Pratyusha foundation
-
'ప్రత్యూష ఫౌండేషన్'.. అలా మొదలైంది : సమంత
సమంత.. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే సమంత సినీ ఇండస్ర్టీకి రాకముందు పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేసేది. సినిమాల్లోకి రావాలన్న కోరిక లేకపోయినా అవకాశాలే ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఓ యాడ్ షూట్లో సమంతని చూసిన డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఏ మాయ చేశావే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా తర్వాత సమంత జీవితం ఒక్కసారిగి మారిపోయింది. తొలి సినిమాతోనే ఎంతోమంది కుర్రాల మనసు మాయ చేసిన సమంత ఈ సినిమాలో తనతో కలిసి నటించిన నాగ చైతన్యని 2017లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. కెరీర్ తొలినాళ్లలోనే మహేశ్‌బాబు, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలతో జత కట్టిన సమంత లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అతి తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ ఇండస్ర్టీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన సమంత పెళ్లి తర్వాత కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్గా రాణిస్తుంది. సమంత పూర్తి పేరు సమంత రూత్ ప్రభు అయినా ఆమె ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఆమెను యశోద అని పిలుస్తారట. ఇండస్ర్టీకి వచ్చిన తొలి నాళ్లలో డయాబెటీస్‌తో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్న సమంత దాని వల్ల ఓ ఏడాది పాటు సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. ఆ సమంయంలోనే ప్రత్యూష అనే ఫౌండేషన్‌తో ఎంతోమందికి చేయూతనిచ్చింది. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన సమంత.. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఈ విషయంలో తనకు తన తల్లే స్పూర్తి అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. తనకున్న దాంట్లో వేరే వాళ్లకు సహాయం చేయగలిగినప్పుడే ఆ డబ్బుకు అర్థం ఉంటుందని ఆ విధంగానే ప్రత్యూష ఫౌండేషన్ మొదలు పెట్టినట్లు వెల్లడించింది. ఇక సినిమాలతో పాటు బిజినెస్ ఉమెన్‌గానూ సమంత రాణిస్తుంది. మైక్రోగ్రీన్స్‌తో కూరగాయలు పండించడం, చిన్నారుల కోసం ఏకం లర్నింగ్ అనే స్కూల్ సహా రీసెంట్గా బట్టల వ్యాపారంలోకి అడుగుపెట్టింది సమంత. ప్రస్తుతం ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. -
నేను పర్ఫెక్ట్ కాదు!
సమంత మంచి నటి. ఆమె చేస్తున్న సినిమాలు చూసినవాళ్లు ఈ మాటతో ఏకీభవిస్తారు. ఈ బ్యూటీ మంచి మనసున్న అమ్మాయి కూడా. అందుకు నిదర్శనంగా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలను చెప్పొచ్చు. ఓవరాల్‌గా సమంత గురించి ఎవరైనాసరే ‘పర్ఫెక్ట్ గాళ్’ అనుకుంటారు. కానీ, సమంత మాత్రం ‘నేను పర్ఫెక్ట్ కాదు’ అంటున్నారు. గత ఎనిమిది నెలలుగా షూటింగ్స్‌తో ఆమె ఫుల్ బిజీ. ఈ సమ్మర్లో ఇప్పటికే తమిళ చిత్రం ‘తెరి’, తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘24’ చిత్రాలతో తెరపై మెరిశారు. ఇంకా ‘బ్రహ్మోత్సవం’, ‘ఆ..ఆ’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. చేతిలో రెండు, మూడు సినిమాలున్నాయి. మొత్తానికి వేసవిలోనే నాలుగు సినిమాలు విడుదల ఉండటంతో నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేశారు. ఆ విషయం గురించి సమంత చెబుతూ - ‘‘ఈ ఎనిమిది నెలలు రెస్ట్ లేకుండా షూటింగ్స్ చేశాను. ఒక్కోసారి అలసిపోయేదాన్ని. కానీ, నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల చేయగలిగాను. నా పని ఒత్తిడి వల్ల నేను పర్ఫెక్ట్ కూతురిగా, పర్ఫెక్ట్ ఫ్రెండ్‌గా, పర్ఫెక్ట్ గాళ్ ఫ్రెండ్‌గా ఉండలేకపోయాను. అందుకే కొంచెం ఒత్తిడి తగ్గించుకోవాలనుకుంటున్నాను. ఇంకొన్ని రోజులకు కొత్త సినిమాలేవీ అంగీకరించకూడదని నిర్ణయించుకున్నాను’’ అన్నారు. దీన్నిబట్టి సమంత ఈ మధ్య ఏ స్థాయిలో హార్డ్‌వర్క్ చేశారో ఊహించుకోవచ్చు. -
సమ్...అంత
ఇంటర్వ్యూ మనమిచ్చే సమ్‌థింగ్ (కొంత) వాళ్లకు ఎవ్రీథింగ్ (అంతా) అంటూ సేవకు భాష్యం చెబుతుంది ‘సమ్... అంత’. ఎవరైనా ‘సమ్’ కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు... తనకున్నది ‘అంతా’ ఇచ్చేయడానికైనా ఆమె సిద్ధపడుతుంది. అవసరంలో ఉన్నవారికి అండగా నిలబడుతుంది. ఎదుటివారి కళ్లల్లో సంతోషాన్ని చూడటానికి ఏం చేయడానికైనా రెడీ అంటుంది. తెరపై తారకలా మెరుస్తూ... సమాజంలో మంచి వ్యక్తిగా మన్ననలందుకుంటోన్న సమంత ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు ఇవి... ♦ మీకు నచ్చే రంగు? నలుపు. తెలుపు కూడా ఇష్టమే. ♦ నచ్చే ఆహారం? సౌత్ ఇండియన్ వంటకాలు ఏవైనా ఇష్టమే. ♦ నచ్చే దుస్తులు? జీన్స్, టీషర్ట్స్ సౌకర్యంగా ఉంటాయి. ముఖ్య సందర్భాల్లో చీరలు ఇష్టపడతాను. ♦ నచ్చే హీరోలు? షారుఖ్, రజనీకాంత్, కమల్ హాసన్ ♦ నచ్చే హీరోయిన్లు? శ్రీదేవి, రేఖ, శోభన ♦ ఎదుటివారిలో నచ్చేది? నిజాయితీ, పాజిటివ్ దృక్పథం ♦ ఇతరుల్లో నచ్చనిది? అబద్ధాలు చెప్పడం ♦ భక్తిగా ఉంటారా? మరీ అంత కాదు. ఎప్పుడైనా ఓసారి ప్రార్థన చేసుకుంటానేమో కానీ అన్నీ క్రమం తప్పకుండా పాటించేయను. కాకపోతే దేవుడంటే నమ్మకం ఉంది. మనం తప్పటడుగులు వేయకుండా ఆపేది దేవుడిపై ఉండే నమ్మకం, భయమే! ♦ తీరిక వేళల్లో ఏం చేస్తుంటారు? ఏమీ చేయను. ఒక్కోసారి అలా ఖాళీగా ఉండటంలో కూడా ఆనందం ఉంటుంది. టీవీ చూస్తూనో, పాటలు వింటూనో గడిపేస్తాను. నాకు పెద్ద పెద్ద శబ్దాలు నచ్చవు. అలాగే ఎక్కువ జనం ఉండే చోట్లకు వెళ్లడం కూడా ఇష్టముండదు. అందుకే ఇంట్లోనే ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతాను. ♦ మీ ఫిట్నెస్ సీక్రెట్? బరువు తగ్గడానికి నేనెప్పుడూ వ్యాయామాలు చేయను. హెల్దీ ఫుడ్ తీసుకోవడం వంటి జాగ్రత్తలేవో తీసు కుంటాను తప్ప వర్కవుట్లు ఉండవు. ♦ గాసిప్స్‌కి బాధపడతారా? కచ్చితంగా. మన గురించి తప్పుగా మాట్లాడితే బాధ ఉండదా చెప్పండి! కాకపోతే వాటి గురించే ఆలోచిస్తూ కూర్చోను. ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నా జీవితాన్ని నాకు నచ్చినట్టు జీవిస్తాను. ఎవరో ఏదో అంటారని నన్ను నేను మార్చేసుకోలేను కదా! ♦ గుర్తుండిపోయిన కాంప్లిమెంట్? కాంప్లిమెంట్స్‌ని పెద్దగా గుర్తుంచుకోను కానీ కామెంట్స్‌ని మాత్రం గుర్తుంచుకుంటాను. అది కూడా సద్విమర్శ అయితేనే. అలాంటి విమర్శలు మనలో ఉన్న లోపాల్ని సరి చేసుకోవడానికి పనికొస్తాయి. మనల్ని మనం ఇంకా బెటర్‌గా తీర్చిదిద్దుకోవడానికి ఉపకరిస్తాయి. ♦ అవార్డులు కోరుకుంటారా? నేను నటనను చాలా సీరియస్‌గా తీసుకుంటాను. ఒక్క బ్యాడ్ పర్ఫార్మెన్స్ చాలు నన్ను ఇంటికి పంపేయడానికి అనుకుంటాను. అందుకే ఎప్పుడూ పనిని నిర్లక్ష్యం చేయను. బాగా చేయాలి అని తపిస్తాను తప్ప అవార్డులు రావాలి అన్న దృష్టితో బాగా నటించడం అన్నది ఉండదు. మన పని పర్ఫెక్ట్గా ఉంటే అవార్డులు, రివార్డులు అవే వస్తాయి. ♦ పరాజయాలకు కుంగిపోతారా? కుంగిపోను కానీ కంగారుపడతాను. ఆ మధ్య వరుసగా కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి. దాంతో కాస్త బెంగపడ్డాను. ఎందుకంటే ప్రతి సినిమా సక్సెస్ కావాలనే శాయశక్తులా కష్టపడతాం. తీరా అది ఫెయిలైతే చాలా నిరాశ అనిపిస్తుంది. అయితే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సక్సెస్ కావడంతో నా బెంగ తీరిపోయింది. ♦ మీకు సేవ చేయడం ఇష్టం కదా? అవును. నేనో సమయంలో పదిహేను రోజుల పాటు అనారోగ్యంతో మంచమ్మీదే ఉండిపోయాను. అప్పుడు నాలో పెద్ద మథనమే జరిగింది. జీవితపు విలువ తెలిసింది. ఏదీ శాశ్వతం కాదని అర్థమైంది. అందుకే స్వార్థంగా ఉండకూడదని, వీలైనంత వరకూ ఇతరులకు ప్రేమను పంచాలని నిర్ణయించుకున్నాను. ప్రత్యూష ఫౌండేషన్‌ను స్థాపించి, దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. ♦ అసలు మీ జీవిత లక్ష్యం ఏమిటి? ఈ భూమి మీద పుట్టినందుకు, సుఖంగా జీవిస్తున్నందుకు ఈ సమాజానికి కొంతయినా మేలు చేయాలి. నేనే కాదు... అందరూ ఇలానే ఆలోచించాలి. అలా అని ఉన్నదంతా పెట్టాల్సిన పని లేదు. మనకి ఉన్నదాంట్లో కొంత ఇతరుల కోసం ఇవ్వగలిగితే చాలు. కొందరి కళ్లలోనైనా మన వల్ల సంతోషం కనిపిస్తే చాలు. సాక్షి ఫన్డే మీద మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయండి. ప్రియదర్శిని రామ్, ఎడిటర్, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. ఫోన్: 040-23256000 funday.sakshi@gmail.com -
సమాజ సేవ లో హీరోయిన్ సమంత
-
అతనితో నా ప్రేమకు బ్రేకప్ ఉండదు - సమంత
సమంత అంటేనే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. ఆమె మాటల్లో కూడా బోల్డ్నెస్, ఓ బ్యూటీ కనిపిస్తాయి. తనతో మాట్లాడుతూ ఉంటే కాలం ఘనీభవించినట్టే అనిపిస్తుంది. తన ఫ్లాష్‌బ్యాక్, లవ్‌ట్రాక్, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి సమంత ‘సాక్షి’తో ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ‘‘ప్రేమ అనేది గుర్రపు స్వారీ చేయడం, ఫ్రెంచ్ నేర్చుకోవడంలాంటిది. యంగ్‌గా ఉన్నప్పుడే ప్రేమ విలువ తెలుసుకోవాలి. లేకపోతే పెద్దయిన తర్వాత కష్టం’’ అని ‘వాట్సప్’ అనే సోషల్ నెట్‌వర్క్‌లో పెట్టారు. దానర్థం ఏంటి? చిన్నప్పుడు నేను ఎవర్నీ పట్టించుకునేదాన్ని కాదు. చివరికి నా ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా. చాలా స్వార్థంగా ఉండేదాన్ని. నా గురించి మాత్రమే ఆలోచించుకునేదాన్ని. నేనెలా పైకి రావాలి? ఎలా డబ్బులు సంపాదించాలి? ఇదే ఆలోచన తప్ప ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలి? ఎంత ప్రేమగా ఉండాలి? అనే విషయాలు తెలిసేవి కావు. కానీ, ఈ మధ్యే తెలిసొచ్చింది. అప్పట్నుంచీ నా కుటుంబ సభ్యులను ప్రేమించడం మొదలుపెట్టాను. వాళ్ల కోసం టైమ్ కేటాయిస్తున్నాను. ఆ నేపథ్యంలోనే ఈ ప్రేమ గురించి అలా ‘వాట్సప్’లో నా ఉద్దేశాన్ని ప్రకటించాను. డబ్బులు సంపాదించాలనే తపన అందరికీ ఉంటుంది. పర్టిక్యులర్‌గా మీకు వేరే కారణం ఏదైనా ఉందా? మాది సాదాసీదా కుటుంబం. ఆర్థిక ఇబ్బందులు మామూలుగా ఉండేవి కావు. ఏది కొనుక్కోవాలన్నా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. నచ్చిన ఆహారం తినడానికి కూడా కుదిరేది కాదు. అందుకే ఓ సొంత ఇల్లు, ఓ కారు, కొంత బ్యాంక్ బాలెన్స్‌తో హాయిగా సెటిలవ్వాలని ఉండేది. ఆ ఆశయాన్ని నెరవేర్చుకోవడం కోసం బాగా చదువుకునేదాన్ని. పెద్ద జాబ్‌లో సెటిలవ్వాలని ఉండేది. దేవుడు మీరు కోరుకున్నదాన్నికన్నా ఎక్కువే ఇచ్చాడు కదా? నిజంగానే ఈ జీవితం ఆ దేవుడి దయే. సినిమాల్లోకి వస్తానని నేననుకోలేదు. అంతా అనుకోకుండా జరిగింది. నేనూహించనంత బ్యాంక్ బాలెన్స్ సంపాదించుకున్నాను. అందుకేనా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? అవును. వాస్తవానికి గత ఏడాది వరకు నాకిలాంటి ఫీలింగ్స్ ఉండేవి కావు. ఎప్పుడైతే ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొన్నానో, జయాపజయాలు చవి చూశానో... అప్పుడు ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నాను. ఓ రకంగా కనువిప్పు కలిగింది. అందుకే వీలైనంత వరకూ ఇతరులకు సహాయపడాలని నిర్ణయించుకున్నాను. ఏదైనా సేవా సంస్థ పెట్టేటప్పుడు ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇవన్నీ జరగడానికి దాదాపు రెండు నెలలు పడుతుంది. అప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి ఈ ఫౌండేషన్ వివరాలు తెలియజేయాలనుకుంటున్నా. డబ్బు లేనప్పుడు, డబ్బు ఉన్నప్పుడు మీలో వచ్చిన మార్పు? అప్పుడు నా గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచించేదాన్ని కాదు. కడుపు నిండిన బేరం అంటారు కదా.. అది నిజమే. కడుపు నిండినవాళ్లు ఏదైనా మాట్లాడతారు. నన్నే తీసుకోండి.. ఇప్పుడే ఏదైనా విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలంటే తడుముకోకుండా, తడబాటు లేకుండా తీసేసుకుంటాను. కానీ, డబ్బుల్లేకపోతే ఏ విషయంలోనూ ఓ పట్టాన నిర్ణయం తీసుకోలేం. ఆ కారణంగానే డబ్బుల్లేనివాళ్ల గురించి నేను ఈజీగా ఓ జడ్జ్మెంట్కి వచ్చేయను. వాళ్లకి రకరకాల సమస్యలుంటాయి. ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను కాబట్టి, ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే వాళ్లవైపు నుంచి ఆలోచిస్తాను. అంతస్తుతో సంబంధం లేకుండా అందరితోనూ సమానంగా ఉంటాను. ఇంతకీ మీ ప్రేమ ప్రయాణం ఎలా సాగుతోంది? చాలా బలంగా సాగుతోంది. మా ప్రేమకు ‘బ్రేకప్’ ఉండదు. అంత అవగాహనతో ముందుకెళుతున్నాం. మీకు ఆల్రెడీ పెళ్లయ్యిందని టాక్? అయితే అయ్యిందని చెబుతాను. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. నాలానే తనూ అబద్ధాలు అడటానికి ఇష్టపడడు. ఇంతకీ ఆ అతగాడి పేరు సిద్దార్ధ్ అని కన్ఫర్మ్ చేస్తారా? అది మాత్రం అడగొద్దు. మరి.. పెళ్లెప్పుడు చేసుకుంటారు? ఇప్పుడప్పుడే లేదు. ఇంకా చాలా సమయం పడుతుంది. అప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటా. ఓకే... ‘రామయ్యా వస్తావయ్యా’ విషయానికొద్దాం. ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం? ఎన్టీఆర్, హరీష్‌శంకర్, ‘దిల్’ రాజు కాంబినేషన్లో సినిమా కాబట్టి చేయాలనుకున్నాను. కథ, పాత్ర నచ్చాయి. ఈ కారణాల వల్లే ఒప్పుకున్నాను. పెద్ద బడ్జెట్ మూవీ, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్లో చేయాలనే సంకల్పంతో కూడా ఈ సినిమా అంగీకరించాను. కమర్షియల్ సినిమా మీద దృష్టి పెట్టారెందుకని? గత ఏడాది నేను చేసిన ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు ప్రయోగాత్మక చిత్రాలు. ముఖ్యంగా ‘ఈగ’తో సినిమా ఏంటని కొంతమంది అన్నారు. ఆ సినిమాలో నేను సాదాసీదాగా కనిపిస్తాను. అలాగే, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’లో కూడా అంతే. దాంతో సమంత గ్లామరస్ రోల్స్‌కి పనికి రాదని, పెద్ద బడ్జెట్ సినిమాలకు సూట్ కాదని కొంతమంది అన్నారు. అందుకే ఈ ఏడాది హైలీ కమర్షియల్ మూవీస్‌లో నటించాలనుకున్నా. ఇకముందు కూడా ఇలాంటి సినిమాలే చేస్తారా? లేదు. ఎందుకంటే సమంత గ్లామరస్ మాత్రమే చేయగలదనో, డీ-గ్లామర్‌కే పనికొస్తుందనో ఏదో ఒక ముద్ర నా మీద పడకూడదు. అందుకే, అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది. తమిళంలో తీసిన పిజ్జా, సూదు కవ్వమ్లాంటి చిన్న బడ్జెట్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్‌లో కూడా నటించాలని ఉంది. అప్పుడు మీ పారితోషికం తగ్గించుకోవాల్సి ఉంటుందేమో? తగ్గించుకుంటా. స్క్రిప్ట్ బాగా నచ్చిందనుకోండి చిన్న బడ్జెట్ చిత్రం కాబట్టి ముందే పారితోషికం డిమాండ్ చేయకుండా లాభాల్లో ఇంత పర్సంట్ ఇస్తే చాలంటాను. ‘రామయ్యా వస్తావయ్యా..’ని ఎందుకు చూడాలంటే ఏం చెబుతారు? తారక్ అద్భుతంగా నటించిన వైనం, తన లుక్స్ కోసం చూడొచ్చు. డాన్సులు, ఫైట్స్ బాగా చేశారు. ఆయన అభిమానులకు ఓ మంచి ఫీస్ట్లాంటిది. ఇక, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లున్నాం. వాళ్ల కోసం కూడా చూడొచ్చు (నవ్వుతూ). ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది కదా? అది ప్రతి సినిమాకీ వస్తుంది. కానీ మనం పరిగణనలోకి తీసుకోవాల్సింది వసూళ్లనే. నాకు తెలిసి ప్రేక్షకులు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. - డి.జి. భవాని -
సమంత ధరించిన దుస్తులు వేలం పాట!
వెండితెరపై రకరకాల కాస్ట్యూమ్స్‌లో అందంగా కనిపించే సమంత విడిగా కూడా మంచి మంచి దుస్తుల్లో దర్శనమిస్తారు. ఆడియో వేడుకల్లో, ఇతర వేడుకల్లో సమంత కాస్ట్యూమ్స్ దాదాపు సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవుతాయి. ఆయా వేడుకల్లో సమంత ధరించిన దుస్తులను మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే వేలం పాటలో పాల్గొనొచ్చు. స్వయంగా సమంతే ఈ వేలం పాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దానికో బలమైన కారణం ఉంది. ఈ వేలం పాట ద్వారా వచ్చే డబ్బుని ‘ప్రత్యూష ఫౌండేషన్’ అనే సేవా సంస్థకు విరాళంగా ఇవ్వబోతున్నారు సమంత. ఎప్పుడు ఆక్షన్ నిర్వహిస్తారనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఈ బ్యూటీ త్వరలో తెలియజేస్తారు. ఇది నిజంగా అభినందించదగ్గ విషయమే. ఇంకో విషయం కూడా తెలుసుకుంటే.. సమంతను అభినందనల్లో ముంచెత్తేయడం ఖాయం. అదేంటంటే... కేవలం తన కాస్ట్యూమ్స్‌నే కాకుండా ఇతర స్టార్స్ ధరించిన దుస్తులను కూడా సేకరించాలనుకుంటున్నారామె. దీని గురించి సమంత చెబుతూ -‘‘నా సహచర తారల దగ్గర వాళ్ల డ్రెస్‌లు అడుగుతాను. అవసరమైతే బతిమాలుకుంటాను. ఒకవేళ ఇవ్వకపోతే దొంగలించేస్తా. ప్రత్యూష ఫౌండేషన్ ఎదుగుదల చూడాలన్నది నా లక్ష్యం. ముఖ్యంగా పిల్లలు, ఆడవాళ్ల అభివృద్ధి కోసం ఈ సేవా సంస్థ పాటుపడుతోంది. ఇక్కడ సర్వీస్ చేస్తున్నవాళ్లంతా యువతీ యువకులే. వాళ్ల నిజాయతీ నాకు నచ్చింది. ఈ సేవా సంస్థ కోసం కొంతమంది స్పాన్సరర్స్తో కూడా మాట్లాడుతున్నా’’ అని చెప్పారు. దీన్నిబట్టి సమంత హృదయం ‘గోల్డ్’ అని అర్థమవుతోంది కదూ.