అతనితో నా ప్రేమకు బ్రేకప్ ఉండదు - సమంత
అతనితో నా ప్రేమకు బ్రేకప్ ఉండదు - సమంత
Published Sat, Oct 12 2013 11:17 PM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM
సమంత అంటేనే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. ఆమె మాటల్లో కూడా బోల్డ్‌నెస్, ఓ బ్యూటీ కనిపిస్తాయి.
తనతో మాట్లాడుతూ ఉంటే కాలం ఘనీభవించినట్టే అనిపిస్తుంది. తన ఫ్లాష్‌బ్యాక్,
లవ్‌ట్రాక్, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి సమంత ‘సాక్షి’తో ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.
‘‘ప్రేమ అనేది గుర్రపు స్వారీ చేయడం, ఫ్రెంచ్ నేర్చుకోవడంలాంటిది. యంగ్‌గా ఉన్నప్పుడే ప్రేమ విలువ తెలుసుకోవాలి. లేకపోతే పెద్దయిన తర్వాత కష్టం’’ అని ‘వాట్సప్’ అనే సోషల్ నెట్‌వర్క్‌లో పెట్టారు. దానర్థం ఏంటి?
చిన్నప్పుడు నేను ఎవర్నీ పట్టించుకునేదాన్ని కాదు. చివరికి నా ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా. చాలా స్వార్థంగా ఉండేదాన్ని. నా గురించి మాత్రమే ఆలోచించుకునేదాన్ని. నేనెలా పైకి రావాలి? ఎలా డబ్బులు సంపాదించాలి? ఇదే ఆలోచన తప్ప ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలి? ఎంత ప్రేమగా ఉండాలి? అనే విషయాలు తెలిసేవి కావు. కానీ, ఈ మధ్యే తెలిసొచ్చింది. అప్పట్నుంచీ నా కుటుంబ సభ్యులను ప్రేమించడం మొదలుపెట్టాను. వాళ్ల కోసం టైమ్ కేటాయిస్తున్నాను. ఆ నేపథ్యంలోనే ఈ ప్రేమ గురించి అలా ‘వాట్సప్’లో నా ఉద్దేశాన్ని ప్రకటించాను.
డబ్బులు సంపాదించాలనే తపన అందరికీ ఉంటుంది. పర్టిక్యులర్‌గా మీకు వేరే కారణం ఏదైనా ఉందా?
మాది సాదాసీదా కుటుంబం. ఆర్థిక ఇబ్బందులు మామూలుగా ఉండేవి కావు. ఏది కొనుక్కోవాలన్నా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. నచ్చిన ఆహారం తినడానికి కూడా కుదిరేది కాదు. అందుకే ఓ సొంత ఇల్లు, ఓ కారు, కొంత బ్యాంక్ బాలెన్స్‌తో హాయిగా సెటిలవ్వాలని ఉండేది. ఆ ఆశయాన్ని నెరవేర్చుకోవడం కోసం బాగా చదువుకునేదాన్ని. పెద్ద జాబ్‌లో సెటిలవ్వాలని ఉండేది.
దేవుడు మీరు కోరుకున్నదాన్నికన్నా ఎక్కువే ఇచ్చాడు కదా?
నిజంగానే ఈ జీవితం ఆ దేవుడి దయే. సినిమాల్లోకి వస్తానని నేననుకోలేదు. అంతా అనుకోకుండా జరిగింది. నేనూహించనంత బ్యాంక్ బాలెన్స్ సంపాదించుకున్నాను.
అందుకేనా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు?
అవును. వాస్తవానికి గత ఏడాది వరకు నాకిలాంటి ఫీలింగ్స్ ఉండేవి కావు. ఎప్పుడైతే ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొన్నానో, జయాపజయాలు చవి చూశానో... అప్పుడు ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నాను. ఓ రకంగా కనువిప్పు కలిగింది. అందుకే వీలైనంత వరకూ ఇతరులకు సహాయపడాలని నిర్ణయించుకున్నాను. ఏదైనా సేవా సంస్థ పెట్టేటప్పుడు ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇవన్నీ జరగడానికి దాదాపు రెండు నెలలు పడుతుంది. అప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి ఈ ఫౌండేషన్ వివరాలు తెలియజేయాలనుకుంటున్నా.
డబ్బు లేనప్పుడు, డబ్బు ఉన్నప్పుడు మీలో వచ్చిన మార్పు?
అప్పుడు నా గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచించేదాన్ని కాదు. కడుపు నిండిన బేరం అంటారు కదా.. అది నిజమే. కడుపు నిండినవాళ్లు ఏదైనా మాట్లాడతారు. నన్నే తీసుకోండి.. ఇప్పుడే ఏదైనా విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలంటే తడుముకోకుండా, తడబాటు లేకుండా తీసేసుకుంటాను. కానీ, డబ్బుల్లేకపోతే ఏ విషయంలోనూ ఓ పట్టాన నిర్ణయం తీసుకోలేం. ఆ కారణంగానే డబ్బుల్లేనివాళ్ల గురించి నేను ఈజీగా ఓ జడ్జ్‌మెంట్‌కి వచ్చేయను. వాళ్లకి రకరకాల సమస్యలుంటాయి. ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను కాబట్టి, ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే వాళ్లవైపు నుంచి ఆలోచిస్తాను. అంతస్తుతో సంబంధం లేకుండా అందరితోనూ సమానంగా ఉంటాను.
ఇంతకీ మీ ప్రేమ ప్రయాణం ఎలా సాగుతోంది?
చాలా బలంగా సాగుతోంది. మా ప్రేమకు ‘బ్రేకప్’ ఉండదు. అంత అవగాహనతో ముందుకెళుతున్నాం.
మీకు ఆల్రెడీ పెళ్లయ్యిందని టాక్?
అయితే అయ్యిందని చెబుతాను. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. నాలానే తనూ అబద్ధాలు అడటానికి ఇష్టపడడు.
ఇంతకీ ఆ అతగాడి పేరు సిద్దార్ధ్ అని కన్‌ఫర్మ్ చేస్తారా?
అది మాత్రం అడగొద్దు.
మరి.. పెళ్లెప్పుడు చేసుకుంటారు?
ఇప్పుడప్పుడే లేదు. ఇంకా చాలా సమయం పడుతుంది. అప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటా.
ఓకే... ‘రామయ్యా వస్తావయ్యా’ విషయానికొద్దాం. ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం?
ఎన్టీఆర్, హరీష్‌శంకర్, ‘దిల్’ రాజు కాంబినేషన్‌లో సినిమా కాబట్టి చేయాలనుకున్నాను. కథ, పాత్ర నచ్చాయి. ఈ కారణాల వల్లే ఒప్పుకున్నాను. పెద్ద బడ్జెట్ మూవీ, పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో చేయాలనే సంకల్పంతో కూడా ఈ సినిమా అంగీకరించాను.
కమర్షియల్ సినిమా మీద దృష్టి పెట్టారెందుకని?
గత ఏడాది నేను చేసిన ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు ప్రయోగాత్మక చిత్రాలు. ముఖ్యంగా ‘ఈగ’తో సినిమా ఏంటని కొంతమంది అన్నారు. ఆ సినిమాలో నేను సాదాసీదాగా కనిపిస్తాను. అలాగే, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’లో కూడా అంతే. దాంతో సమంత గ్లామరస్ రోల్స్‌కి పనికి రాదని, పెద్ద బడ్జెట్ సినిమాలకు సూట్ కాదని కొంతమంది అన్నారు. అందుకే ఈ ఏడాది హైలీ కమర్షియల్ మూవీస్‌లో నటించాలనుకున్నా.
ఇకముందు కూడా ఇలాంటి సినిమాలే చేస్తారా?
లేదు. ఎందుకంటే సమంత గ్లామరస్ మాత్రమే చేయగలదనో, డీ-గ్లామర్‌కే పనికొస్తుందనో ఏదో ఒక ముద్ర నా మీద పడకూడదు. అందుకే, అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది. తమిళంలో తీసిన పిజ్జా, సూదు కవ్వమ్‌లాంటి చిన్న బడ్జెట్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్‌లో కూడా నటించాలని ఉంది.
అప్పుడు మీ పారితోషికం తగ్గించుకోవాల్సి ఉంటుందేమో?
తగ్గించుకుంటా. స్క్రిప్ట్ బాగా నచ్చిందనుకోండి చిన్న బడ్జెట్ చిత్రం కాబట్టి ముందే పారితోషికం డిమాండ్ చేయకుండా లాభాల్లో ఇంత పర్సంట్ ఇస్తే చాలంటాను.
‘రామయ్యా వస్తావయ్యా..’ని ఎందుకు చూడాలంటే ఏం చెబుతారు?
తారక్ అద్భుతంగా నటించిన వైనం, తన లుక్స్ కోసం చూడొచ్చు. డాన్సులు, ఫైట్స్ బాగా చేశారు. ఆయన అభిమానులకు ఓ మంచి ఫీస్ట్‌లాంటిది. ఇక, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లున్నాం. వాళ్ల కోసం కూడా చూడొచ్చు (నవ్వుతూ).
ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది కదా?
అది ప్రతి సినిమాకీ వస్తుంది. కానీ మనం పరిగణనలోకి తీసుకోవాల్సింది వసూళ్లనే. నాకు తెలిసి ప్రేక్షకులు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు.
- డి.జి. భవాని
Advertisement