3 2018 3:17 PM

సీమాంధ్ర అంతా సమైక్య రాష్ట్రం కోసం ఆందోళనలతో అట్టుడికిపోతుంటే టీడీపీ అధినేత మాత్రం ఆత్మ గౌరవయాత్ర పేరుతో ఎన్నికల యాత్ర నిర్వహిస్తున్నారని ద్రోణంరాజు శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.

హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశాను.. అమెరికా అధ్యక్షుడ్ని మిస్టర్ క్లింటన్ అని పిలిచాను.. అప్పట్లో ఢిల్లీలో చక్రం తిప్పాను.. పిల్ల కాంగ్రెస్ ఎప్పటికైనా తల్లి కాంగ్రెస్‌లో కలిసిపోతుంది... వంటి పిచ్చి ప్రేలాపనలు మాని ఢిల్లీ వెళ్లి సమైక్యంగా రాష్ట్రాన్ని ఉంచాలని ప్రధానమంత్రిని కలసి లేఖ ఇచ్చి అప్పుడు యాత్రలు చేసుకోవాలని ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ చంద్రబాబు నాయుడుకు సూచించారు.

ఆయన ఇక్కడ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, బాబు తీరుపై  విరుచుకుపడ్డారు. ఊరంతా కాలిపోతుంటే కోడిపెట్టలు పట్టుకుపోయి విందు చేసుకుందామన్నట్టుగా సీమాంధ్ర అంతా సమైక్య రాష్ట్రం కోసం ఆందోళనలతో అట్టుడికిపోతుంటే టీడీపీ అధినేత మాత్రం ఆత్మ గౌరవయాత్ర పేరుతో ఎన్నికల యాత్ర నిర్వహిస్తున్నారని  ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే ఉద్యమాన్ని నీరుగార్చడానికే ఆయన దొంగ యాత్ర చేపట్టారని ఆరోపించారు.

వారంరోజులుగా యాత్రలో చంద్రబాబు చేస్తున్న ప్రసంగాలను వింటే రాష్ట్రం విడిపోతున్నందుకు బాధ పడుతున్నట్టు ఎక్కడా మాట్లాడడం లేదని కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లను మాత్రమే దుమ్మెత్తి పోస్తున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణకు వ్యతిరేకంగా లేఖ ఇవ్వకుండా నోటికొచ్చినట్టు వాగుతూ యాత్ర చేస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.

‘తెలుగువాడిగా ఢిల్లీ వెళ్లు, నావల్ల ఘోర తప్పు జరిగిపోయింది, తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను ఇచ్చేయండి అని ఆ లేఖను తీసుకుని వచ్చి యాత్ర చేస్తే’ సీమాంధ్రులంతా జేజేలు కొడతారన్నారు. ఆ లేఖను వెనక్కి తీసుకోకుండా ఎన్ని యాత్రలు చేసినా తెలుగు ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement