ఉత్సవం లాంటి చిత్రం
‘‘‘బ్రహ్మోత్సవం’ వంటి చిత్రాల్లో నటించే అవకాశం చాలా అరుదుగా వస్తుంటుంది. కుటుంబం, బంధాలు, బంధుత్వాలు, ప్రేమానురాగాలు అన్నీ కలగలసిన చిత్రం ఇది. సినిమాలాగా కాకుండా ఓ ఉత్సవంలా ఉంటుంది’’ అని కాజల్ అగర్వాల్, సమంత అన్నారు. మహేశ్‌బాబు హీరోగా కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పీవీపీ సినిమా, ఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నె నిర్మించిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ నెల 20న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా కాజల్, సమంత తమ అనుభూతులను ఈ విధంగా పంచుకున్నారు.
సింపుల్‌గా.. హోమ్లీగా... - కాజల్
* ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలిసి, ‘నటించాలా? వద్దా?’ అని మొదట ఆలోచించా. కానీ, శ్రీకాంత్ అడ్డాలగారు చెప్పిన కథ, అందులో నా పాత్ర నచ్చడంతో నటించేందుకు ఒప్పేసుకున్నా. ఒక హీరో, ముగ్గురు హీరోయిన్లు, చాలామంది నటులతో సినిమా తీయడమంటే మామూలు విషయం కాదు. శ్రీకాంత్‌గారు అన్ని క్యారెక్టర్లకు ఇంపార్టెన్స్ ఇస్తూ చక్కగా హ్యాండిల్ చేశారు.
* ఇందులో నా పాత్ర పేరు కాశి. ఎన్‌ఆర్‌ఐ గర్ల్‌గా నటించా. ఎన్‌ఆర్‌ఐ అంటే మోడ్రన్ అమ్మాయిలా ఉండను. వెరీ సింపుల్‌గా, హోమ్లీ గర్ల్‌లా ఉంటా. నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర ఇది. ‘డార్లింగ్’ చిత్రంలోనూ ఎన్‌ఆర్‌ఐ అమ్మాయి పాత్రయినా, బబ్లీ గర్ల్‌గా చేశా. ‘బ్రహ్మోత్సవం’లో ప్రాక్టికల్‌గా ఆలోచించే పాత్ర.
* మహేశ్‌బాబుగారితో మొదట ‘బిజినెస్ మేన్’ చేశా. రెండో చిత్రం ‘బ్రహ్మోత్సవం’. అప్పటికీ ఇప్పటికీ ఆయన అంతే అందంగా ఉన్నారు. మహేశ్ వెరీ స్పాంటేనియస్ యాక్టర్. పోటీ ఉన్నా కూడా చాలా పాజిటివ్ మైండ్‌తో ఆలోచిస్తారాయన. దట్స్ వెరీ గ్రేట్.
* ఈ చిత్రంలో రేవతి, జయసుధ వంటి సీనియర్ ఆర్టిస్టులతో పనిచేయడం వల్ల నటనలో కొత్త విషయాలు చాలా నేర్చుకున్నా.
ఆనందంగా... సందడిగా... - సమంత
* మానవతా విలువలు దృష్టిలో ఉంచుకుని శ్రీకాంత్ అడ్డాల చిత్రాలు తెరకెక్కిస్తుంటారు. ‘బ్రహ్మోత్సవం’ కూడా ఆ కోవలోకే వస్తుంది. అటువంటి చిత్రాలు ఆయన బాగా తీయగలరు. ఎక్కడెక్కడో ఉండే కుటుంబ సభ్యులు, బంధువులంతా ఓ చోట కలిస్తే ఎంత ఆనం దంగా, సందడిగా ఉంటుందో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్.. ఇలా అన్నీ ఉంటాయి. నేను ఆంగ్లో-ఇండియన్‌ని. నా మూలాలు ప్రపంచం అంతా ఉంటాయి. మా బంధువులందర్నీ కలుసుకోవాలంటే ప్రపంచం మొత్తం చుట్టేయాలి (నవ్వుతూ).
* మహేశ్‌బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘దూకుడు’ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ చేశా. ఈ సినిమాలో ఆయన్ను చూస్తే వయస్సు వెనక్కి వెళ్లిపోయినట్లు కనిపి స్తుంది. అంత అందంగా ఉన్నారు. ప్రత్యేకించి టైటిల్ సాంగ్‌లో చాలా అందంగా కనిపిస్తారు.
* నా ఫేవరేట్ నటి రేవతితో కలిసి ఈ చిత్రంలో నటించడం గర్వంగా ఉంది. అంత సీనియర్ అయినా కూడా సెట్‌లో ‘ఇది నా ఫస్ట్ సినిమా.. నేను నటిస్తున్న మొదటి రోజు ఇదే’ అనే భావనలో ఉంటారు.
* ఈ చిత్రంలో ఫ్యామిలీ మెంబర్స్‌తో నాకు సన్నివేశాలు తక్కువ. మహేశ్, ‘వెన్నెల’ కిశోర్‌తో ఎక్కువ ఉంటాయి.
* పీవీపీగారు మంచి నిర్మాత. రత్నవేలు కెమేరా, తోట తరణి గారి ఆర్ట్ చాలా ప్లస్. హరిద్వార్, ఉదయ్‌పూర్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఎండ, దుమ్ము బాగా ఉండేది. అయినా రత్నవేలుగారు నన్ను అందంగా చూపించారు.
* ‘బ్రహ్మోత్సవం’ లాంటి చిత్రంలో నటించినందుకు గర్వపడుతున్నా. ప్రేక్షకులకు ఇటువంటి సినిమాలు అవసరం. సమంత మంచి నటి అనిపించుకోవాలన్నదే ప్రస్తుతానికి నా లక్ష్యం.