ఆ రోజు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ - మహేశ్ బాబు
‘‘ఈ సినిమా నిర్మాత మాకు ఎప్పటినుంచో తెలుసు. ఇప్పుడాయన హైదరాబాద్‌లో సెటిలై మంచి సినిమాలు తీస్తున్నారు. శ్రీకాంత్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాని చాలా సహజంగా తీశాడు. ఇప్పుడీ సినిమా ట్రైలర్ చూశాను. గత చిత్రాలకంటే మహేశ్ ఈ సినిమాలో చాలా అందంగా కనిపించాడు. ‘శ్రీమంతుడు’ రికార్డ్స్‌ని ‘బ్రహ్మోత్సవం’ తిరగ రాయాలని కోరుకుంటున్నా’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. పీవీపి పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేశ్‌బాబు, సమంత, కాజల్ అగర్వాల్ ముఖ్య తారలుగా పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి నిర్మించిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’.
మిక్కీ జె. మేయర్ స్వరపరచిన ఈ చిత్రం పాటల వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని మహేశ్‌బాబు ఆవిష్కరించారు. ‘‘ఈ చిత్రం వంద రోజులాడాలని కోరుకుంటున్నా’’ అని సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల అన్నారు. మహేశ్‌బాబు మాట్లాడుతూ- ‘‘ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో రియల్ హ్యూమన్ బీయింగ్‌గా ఎదిగాను. ఈ సినిమాతో ఇంకా ఎక్కువ ఎదిగాను. పీవీపీ మంచి ప్యాషన్ ఉన్న నిర్మాత. తోట తరణి గారి సెట్స్, అందుకు తగ్గట్టుగా రత్నవేలు ఫొటోగ్రఫీ ఈ చిత్రాన్ని విజువల్ ఫీస్ట్‌గా చేశాయి. నా కెరీర్‌లో మంచి ఆల్బమ్‌గా నిలిచిపోతుంది. మే 20న బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి’’ అన్నారు.
శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ- ‘‘మానవతా విలువల నేపథ్యంలో ఈ కథ తయారుచేసుకున్నా. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా సెలబ్రేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నా’’ అని సమంత అన్నారు. ‘‘కథ విన్నప్పుడు మంచి సినిమా అవుతుందనిపించింది’’ అని కాజల్ చెప్పారు. సీనియర్ నటీమణులు జయసుధ, రేవతి, నటులు సత్యరాజ్, సీనియర్ నరేశ్, రావు రమేశ్, రచయితలు పరుచూరి బ్రదర్స్, నిర్మాతలు బీవీయస్‌యన్ ప్రసాద్, ‘దిల్’ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి, ీహీరో సుధీర్‌బాబు, హీరోయిన్ ప్రణీత, సంగీతదర్శకుడు మిక్కీ జె.మేయర్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, కళా దర్శకుడు తోట తరణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత సందీప్ గుణ్ణం తదితరులు పాల్గొన్నారు.