శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను సిక్కోలు జిల్లాను వణికించినప్పటికీ ప్రజల్లో సమైక్యవాదం మాత్రం తగ్గలేదు. ప్రజ లు, ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు. మంగళవారం జిల్లా వ్యాప్తం గా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయం వద్ద మినిస్టీరియల్ ఉద్యోగులు, కలెక్టరేట్ వద్ద రెవెన్యూ , గృహనిర్మాణ శాఖ ఉద్యోగులు దీక్షలు కొనసాగించారు. కలెక్టరేట్ వద్ద కేంద్ర మంత్రులు కిల్లి కృపారాణి, పల్లంరాజుతో పాటు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తదితరులు బొమ్మలతో రావణాసుర వధ పేరిట జెడ్పీ ఉద్యోగులు ధర్నా చేశారు. అనంతరం కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కలెక్టరేట్ సమావేశ మందిరంలో పై-లీన్ తుపాను నష్టంపై ఆధికారులతో సమీక్షిస్తున్నారు. మంత్రులు రాజీనామాలు చేయాలని, టీ నోట్‌ను వెనుక్కితీసుకోవాలని, రాష్ట్రాన్ని సమైక్య ఉంచాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు కిల్లారి నారాయణరావు, ప్రసాద్, శోభారాణి పాల్గొన్నారు.
రాజాంలో ఎన్‌జీఓ దీక్షా శిబిరం 64వ రోజూ కొనసాగింది. పంచాయతీ రాజ్ ఉద్యోగులు ఆరుగురు దీక్షలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 14వ రోజు దీక్షలో ఆరుగురు కూర్చున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజే బాబు, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
పాలకొండ ఆంజనేయసెంటర్‌లో కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ రిలే నిరాహారదీక్షా శిబిరంలో వీరఘట్టం మండలం కత్తులకవిటికి చెందిన జంపు ఉమామహేశ్వరరావు, రౌతు చంద్రరావు నేతృత్వంలోని 20 మంది ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. సమన్వయకర్తలు విశ్వాసరాయి కళావతి, పాలవలస విక్రాంత్ శిబిరాన్ని ప్రారంభించి సమైక్య ఉద్యమ ఆవశ్యకతను వివరించారు.
పాలకొండ డివిజన్ సమైక్యాంధ్ర పరిరక్షణ ఆధ్వర్యంలో విద్యార్థులు కదంతొక్కారు. ఐదుచోట్ల వేలాది విద్యార్థులు ట్రాఫిక్‌ను దిగ్బంధించారు. శిబిరంలో ఉపాధ్యాయులు, సమైక్యాంధ్ర జేఏసీ ప్రతినిధులు దీక్ష చేపట్టారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం సందర్శించి సంఘీభావం తెలిపారు.
కాశీబుగ్గ బస్టాండ్ వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది.
పాతపట్నంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షలు 70వ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం నాటి దీక్షలో మండల సాక్షరాభారత్ కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు. మంత్రి శత్రుచర్ల కాన్వాయ్‌పైకి చెప్పులు విసిరి నిరసన తెలిపారు. మెళియాపుట్టి, కొత్తూరులలో రిలేనిరహార దీక్షలు కొనసాగుతున్నాయి.
తగ్గని ఉద్యమ వేడి
Published Wed, Oct 16 2013 6:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
Advertisement
Advertisement