రామయ్యా వస్తాడా... అత్తారింటికి వెళ్తాడా?
రామయ్యా వస్తాడా... అత్తారింటికి వెళ్తాడా?
Published Thu, Sep 19 2013 3:17 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
టాలీవుడ్ లో భారీ చిత్రాల నిర్మాతలను సమైక్యాంధ్ర ఉద్యమం గందరగోళంలో పడేసింది. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం జోరుగా సాగుతుండటంతో భారీ చిత్రాల విడుదలకు ఆటంకం ఏర్పడింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చిత్ర పరిశ్రమకు ప్రతికూలంగా మారడంతో అగ్రనిర్మాతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొద్దికాలం క్రితం తెలంగాణలో ఉద్యమ ప్రభావంతో ఉక్కిరిబిక్కిరైన నిర్మాతలు.. కాస్తా తేరుకుని ఊపిరి పీల్చుకునే సమయంలోనే రాష్ట్ర విభజన ప్రకటన మళ్లీ ఇబ్బందుల్లోకి వారిని నెట్టింది. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం భగ్గుమంది. అయితే రాష్ట్ర విభజన సమస్యకు తొందర్లోనే పరిష్కారం దొరుకుందని, త్వరలోనే సినిమాల విడుదల చేయవచ్చని ఆశించిన నిర్మాతలకు చుక్కెదురైంది.
పలుమార్లు చిత్ర విడుదల తేదిన ప్రకటించి.. వాయిదా పరిస్థితి తెలెత్తింది. విడుదల తేదిని ప్రకటించిన వాయిదా వేసిన వాటిలో ఎవడు, అత్తారింటికి దారేది? రామయ్యా వస్తావయ్యా లాంటి భారీ చిత్రాలున్నాయి. ఓ దశలో ఓ చిత్ర నిర్మాతకు పెద్ద మొత్తంలో టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని అనధికారికంగా వార్తలు వెలువడ్డాయి. అయితే విడుదల వాయిదా పడి.. నెలకు పైగా వేచి ఉండాల్సి పరిస్థితి తెలెత్తడంతో ఆర్ధిక సమస్యలు ప్రారంభమైనట్టు తెలిసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే చిత్ర నిర్మాణం నుంచి తప్పుకునేందుకైనా సిద్ధం అన్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆరంభంలో ఉన్న పరిస్థితి కొంత సద్దుమణిగినట్టు కనిపించగానే చిన్న చిత్రాలు విడుదల జోరందుకుంది. అంతకుముందు..ఆ తర్వాత, పోటుగాడు, కమీనా, కిస్ లాంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. చిన్న చిత్రాలకు సమైక్య ఉద్యమకారుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకపోవడం గమనించిన చిత్ర పరిశ్రమ ప్రముఖులు భారీ చిత్రాల విడుదల తేదిలను ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది?', యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రం 'రామయ్య వస్తావయ్యా', రామ్ చరణ్ 'ఎవడు' సమైక్యాంధ్ర ఉద్యమ సెగతో విడుదలకు నోచుకోలేకపోయాయి. అయితే విజయదశమి కానుకగా భారీ చిత్రాల విడుదలకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేశారు. సాధారణంగా దసరా, దీపావళి, సంక్రాంతి పండగల అంటేనే టాలీవుడ్ లో భారీ చిత్రాలతో నిజమైన పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుత పరిస్థితులను బేరిజు వేసుకుని నిర్మాతలు కొంత ధైర్యాన్ని కూడగట్టుకుని విడుదల తేదిని ప్రకటించినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 9 తేదిన అత్తారింటికి దారేది?, 10 తేదిన రామయ్యా వస్తావయ్యా చిత్రాల విడుదలకు సన్నద్దం చేస్తున్నారు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందిన జూనియర్ ఎన్టీఆర్ చిత్రం రామయ్యా వస్తావయ్యా చిత్రాన్ని అక్టోబర్ 10 తేదిన విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 2008 అక్టోబర్ 9న కొత్త బంగారులోకం, 2010 అక్టోబర్ 14న బృందావనం విడుదలై సూపర్ హిట్ ను సాధించాయి. ఈ విజయదశమి సందర్భంగా 2013 అక్టోబర్ 10న రామయ్యా వస్తావయ్యా చిత్రంతో హ్యట్రిక్ సాధించేందుకు సిద్దమవుతున్నాము అని అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియో విడుదలతో భారీ అంచాలు నెలకొన్న అత్తారింటికి దారేది చిత్రాన్ని దసరా పండుగ కానుకగా అక్టోబర్ 9న విడుదల చేస్తున్నట్టు నిర్మాత బి.ప్రసాద్ తెలిపారు.
అయితే ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తే... సమైక్య ఉద్యమం జోరు ఏమాత్రం తగ్గకపోగా.. సెప్టెంబర్ నెలాఖరుకు మరికొంత ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ రాష్ట్ర విభజనపై నోట్ పై కేంద్ర ప్రభుత్వం ఏదైనా స్పష్టత ఇస్తే.. సీమాంధ్రలో ఉద్యమం మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ అలాంటి పరిస్థితే తలెత్తితే..అత్తారింటికి దారేది..రామయ్యా వస్తావయ్యా చిత్రాల విడుదల ప్రశ్నార్ధకమే. ఈ నేపథ్యంలో చిత్రాలు మరోసారి వాయిదా పడితే...ప్రేక్షకుల వద్దకు రామయ్యా వస్తాడా.. అత్తారింటికి వెళ్తారా అనేది సందేహమే. మళ్లీ అగ్ర నటుల చిత్రాలు మరోసారి వాయిదా పడితే సినిమా ప్రేక్షకులకు ఈ సంవత్సరపు దసరా సినీ పండుగ వాతావరణం దూరమైనట్టే.
-రాజాబాబు అనుముల
a.rajababu@sakshi.com
Advertisement
Advertisement