సమ్...అంత
ఇంటర్వ్యూ
మనమిచ్చే సమ్‌థింగ్ (కొంత) వాళ్లకు ఎవ్రీథింగ్ (అంతా) అంటూ సేవకు భాష్యం చెబుతుంది ‘సమ్... అంత’. ఎవరైనా ‘సమ్’ కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు... తనకున్నది ‘అంతా’ ఇచ్చేయడానికైనా ఆమె సిద్ధపడుతుంది. అవసరంలో ఉన్నవారికి అండగా నిలబడుతుంది. ఎదుటివారి కళ్లల్లో సంతోషాన్ని చూడటానికి ఏం చేయడానికైనా రెడీ అంటుంది. తెరపై తారకలా మెరుస్తూ... సమాజంలో మంచి వ్యక్తిగా మన్ననలందుకుంటోన్న సమంత ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు ఇవి...
♦ మీకు నచ్చే రంగు?
నలుపు. తెలుపు కూడా ఇష్టమే.
♦ నచ్చే ఆహారం?
సౌత్ ఇండియన్ వంటకాలు ఏవైనా ఇష్టమే.
♦ నచ్చే దుస్తులు?
జీన్స్, టీషర్ట్స్ సౌకర్యంగా ఉంటాయి. ముఖ్య సందర్భాల్లో చీరలు ఇష్టపడతాను.
♦ నచ్చే హీరోలు?
షారుఖ్, రజనీకాంత్, కమల్ హాసన్
♦ నచ్చే హీరోయిన్లు?
శ్రీదేవి, రేఖ, శోభన
♦ ఎదుటివారిలో నచ్చేది?
నిజాయితీ, పాజిటివ్ దృక్పథం
♦ ఇతరుల్లో నచ్చనిది?
అబద్ధాలు చెప్పడం
♦ భక్తిగా ఉంటారా?
మరీ అంత కాదు. ఎప్పుడైనా ఓసారి ప్రార్థన చేసుకుంటానేమో కానీ అన్నీ క్రమం తప్పకుండా పాటించేయను. కాకపోతే దేవుడంటే నమ్మకం ఉంది. మనం తప్పటడుగులు వేయకుండా ఆపేది దేవుడిపై ఉండే నమ్మకం, భయమే!
♦ తీరిక వేళల్లో ఏం చేస్తుంటారు?
ఏమీ చేయను. ఒక్కోసారి అలా ఖాళీగా ఉండటంలో కూడా ఆనందం ఉంటుంది. టీవీ చూస్తూనో, పాటలు వింటూనో గడిపేస్తాను. నాకు పెద్ద పెద్ద శబ్దాలు నచ్చవు. అలాగే ఎక్కువ జనం ఉండే చోట్లకు వెళ్లడం కూడా ఇష్టముండదు. అందుకే ఇంట్లోనే ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతాను.
♦ మీ ఫిట్‌నెస్ సీక్రెట్?
బరువు తగ్గడానికి నేనెప్పుడూ వ్యాయామాలు చేయను. హెల్దీ ఫుడ్ తీసుకోవడం వంటి జాగ్రత్తలేవో తీసు కుంటాను తప్ప వర్కవుట్లు ఉండవు.
♦ గాసిప్స్‌కి బాధపడతారా?
కచ్చితంగా. మన గురించి తప్పుగా మాట్లాడితే బాధ ఉండదా చెప్పండి! కాకపోతే వాటి గురించే ఆలోచిస్తూ కూర్చోను. ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నా జీవితాన్ని నాకు నచ్చినట్టు జీవిస్తాను. ఎవరో ఏదో అంటారని నన్ను నేను మార్చేసుకోలేను కదా!
♦ గుర్తుండిపోయిన కాంప్లిమెంట్?
కాంప్లిమెంట్స్‌ని పెద్దగా గుర్తుంచుకోను కానీ కామెంట్స్‌ని మాత్రం గుర్తుంచుకుంటాను. అది కూడా సద్విమర్శ అయితేనే. అలాంటి విమర్శలు మనలో ఉన్న లోపాల్ని సరి చేసుకోవడానికి పనికొస్తాయి. మనల్ని మనం ఇంకా బెటర్‌గా తీర్చిదిద్దుకోవడానికి ఉపకరిస్తాయి.
♦ అవార్డులు కోరుకుంటారా?
నేను నటనను చాలా సీరియస్‌గా తీసుకుంటాను. ఒక్క బ్యాడ్ పర్‌ఫార్మెన్స్ చాలు నన్ను ఇంటికి పంపేయడానికి అనుకుంటాను. అందుకే ఎప్పుడూ పనిని నిర్లక్ష్యం చేయను. బాగా చేయాలి అని తపిస్తాను తప్ప అవార్డులు రావాలి అన్న దృష్టితో బాగా నటించడం అన్నది ఉండదు. మన పని పర్‌ఫెక్ట్‌గా ఉంటే అవార్డులు, రివార్డులు అవే వస్తాయి.
♦ పరాజయాలకు కుంగిపోతారా?
కుంగిపోను కానీ కంగారుపడతాను. ఆ మధ్య వరుసగా కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి. దాంతో కాస్త బెంగపడ్డాను. ఎందుకంటే ప్రతి సినిమా సక్సెస్ కావాలనే శాయశక్తులా కష్టపడతాం. తీరా అది ఫెయిలైతే చాలా నిరాశ అనిపిస్తుంది. అయితే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సక్సెస్ కావడంతో నా బెంగ తీరిపోయింది.
♦ మీకు సేవ చేయడం ఇష్టం కదా?
అవును. నేనో సమయంలో పదిహేను రోజుల పాటు అనారోగ్యంతో మంచమ్మీదే ఉండిపోయాను. అప్పుడు నాలో పెద్ద మథనమే జరిగింది. జీవితపు విలువ తెలిసింది. ఏదీ శాశ్వతం కాదని అర్థమైంది. అందుకే స్వార్థంగా ఉండకూడదని, వీలైనంత వరకూ ఇతరులకు ప్రేమను పంచాలని నిర్ణయించుకున్నాను. ప్రత్యూష ఫౌండేషన్‌ను స్థాపించి, దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను.
♦ అసలు మీ జీవిత లక్ష్యం ఏమిటి?
ఈ భూమి మీద పుట్టినందుకు, సుఖంగా జీవిస్తున్నందుకు ఈ సమాజానికి కొంతయినా మేలు చేయాలి. నేనే కాదు... అందరూ ఇలానే ఆలోచించాలి. అలా అని ఉన్నదంతా పెట్టాల్సిన పని లేదు. మనకి ఉన్నదాంట్లో కొంత ఇతరుల కోసం ఇవ్వగలిగితే చాలు. కొందరి కళ్లలోనైనా మన వల్ల సంతోషం కనిపిస్తే చాలు.
సాక్షి ఫన్‌డే మీద మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయండి. ప్రియదర్శిని రామ్, ఎడిటర్, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. ఫోన్: 040-23256000 funday.sakshi@gmail.com