ప్రేమించా... నో అన్నాడు
తమిళసినిమా: ప్రేమ లేనిదే జీవితం లేదు. అయితే ప్రేమే జీవితం కాదు. జీవితంలో ప్రేమ ఒక భాగం అంతే. అలాంటి ప్రేమ చేసే జిమ్మిక్కులు, గమ్మత్తులు ఎన్నో. అలా ప్రేమలో నేను ఒకసారి ఓడానంటున్న సమంత హీరోయిన్‌గా మాత్రం విజయపథంలో పయనిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో నంబర్‌వన్ స్థానం కోసం పోటీపడుతున్న నటీమణుల్లో సమంత ముందు వరుసలో ఉన్నారు. తమిళంలో విజయం కోసం ఆరాటపడుతున్న ఈ చెన్నై చిన్నదానితో చిన్న ఇంటర్వ్యూ.
ప్రశ్న : ఏ భాషలో అభిమానులు అధికంగా ఉన్నారు?
జవాబు: నేను చెన్నై పల్లావరంలో పెరిగిన అమ్మాయినైనా నాకు పేరు ప్రఖ్యాతులు, డబ్బు అంతా ఇచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమే. నేను హీరోయిన్‌గా పరిచయమైంది అక్కడే. తొలి చిత్రం తెలుగులోనే చేశాను. కాబట్టి అక్కడే నాకు అభిమానులు అధికం. అయితే ఈ ఏడాది నాకు చాలా ముఖ్యమైంది తమిళంలో అంజాన్ చిత్రం తరువాత విజయ్ సరసన నటిస్తున్న కత్తి, విక్రమ్‌కు జంటగా నటిస్తున్న పత్తు ఎండ్రదుక్కుళ్ల చిత్రాలు విడుదల కానున్నాయి. కావున ఈ ఏడాది లోపు తమిళంలోను అభిమానులు ఎక్కువవుతారని ఆశిస్తున్నాను.
ప్రశ్న : మీకు చర్మ ఎలర్జీ లేదని చెప్పడానికే అందాలారబోశారా?
జవాబు: అదేమి కాదు. అంజాన్ చిత్రంలో నా పాత్ర తీరు అలాంటిది. పాత్ర డిమాండ్ మేరకే గ్లామరస్‌గా నటించాను. ఇంకా చెప్పాలంటే దర్శకుడు లింగుస్వామి అలా నటింప చేశారు. ఈ చిత్రానికి పూర్తి భిన్నంగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నిండైన దుస్తులు ధరించి నటించాను. ఈ విధంగా ఏ తరహా పాత్రనైనా నటించి మెప్పించగలనని నిరూపించుకున్నాను.
ప్రశ్న : భవిష్యత్ ప్రణాళిక ఏమిటి?
జవాబు: కథానాయికగా సుదీర్ఘ పయనం చేయాలి. తమిళంలో మంచి చిత్రాలు చేయాలి. కథానాయికలు అధిక కాలం నిలదొక్కుకోవడం అసాధ్యం. దాన్ని నేను సుసాధ్యం చేసి చూపించాలి.
ప్రశ్న : తమిళంలో విజయ్, సూర్య, విక్రమ్‌లతో నటించిన అనుభవం?
జవాబు: నటుడు విజయ్ కెమెరా వెనుక చాలా శాంతంగా ఉంటారు. కె మెరా ముందు ఆయన వేగం చూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. నటిస్తున్నప్పుడు ఆయనలో ఒక పవర్ వచ్చేస్తుంది. ఆ మ్యాజిక్ ఏమిటో నా కర్థం కాలేదు. నటుడు సూర్యకు వృత్తిపై అంకిత భావం అధికం. ఆయన దర్శకుడి హీరో. ఎన్ని టేకులైనా బాధపడకుండా నటిస్తారు. సూర్యతో మరో చిత్రం చేయాలని ఆశగా ఉంది. ఇక విక్రమ్‌తో నటించిన అనుభవం చాలా తక్కువ. ఇటీవలే ఆయనతో జత కట్టాను.
ప్రశ్న: నాన్ ఈ చిత్రంలో నటుడు సుదీప్ మీపై వన్ సైడ్ లవ్‌ను ప్రదర్శించినట్లు నిజ జీవితంలో మిమ్మల్ని అలా ఎవరైనా ప్రేమిస్తున్నారా?
జవాబు: నిజం చెప్పాలంటే నేనే ఒకరిని అలా ప్రేమించాను. కొన్నేళ్ల క్రితమే ఇది జరిగింది. అయితే అతను సినిమా నటుడు కాదు. నా ప్రేమను అతనితో చెప్పాను. అందుకతని నుంచి నో అనే సమాధానం వచ్చింది.
ప్రశ్న : ప్రేమలో ఓటమి బాధించిందా?
జవాబు: ఎలాంటి బాధ కలగలేదు. నేనసలు ఆ విషయాన్ని సీరియస్‌గానే తీసుకోలేదు.
ప్రశ్న : మరి పెళ్లి ఆలోచన ఉందా?
జవాబు: ఖచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటాను. ఇంటి సమీపంలోనే ఒక కుర్రాడు వున్నాడు. అయితే మూడేళ్ల తరువాత పెళ్లి చేసుకుంటాను.
ప్రశ్న : ప్రస్తుతం నంబర్‌వన్ హీరోయిన్ మీరా? నయనతారనా?
జవాబు: ప్రస్తుతం నంబర్‌వన్ హీరోయిన్‌అంటూ ఎవరూ లేరు. ప్రతి శుక్రవారం పలు చిత్రాలు తెరపై వస్తున్నాయి. దీంతో ఒక్కో శుక్రవారం నంబర్‌వన్ స్థానం మారిపోతుంటుంది.
ప్రశ్న: చిత్ర రంగంలో మహిళలకు స్వాతంత్య్రం ఏ మాత్రం ఉందంటారు?
జవాబు: ఇతర రంగాలతో పోల్చితే సినీ రంగంలో స్త్రీలకు స్వాతంత్య్రం చాలా ఎక్కువే. ఇక్కడ పురుషాధిక్యం వున్నా మహిళలకు ఎలాంటి చిత్ర హింసలు లేవు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మగువలకు మర్యాదనిస్తున్నా రు. అసలు భారతదేశాన్నే తీసుకుంటే ఇతర దేశాల కన్నా ఇక్కడ మహిళలకు పూర్తి స్వాతంత్య్రం ఉంది. రాబోయే కాలంలో ఇది ఇంకా పెరుగుతుంది.