Ramayya vastavayya
-
అతనితో నా ప్రేమకు బ్రేకప్ ఉండదు - సమంత
సమంత అంటేనే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. ఆమె మాటల్లో కూడా బోల్డ్నెస్, ఓ బ్యూటీ కనిపిస్తాయి. తనతో మాట్లాడుతూ ఉంటే కాలం ఘనీభవించినట్టే అనిపిస్తుంది. తన ఫ్లాష్‌బ్యాక్, లవ్‌ట్రాక్, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి సమంత ‘సాక్షి’తో ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ‘‘ప్రేమ అనేది గుర్రపు స్వారీ చేయడం, ఫ్రెంచ్ నేర్చుకోవడంలాంటిది. యంగ్‌గా ఉన్నప్పుడే ప్రేమ విలువ తెలుసుకోవాలి. లేకపోతే పెద్దయిన తర్వాత కష్టం’’ అని ‘వాట్సప్’ అనే సోషల్ నెట్‌వర్క్‌లో పెట్టారు. దానర్థం ఏంటి? చిన్నప్పుడు నేను ఎవర్నీ పట్టించుకునేదాన్ని కాదు. చివరికి నా ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా. చాలా స్వార్థంగా ఉండేదాన్ని. నా గురించి మాత్రమే ఆలోచించుకునేదాన్ని. నేనెలా పైకి రావాలి? ఎలా డబ్బులు సంపాదించాలి? ఇదే ఆలోచన తప్ప ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలి? ఎంత ప్రేమగా ఉండాలి? అనే విషయాలు తెలిసేవి కావు. కానీ, ఈ మధ్యే తెలిసొచ్చింది. అప్పట్నుంచీ నా కుటుంబ సభ్యులను ప్రేమించడం మొదలుపెట్టాను. వాళ్ల కోసం టైమ్ కేటాయిస్తున్నాను. ఆ నేపథ్యంలోనే ఈ ప్రేమ గురించి అలా ‘వాట్సప్’లో నా ఉద్దేశాన్ని ప్రకటించాను. డబ్బులు సంపాదించాలనే తపన అందరికీ ఉంటుంది. పర్టిక్యులర్‌గా మీకు వేరే కారణం ఏదైనా ఉందా? మాది సాదాసీదా కుటుంబం. ఆర్థిక ఇబ్బందులు మామూలుగా ఉండేవి కావు. ఏది కొనుక్కోవాలన్నా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. నచ్చిన ఆహారం తినడానికి కూడా కుదిరేది కాదు. అందుకే ఓ సొంత ఇల్లు, ఓ కారు, కొంత బ్యాంక్ బాలెన్స్‌తో హాయిగా సెటిలవ్వాలని ఉండేది. ఆ ఆశయాన్ని నెరవేర్చుకోవడం కోసం బాగా చదువుకునేదాన్ని. పెద్ద జాబ్‌లో సెటిలవ్వాలని ఉండేది. దేవుడు మీరు కోరుకున్నదాన్నికన్నా ఎక్కువే ఇచ్చాడు కదా? నిజంగానే ఈ జీవితం ఆ దేవుడి దయే. సినిమాల్లోకి వస్తానని నేననుకోలేదు. అంతా అనుకోకుండా జరిగింది. నేనూహించనంత బ్యాంక్ బాలెన్స్ సంపాదించుకున్నాను. అందుకేనా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? అవును. వాస్తవానికి గత ఏడాది వరకు నాకిలాంటి ఫీలింగ్స్ ఉండేవి కావు. ఎప్పుడైతే ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొన్నానో, జయాపజయాలు చవి చూశానో... అప్పుడు ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నాను. ఓ రకంగా కనువిప్పు కలిగింది. అందుకే వీలైనంత వరకూ ఇతరులకు సహాయపడాలని నిర్ణయించుకున్నాను. ఏదైనా సేవా సంస్థ పెట్టేటప్పుడు ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇవన్నీ జరగడానికి దాదాపు రెండు నెలలు పడుతుంది. అప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి ఈ ఫౌండేషన్ వివరాలు తెలియజేయాలనుకుంటున్నా. డబ్బు లేనప్పుడు, డబ్బు ఉన్నప్పుడు మీలో వచ్చిన మార్పు? అప్పుడు నా గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచించేదాన్ని కాదు. కడుపు నిండిన బేరం అంటారు కదా.. అది నిజమే. కడుపు నిండినవాళ్లు ఏదైనా మాట్లాడతారు. నన్నే తీసుకోండి.. ఇప్పుడే ఏదైనా విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలంటే తడుముకోకుండా, తడబాటు లేకుండా తీసేసుకుంటాను. కానీ, డబ్బుల్లేకపోతే ఏ విషయంలోనూ ఓ పట్టాన నిర్ణయం తీసుకోలేం. ఆ కారణంగానే డబ్బుల్లేనివాళ్ల గురించి నేను ఈజీగా ఓ జడ్జ్మెంట్కి వచ్చేయను. వాళ్లకి రకరకాల సమస్యలుంటాయి. ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను కాబట్టి, ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే వాళ్లవైపు నుంచి ఆలోచిస్తాను. అంతస్తుతో సంబంధం లేకుండా అందరితోనూ సమానంగా ఉంటాను. ఇంతకీ మీ ప్రేమ ప్రయాణం ఎలా సాగుతోంది? చాలా బలంగా సాగుతోంది. మా ప్రేమకు ‘బ్రేకప్’ ఉండదు. అంత అవగాహనతో ముందుకెళుతున్నాం. మీకు ఆల్రెడీ పెళ్లయ్యిందని టాక్? అయితే అయ్యిందని చెబుతాను. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. నాలానే తనూ అబద్ధాలు అడటానికి ఇష్టపడడు. ఇంతకీ ఆ అతగాడి పేరు సిద్దార్ధ్ అని కన్ఫర్మ్ చేస్తారా? అది మాత్రం అడగొద్దు. మరి.. పెళ్లెప్పుడు చేసుకుంటారు? ఇప్పుడప్పుడే లేదు. ఇంకా చాలా సమయం పడుతుంది. అప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటా. ఓకే... ‘రామయ్యా వస్తావయ్యా’ విషయానికొద్దాం. ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం? ఎన్టీఆర్, హరీష్‌శంకర్, ‘దిల్’ రాజు కాంబినేషన్లో సినిమా కాబట్టి చేయాలనుకున్నాను. కథ, పాత్ర నచ్చాయి. ఈ కారణాల వల్లే ఒప్పుకున్నాను. పెద్ద బడ్జెట్ మూవీ, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్లో చేయాలనే సంకల్పంతో కూడా ఈ సినిమా అంగీకరించాను. కమర్షియల్ సినిమా మీద దృష్టి పెట్టారెందుకని? గత ఏడాది నేను చేసిన ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు ప్రయోగాత్మక చిత్రాలు. ముఖ్యంగా ‘ఈగ’తో సినిమా ఏంటని కొంతమంది అన్నారు. ఆ సినిమాలో నేను సాదాసీదాగా కనిపిస్తాను. అలాగే, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’లో కూడా అంతే. దాంతో సమంత గ్లామరస్ రోల్స్‌కి పనికి రాదని, పెద్ద బడ్జెట్ సినిమాలకు సూట్ కాదని కొంతమంది అన్నారు. అందుకే ఈ ఏడాది హైలీ కమర్షియల్ మూవీస్‌లో నటించాలనుకున్నా. ఇకముందు కూడా ఇలాంటి సినిమాలే చేస్తారా? లేదు. ఎందుకంటే సమంత గ్లామరస్ మాత్రమే చేయగలదనో, డీ-గ్లామర్‌కే పనికొస్తుందనో ఏదో ఒక ముద్ర నా మీద పడకూడదు. అందుకే, అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది. తమిళంలో తీసిన పిజ్జా, సూదు కవ్వమ్లాంటి చిన్న బడ్జెట్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్‌లో కూడా నటించాలని ఉంది. అప్పుడు మీ పారితోషికం తగ్గించుకోవాల్సి ఉంటుందేమో? తగ్గించుకుంటా. స్క్రిప్ట్ బాగా నచ్చిందనుకోండి చిన్న బడ్జెట్ చిత్రం కాబట్టి ముందే పారితోషికం డిమాండ్ చేయకుండా లాభాల్లో ఇంత పర్సంట్ ఇస్తే చాలంటాను. ‘రామయ్యా వస్తావయ్యా..’ని ఎందుకు చూడాలంటే ఏం చెబుతారు? తారక్ అద్భుతంగా నటించిన వైనం, తన లుక్స్ కోసం చూడొచ్చు. డాన్సులు, ఫైట్స్ బాగా చేశారు. ఆయన అభిమానులకు ఓ మంచి ఫీస్ట్లాంటిది. ఇక, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లున్నాం. వాళ్ల కోసం కూడా చూడొచ్చు (నవ్వుతూ). ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది కదా? అది ప్రతి సినిమాకీ వస్తుంది. కానీ మనం పరిగణనలోకి తీసుకోవాల్సింది వసూళ్లనే. నాకు తెలిసి ప్రేక్షకులు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. - డి.జి. భవాని -
ప్రేక్షకుల అంచనాలకు దూరంగా 'రామయ్యా వస్తావయ్యా'
గత కొద్దికాలంగా భారీ విజయం కోసం ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్, 'గబ్బర్ సింగ్' లాంటి సంచలన విజయం దక్కించుకున్న హరీష్ శంకర్ కలయికలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం ప్రేక్షకుల వద్దకు వస్తుందంటే భారీ అంచనాలు ఉండటం సహజం. అలాంటి భారీ అంచనాలకు తోడుగా దిల్ రాజు నిర్మాణ సారధ్యం.. ఇటీవల కాలంలో వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న సమంత.. గబ్బర్ సింగ్ హిట్ తో శృతి హాసన్ ఈ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టారు. వీటన్నింటికి తోడు తమన్ సంగీతం.. హరీష్ శంకర్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం అక్టోబర్ 11 తేదిన సినీ అభిమానులు ముందుకు వచ్చింది. అయితే సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నింపిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం ఏమేరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అల్లరి చిల్లరిగా తిరిగే రాము ఉరఫ్ నందు అనే స్టూడెంట్.. ఆకర్ష అనే అమ్మాయి ప్రేమలో పడుతాడు.. తన ప్రేమను ఒప్పింపి..మెప్పించడంలో సఫలమవుతాడు. అయితే ఆకర్ష అక్క పెళ్లికి అతిధిగా రాము వెళుతాడు. పెళ్లికి వెళ్లిన రాము ఆకర్ష తండ్రిని దారుణంగా చంపుతాడు. తాను ఇష్టంగా ప్రేమించిన అమ్మాయి తండ్రిని రాము ఎందుకు చంపాల్సి వచ్చింది? అందుకు కారణాలేమిటి అనే ప్రశ్నలకు సమాధానమే 'రామయ్యా వస్తావయ్యా'. డైలాగ్స్ పేల్చడంలో.. డాన్స్ లను ఇరగదీయడంలో... ఫెర్మార్మెన్స్ తో మంత్రముగ్ధుల్ని చేయడంలో యువతరం నటుల్లోజూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక్కరనేది కాదనలేం. గతంలో తన చిత్రాలతో జూనియర్ ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకున్నాడు కూడా.. అయితే ఇటీవల కాలంలో జూనియర్ కథలను ఎంచుకోవడంలో కొంత తడబాటుకు గురవుతున్నాడని ఇటీవల ట్రాక్ రికార్డును తిరిగేస్తే స్పష్టంగా అర్ధమవుతోంది. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, ఎమోషన్స్, కామెడీ అంశాలతో మూస చిత్రాలకే పరిమితం అవుతున్నాడనేది పరిశ్రమలోనూ, అభిమానుల్లోనూ ఓ వాదన. ఆ వాదనకు తగ్గట్టూగానే ఎన్టీఆర్ రామయ్యా వస్తావయ్యా చిత్రాని అంగీకరించాడేమో అనిపిస్తుంది. రామయ్య వస్తావయ్యా చిత్రంలో రాము పాత్ర జూనియర్ ఎన్టీఆర్ కు ఖచ్చితంగా సరిపోయే పాత్రనే. కాని.. జూనియర్ నుంచి అభిమానులు, ప్రేక్షకులు వైవిధ్యమైన చిత్రాలను ఆశిస్తున్నారనే అంశం ప్రస్తుతం గమనించాల్సిన అంశం. రాము పాత్రకు జూనియర్ పూర్తి న్యాయం చేశాడనే విషయంలో డౌట్ అనవసరం. ఇంకా ఆకర్ష పాత్రలో సమంత మళ్లీ గ్లామర్ కే పరిమితమైంది. తనకు పాత్ర పరిధి మేరకు బాగానే చేసింది. గ్లామర్ తోపాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న అమ్ములు పాత్రను శృతి హసన్ అతిధి పాత్ర రూపంలో దక్కించుకుంది. ద్వితీయార్ధంలో అమ్ములు పాత్ర సినిమాకు కొంత బలాన్ని ఇచ్చింది. హంస నందిని క్లైమాక్స్ లో పాటలో మెరుపులా కనిపించినా.. అంత ప్రాధాన్యత ఉన్న పాత్రేమి కాదు. సినిమా తొలి భాగంలో విద్యుల్లేఖ రామన్ (ఎటో వెళ్లి పోయింది మనసు ఫేం) కామెడి ఆకట్టుకోలేకపోయింది. రావు రమేశ్, రవి శంకర్, కోట శ్రీనివాస్ రావు ఓకే అనిపించారు. చాలా కాలం తర్వాత తెలుగు తెరపై ఓ మోడ్రన్ పాత్రలో రోహిణి హట్టంగడి కనిపించింది. శ్రీ మణి రాసిన 'పండగ చేస్కో', 'కుర్ర ఈడు', 'ఇది రణరంగం' బాగా ఉన్నాయి. అనంత శ్రీరాం రచించిన 'జాబిల్లి', 'ఓ లైలా'(భాస్కరభట్ల), 'నేను ఎపుడైనా' లాంటి సాహిత్య విలువలున్న పాటలకు తమన్ అందించిన స్వరాలు ప్రేక్షకుల్ని ఆలరించాయి. చోటా కే నాయుడు సినిమాటోగ్రఫి పర్వాలేదనిపించింది. ఇక 'ట్రెండ్ ఫాలోకాను.. క్రియేట్ చేస్తాను' అంటూ గబ్బర్ సింగ్ లో అదరగొట్టిన దర్శకుడు హరీష్ శంకర్ .. రామయ్యా వస్తావయ్యా లాంటి మూస కథను ఎందుకు ఎంచుకున్నాడో అర్ధం కాదు. ఎప్పుడో 80 దశకాల్లో వర్కవుట్ అయ్యే కథ ప్రస్తుత ట్రెండ్ కు ఎలా సరిపోతుందనేది అర్ధం కాని విషయం. పగ, ప్రతీకారం ఎలిమెంట్స్ తో ప్రేక్షకులతోపాటు, సినిమాని కూడా నలిపేశాడు. గబ్బర్ సింగ్ కు ముందు యావరేజ్ దర్శకుడిగా బ్రాండ్ ఉన్న హరీష్... తన రేంజ్ అదేనని ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడా అనిపించింది. ఎన్టీఆర్ ఎనర్జీ, సమంత, శృతి హసన్ గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్, మంచి సంగీతాన్ని అందించిన తమన్ కృషిని, ప్రముఖ నటి రోహిణి హట్టంగడి ప్రతిభను వినియోగించుకోవడంలో హరీష్ శంకర్ పూర్తిగా విఫలమయ్యాడు. వైవిధ్యంలేని కథను ఎంచుకున్న హరీష్ .. తన కథనంతో ప్రేక్షకుడ్ని విసిగించాడు. మంచి చిత్రాన్ని రూపొందించడానికి పూర్తి స్వేచ్చను ఇచ్చామని చెప్పిన దిల్ రాజు.. కాస్తా కంట్రోల్ చేసి ఉంటే దసరా సెంటిమెంట్ ఖచ్చితంగా వర్కవుట్ అయ్యుండేది. 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం విజయం సాధిస్తే ఎన్టీఆర్, సమంత, శృతి హసన్, తమన్ లకు ఆ క్రిడెట్ దక్కుతుంది. ఒకవేళ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతే దర్శకుడిగా హరీష్ శంకర్ కారణమని చెప్పవచ్చు. ఏది ఏమైనా భారీ అంచనాలతో థియేటర్ కు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ లకు అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఊహించని నిరాశే ఎదురవ్వడం ఖాయం. -రాజబాబు అనుముల a.rajababu@sakshi.com For the latest stories, you can like Sakshi News on Facebook and also follow us on Twitter. Get the Sakshi News app for Android or iOS -
గీత స్మరణం
పల్లవి : అతడు: నేనెప్పుడైనా అనుకున్నానా కనురెప్ప మూసి కలగన్నానా పెను ఉప్పెనల్లే ఎద ఉప్పొంగేనని ప్రేమలో ఆమె: గువ్వంత గుండెలో ఇన్నాళ్లు రవ్వంత సవ్వడి రాలేదు మువ్వంత సందడిగా అలజడి రేగే ఎందుకో బృందం: కనులు కనులు కలిసే కలలే అలలై ఎగసే మనసు మనసు మురిసే మధువై పెదవే తడిసే తెరలే తొడిగే సొగసే కురులే విరులై విరిసే ॥ చరణం : 1 ఆ: ఓ... కన్నె కస్తూరినంత నేనై వన్నె ముస్తాబు చేసుకోనా చేరే నీకు కాశ్మీరాలా చలే పంచనా అ: ఇంటికింపైన రూపు నీవే కంటిరెప్పైన వేయనీవే ఆ: నిండు కౌగిళ్లలో రెండు నా కళ్లలో నిన్ను నూరేళ్లు బంధించనా ॥॥ చరణం : 2 ఆ: ఓ... మల్లెపూదారులన్నీ నీవై మంచు పన్నీరులన్నీ నేనై వసంతాల వలసే పోదా సుఖాంతాలకే అ: జంట సందేళలన్నీ నేనై కొంటె సయ్యాటలన్నీ నీవై ఆ: నువ్వు నాలోకమై నేను నీ మైకమై ఏకమౌదాము ఈనాడిలా ॥ చిత్రం : రామయ్యా వస్తావయ్యా (2013) రచన : సాహితి సంగీతం : ఎస్.ఎస్.థమన్ గానం : శంకర్ మహదేవన్, శ్రేయాఘోషల్, బృందం - నిర్వహణ: నాగేష్ -
రామయ్యా వస్తాడా... అత్తారింటికి వెళ్తాడా?
టాలీవుడ్ లో భారీ చిత్రాల నిర్మాతలను సమైక్యాంధ్ర ఉద్యమం గందరగోళంలో పడేసింది. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం జోరుగా సాగుతుండటంతో భారీ చిత్రాల విడుదలకు ఆటంకం ఏర్పడింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చిత్ర పరిశ్రమకు ప్రతికూలంగా మారడంతో అగ్రనిర్మాతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొద్దికాలం క్రితం తెలంగాణలో ఉద్యమ ప్రభావంతో ఉక్కిరిబిక్కిరైన నిర్మాతలు.. కాస్తా తేరుకుని ఊపిరి పీల్చుకునే సమయంలోనే రాష్ట్ర విభజన ప్రకటన మళ్లీ ఇబ్బందుల్లోకి వారిని నెట్టింది. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం భగ్గుమంది. అయితే రాష్ట్ర విభజన సమస్యకు తొందర్లోనే పరిష్కారం దొరుకుందని, త్వరలోనే సినిమాల విడుదల చేయవచ్చని ఆశించిన నిర్మాతలకు చుక్కెదురైంది. పలుమార్లు చిత్ర విడుదల తేదిన ప్రకటించి.. వాయిదా పరిస్థితి తెలెత్తింది. విడుదల తేదిని ప్రకటించిన వాయిదా వేసిన వాటిలో ఎవడు, అత్తారింటికి దారేది? రామయ్యా వస్తావయ్యా లాంటి భారీ చిత్రాలున్నాయి. ఓ దశలో ఓ చిత్ర నిర్మాతకు పెద్ద మొత్తంలో టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని అనధికారికంగా వార్తలు వెలువడ్డాయి. అయితే విడుదల వాయిదా పడి.. నెలకు పైగా వేచి ఉండాల్సి పరిస్థితి తెలెత్తడంతో ఆర్ధిక సమస్యలు ప్రారంభమైనట్టు తెలిసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే చిత్ర నిర్మాణం నుంచి తప్పుకునేందుకైనా సిద్ధం అన్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆరంభంలో ఉన్న పరిస్థితి కొంత సద్దుమణిగినట్టు కనిపించగానే చిన్న చిత్రాలు విడుదల జోరందుకుంది. అంతకుముందు..ఆ తర్వాత, పోటుగాడు, కమీనా, కిస్ లాంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. చిన్న చిత్రాలకు సమైక్య ఉద్యమకారుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకపోవడం గమనించిన చిత్ర పరిశ్రమ ప్రముఖులు భారీ చిత్రాల విడుదల తేదిలను ప్రకటించారు. పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది?', యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రం 'రామయ్య వస్తావయ్యా', రామ్ చరణ్ 'ఎవడు' సమైక్యాంధ్ర ఉద్యమ సెగతో విడుదలకు నోచుకోలేకపోయాయి. అయితే విజయదశమి కానుకగా భారీ చిత్రాల విడుదలకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేశారు. సాధారణంగా దసరా, దీపావళి, సంక్రాంతి పండగల అంటేనే టాలీవుడ్ లో భారీ చిత్రాలతో నిజమైన పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుత పరిస్థితులను బేరిజు వేసుకుని నిర్మాతలు కొంత ధైర్యాన్ని కూడగట్టుకుని విడుదల తేదిని ప్రకటించినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 9 తేదిన అత్తారింటికి దారేది?, 10 తేదిన రామయ్యా వస్తావయ్యా చిత్రాల విడుదలకు సన్నద్దం చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందిన జూనియర్ ఎన్టీఆర్ చిత్రం రామయ్యా వస్తావయ్యా చిత్రాన్ని అక్టోబర్ 10 తేదిన విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 2008 అక్టోబర్ 9న కొత్త బంగారులోకం, 2010 అక్టోబర్ 14న బృందావనం విడుదలై సూపర్ హిట్ ను సాధించాయి. ఈ విజయదశమి సందర్భంగా 2013 అక్టోబర్ 10న రామయ్యా వస్తావయ్యా చిత్రంతో హ్యట్రిక్ సాధించేందుకు సిద్దమవుతున్నాము అని అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియో విడుదలతో భారీ అంచాలు నెలకొన్న అత్తారింటికి దారేది చిత్రాన్ని దసరా పండుగ కానుకగా అక్టోబర్ 9న విడుదల చేస్తున్నట్టు నిర్మాత బి.ప్రసాద్ తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తే... సమైక్య ఉద్యమం జోరు ఏమాత్రం తగ్గకపోగా.. సెప్టెంబర్ నెలాఖరుకు మరికొంత ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ రాష్ట్ర విభజనపై నోట్ పై కేంద్ర ప్రభుత్వం ఏదైనా స్పష్టత ఇస్తే.. సీమాంధ్రలో ఉద్యమం మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ అలాంటి పరిస్థితే తలెత్తితే..అత్తారింటికి దారేది..రామయ్యా వస్తావయ్యా చిత్రాల విడుదల ప్రశ్నార్ధకమే. ఈ నేపథ్యంలో చిత్రాలు మరోసారి వాయిదా పడితే...ప్రేక్షకుల వద్దకు రామయ్యా వస్తాడా.. అత్తారింటికి వెళ్తారా అనేది సందేహమే. మళ్లీ అగ్ర నటుల చిత్రాలు మరోసారి వాయిదా పడితే సినిమా ప్రేక్షకులకు ఈ సంవత్సరపు దసరా సినీ పండుగ వాతావరణం దూరమైనట్టే. -రాజాబాబు అనుముల a.rajababu@sakshi.com -
అక్టోబర్ 9న 'అత్తారింటికి దారేది?', 10న 'రామయ్యా వస్తావయ్యా' విడుదల!
సమైక్యాంధ్ర ఉద్యమ సెగతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది?', యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రం 'రామయ్య వస్తావయ్యా' చిత్రాల విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే విజయదశమి కానుకగా భారీ చిత్రాల విడుదలకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. చిత్రాల విడుదల వాయిదాతో నిరాశకు లోనైన అభిమానులకు మళ్లీ తీయటి వార్త అందనుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఆడియో విడుదలతో భారీ అంచాలు నెలకొన్న అత్తారింటికి దారేది చిత్రాన్ని దసరా పండుగ కానుకగా అక్టోబర్ 9 తేదిన విడుదల చేస్తున్నట్టు నిర్మాత బి.ప్రసాద్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కు అనూహ్య స్పందన లభించింది. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందిన జూనియర్ ఎన్టీఆర్ చిత్రం రామయ్యా వస్తావయ్యా చిత్రాన్ని అక్టోబర్ 10 తేదిన విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 2008 అక్టోబర్ 9న కొత్త బంగారులోకం, 2010 అక్టోబర్ 14న బృందావనం విడుదలై సూపర్ హిట్ ను సాధించాయి. ఈ విజయదశమి సందర్భంగా 2013 అక్టోబర్ 10 తేదిన రామయ్యా వస్తావయ్యా చిత్రంతో హ్యట్రిక్ సాధించేందుకు సిద్దమవుతున్నాము అని అన్నారు. ఇటీవల థమన్ సంగీతానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ కు యూట్యూబ్ లో అనూహ్య స్పందన లభించిన సంగతి తెలిసిందే. -
రామయ్య డ్యూయెట్.. ఇంతకీ ఆ జాబిల్లి ఎవరు?
జాబిల్లి ముంగిట్లో డ్యూయెట్లు పాడుకోవడం మనకు తెలుసు. కానీ జాబిల్లితో డ్యూయెట్ పాడటం ఎక్కడైనా విన్నామా? మన ఎన్టీఆర్ పాడబోతున్నాడు. అయితే... ఎన్టీఆర్ డ్యూయెట్ పాడేది... ఆకాశంలోని జాబిల్లితో కాదు, నేల మీది జాబిల్లితో. ఇంతకీ ఆ జాబిల్లి ఎవరు? అనుకుంటున్నారా? సమంత కావచ్చు. శ్రుతీహాసన్ అయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎందుకంటే... ‘రామయ్యా వస్తావయ్యా’లో కథానాయికలు వాళ్లిద్దరేగా. ఈ సినిమాలో అనంత శ్రీరామ్ రాసిన అందమైన యుగళగీతం ‘జాబిల్లి నువ్వే చెప్పమ్మా’. ఈ పాట టీజర్‌ని శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘ఎన్టీఆర్ కథ అంటే మాస్ మెచ్చాలి. మా సంస్థ నుంచి వచ్చే సినిమా కథంటే... అన్ని వర్గాలవారికీ నచ్చాలి. అందుకు తగ్గట్టే ‘రామయ్యా వస్తావయ్యా’ కథ ఉంటుంది. ‘బృందావనం’ ఎన్టీఆర్‌కి ఎంత మంచి పేరు తెచ్చిందో.... అంతకు పదింతలు పేరు తెచ్చే సినిమా ఇది. హరీష్‌శంకర్ అద్భుతం అనిపించే స్థాయిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఎన్టీఆర్ పాత్రను ఆయన మలిచిన తీరు చాలా బాగుంది. కచ్చితంగా ఈ సినిమాతో హరీష్ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది. తమన్ శ్రావ్యమైన స్వరాలందించాడు. త్వరలో పాటలను, సినిమాను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఎన్టీఆర్‌తో తనకిది హ్యాట్రిక్ హిట్ అవుతుందని తమన్ నమ్మకం వ్యక్తం చేశారు. సానుకూల దృక్పథాన్ని పెంపొందించే పాట రాశానని అనంతశ్రీరామ్ చెప్పారు. ఇందులో కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారని స్క్రీన్‌ప్లే రచయిత రమేష్‌రెడ్డి అన్నారు. కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, ముఖేష్‌రుషి, రవిశంకర్, రావురమేష్, అజయ్, ప్రగతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: చోటా కె.నాయుడు, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.