రామయ్య డ్యూయెట్.. ఇంతకీ ఆ జాబిల్లి ఎవరు?
రామయ్య డ్యూయెట్.. ఇంతకీ ఆ జాబిల్లి ఎవరు?
Published Sat, Aug 31 2013 11:44 PM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
జాబిల్లి ముంగిట్లో డ్యూయెట్లు పాడుకోవడం మనకు తెలుసు. కానీ జాబిల్లితో డ్యూయెట్ పాడటం ఎక్కడైనా విన్నామా? మన ఎన్టీఆర్ పాడబోతున్నాడు. అయితే... ఎన్టీఆర్ డ్యూయెట్ పాడేది... ఆకాశంలోని జాబిల్లితో కాదు, నేల మీది జాబిల్లితో. ఇంతకీ ఆ జాబిల్లి ఎవరు? అనుకుంటున్నారా? సమంత కావచ్చు. శ్రుతీహాసన్ అయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎందుకంటే... ‘రామయ్యా వస్తావయ్యా’లో కథానాయికలు వాళ్లిద్దరేగా. ఈ సినిమాలో అనంత శ్రీరామ్ రాసిన అందమైన యుగళగీతం ‘జాబిల్లి నువ్వే చెప్పమ్మా’. ఈ పాట టీజర్‌ని శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘ఎన్టీఆర్ కథ అంటే మాస్ మెచ్చాలి.
మా సంస్థ నుంచి వచ్చే సినిమా కథంటే... అన్ని వర్గాలవారికీ నచ్చాలి. అందుకు తగ్గట్టే ‘రామయ్యా వస్తావయ్యా’ కథ ఉంటుంది. ‘బృందావనం’ ఎన్టీఆర్‌కి ఎంత మంచి పేరు తెచ్చిందో.... అంతకు పదింతలు పేరు తెచ్చే సినిమా ఇది. హరీష్‌శంకర్ అద్భుతం అనిపించే స్థాయిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఎన్టీఆర్ పాత్రను ఆయన మలిచిన తీరు చాలా బాగుంది. కచ్చితంగా ఈ సినిమాతో హరీష్ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది. తమన్ శ్రావ్యమైన స్వరాలందించాడు. త్వరలో పాటలను, సినిమాను విడుదల చేస్తాం’’ అని చెప్పారు.
ఎన్టీఆర్‌తో తనకిది హ్యాట్రిక్ హిట్ అవుతుందని తమన్ నమ్మకం వ్యక్తం చేశారు. సానుకూల దృక్పథాన్ని పెంపొందించే పాట రాశానని అనంతశ్రీరామ్ చెప్పారు. ఇందులో కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారని స్క్రీన్‌ప్లే రచయిత రమేష్‌రెడ్డి అన్నారు. కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, ముఖేష్‌రుషి, రవిశంకర్, రావురమేష్, అజయ్, ప్రగతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: చోటా కె.నాయుడు, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.
Advertisement