Phalin Cyclone
-
ముంచెత్తిన వంశధార
ఆమదాలవలస టౌన్, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు వంశధార నది పొంగి పొర్లింది. సుమారు 50 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించడంతో నదీతీర ప్రాంతమైన చెవ్వాకులపేట గ్రామాన్ని చుట్టుముట్టింది. దీంతో ఆందోళనకు గురైన గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే తహశీల్దార్ జి.వీర్రాజు, ఎంపీడీవో పంచాది రాధ గ్రామానికి వెళ్లి 130 మందిని రామచంద్రాపురంలోని పాఠశాల భవనంలోకి తరలించారు. సోమవారం ఉదయం నుంచి భోజన ఏర్పాట్లు చేశారు. సాయంత్రానికి వంశధార ఉగ్రరూపం తగ్గడంతో పాటు చెవ్వాకులపేట గ్రామం చుట్టూ వరదనీరు తగ్గడంతో గ్రామస్తులను ఇళ్లకు పంపించారు. వరద ప్రభావంతో ఆనందపురం, చిట్టివలస, చెవ్వాకులపేట, రామచంద్రపురం తదితర గ్రామాల్లోని సుమారు వంద ఎకరాలు నీట మునిగాయి. ఆమదాలవలస- పురుషోత్తపురం ఆర్అండ్బీ రహదారి చెవ్వాకులపేట సమీపంలో జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రక్షణ చర్యలు చేపట్టండి వరద ముంపునకు గురైన వారికి పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి అధికారులను ఆదేశించారు. చెవ్వాకులపేట గ్రామాన్ని సోమవారం ఆమె సందర్శించి ప్రజలను పరామర్శించారు. వరద ముప్పు పొంచి వున్న చెవ్వాకులపేట గ్రామాన్ని ఆర్డీవో ఆర్డీఓ గణేష్‌కుమార్, మండల ప్రత్యేకాధికారి వి.జయరాజ్, పశుసంవర్ధక శాఖ జెడీ నాగన్న, సీఐ వీరాకుమార్, ఎస్ఐ మంగరాజు తదితరులు పొన్నాంపేట గ్రామ సర్పంచ్ ఇప్పిలి జయలక్ష్మిని, వరదబాధితులను కలిసి మాట్లాడారు. అనంతరం గ్రామాన్ని సందర్శించారు. బాధితులను ఆదుకుంటాం.. వరద బాధితులను ఆదుకుంటామని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు కిల్లి రామ్మోహన్రావు, బొడ్డేపల్లి మాధురీ, పార్టీ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ తెలిపారు. చెవ్వాకులపేట వరద బాధితులను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెవ్వాకులపేట గ్రామానికి ఏటా వరద ముప్పు తప్పడంలేదన్నారు. గ్రామంలో వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జి.చలపతిరావు, జి.శ్రీనివాసరావు, సైలాడ దాసునాయుడు, నాగు, ఎండా విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. వరద నీటితో ఆందోళన కళింగపట్నం(గార): పై- లీన్ తుపాను ప్రభావంతో ఒడిశాలోని వంశధార నదీపరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో వంశధార నదికి నీరు పోటెత్తింది. మడ్డువలస గేట్లు పూర్తిగా ఏత్తేయడంతో సోమవారానికి నీటి ప్రవాహం ఉద్ధృతమైంది. దీంతో కళింగపట్నం పంచాయతీలోని శ్రీకాకుళం- కళింగపట్నం రహదారి మీదుగా వరద నీరు జోరుగా రావడంతో తాన్సాహెచ్పేట, కండ్రపేట, యాతపేట, నగరాలపేట గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. తుపాను ప్రభావంతో ఆటుపోట్లు రావడంతో నదీజలాలు సముద్రంలో కలవలేదు. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వరదనీరు రానురాను ఉద్ధృతంగా ప్రవహించింది. ముందుగా తాన్సాహెబ్పేట, కండ్రపేట గ్రామాలకు వరదనీరు ప్రవహిస్తుండడంతో జాతీయ విపత్తుబృందాలు గ్రామంలోకి వచ్చాయి. ఒక దశలో గ్రామాలు ఖాళీ చేయించాలని అధికారులు నిర్ణయించారు. గ్రామసమీపంలో సుమారు 20 ఎకరాల వరిపంట నాశనమైంది. పలు చోట్ల రహదార్లకు గండ్లుపడ్డాయి. తుపాను పర్యవేక్షణాధికారి, గతంలో శ్రీకాకుళం ఆర్డీవోగా పనిచేసిన నక్కా సత్యనారాయణ కళింగపట్నం వచ్చి వరద పరిస్థితిని పర్యవేక్షించారు. రాత్రి 9 గంటల నుంచి వరదనీరు తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్రామాల్లో తహశీల్దార్ బి.శాంతి, ఆర్ఐ మురళీధర్ నాయక్‌లు పర్యటించారు. -
తగ్గని ఉద్యమ వేడి
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను సిక్కోలు జిల్లాను వణికించినప్పటికీ ప్రజల్లో సమైక్యవాదం మాత్రం తగ్గలేదు. ప్రజ లు, ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు. మంగళవారం జిల్లా వ్యాప్తం గా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయం వద్ద మినిస్టీరియల్ ఉద్యోగులు, కలెక్టరేట్ వద్ద రెవెన్యూ , గృహనిర్మాణ శాఖ ఉద్యోగులు దీక్షలు కొనసాగించారు. కలెక్టరేట్ వద్ద కేంద్ర మంత్రులు కిల్లి కృపారాణి, పల్లంరాజుతో పాటు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తదితరులు బొమ్మలతో రావణాసుర వధ పేరిట జెడ్పీ ఉద్యోగులు ధర్నా చేశారు. అనంతరం కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కలెక్టరేట్ సమావేశ మందిరంలో పై-లీన్ తుపాను నష్టంపై ఆధికారులతో సమీక్షిస్తున్నారు. మంత్రులు రాజీనామాలు చేయాలని, టీ నోట్‌ను వెనుక్కితీసుకోవాలని, రాష్ట్రాన్ని సమైక్య ఉంచాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు కిల్లారి నారాయణరావు, ప్రసాద్, శోభారాణి పాల్గొన్నారు. రాజాంలో ఎన్జీఓ దీక్షా శిబిరం 64వ రోజూ కొనసాగింది. పంచాయతీ రాజ్ ఉద్యోగులు ఆరుగురు దీక్షలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 14వ రోజు దీక్షలో ఆరుగురు కూర్చున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజే బాబు, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. పాలకొండ ఆంజనేయసెంటర్లో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ రిలే నిరాహారదీక్షా శిబిరంలో వీరఘట్టం మండలం కత్తులకవిటికి చెందిన జంపు ఉమామహేశ్వరరావు, రౌతు చంద్రరావు నేతృత్వంలోని 20 మంది ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. సమన్వయకర్తలు విశ్వాసరాయి కళావతి, పాలవలస విక్రాంత్ శిబిరాన్ని ప్రారంభించి సమైక్య ఉద్యమ ఆవశ్యకతను వివరించారు. పాలకొండ డివిజన్ సమైక్యాంధ్ర పరిరక్షణ ఆధ్వర్యంలో విద్యార్థులు కదంతొక్కారు. ఐదుచోట్ల వేలాది విద్యార్థులు ట్రాఫిక్‌ను దిగ్బంధించారు. శిబిరంలో ఉపాధ్యాయులు, సమైక్యాంధ్ర జేఏసీ ప్రతినిధులు దీక్ష చేపట్టారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం సందర్శించి సంఘీభావం తెలిపారు. కాశీబుగ్గ బస్టాండ్ వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. పాతపట్నంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షలు 70వ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం నాటి దీక్షలో మండల సాక్షరాభారత్ కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు. మంత్రి శత్రుచర్ల కాన్వాయ్‌పైకి చెప్పులు విసిరి నిరసన తెలిపారు. మెళియాపుట్టి, కొత్తూరులలో రిలేనిరహార దీక్షలు కొనసాగుతున్నాయి. -
విజయమ్మ పరామర్శ నేడు
కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో పర్యటన శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ప్రచండ పై-లీన్ తుఫాన్ తాకిడికి అతలాకుతలమైన జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ బుధవారం పర్యటించనున్నట్లు పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో ఈ విషయం పేర్కొన్నాయి. బుధవారం ఉద యం విజయమ్మ హైదరాబాద్‌లో బయలుదేరి 8 గంటలకు విశాఖపట్నం వస్తారు. అక్కడి నుంచి 9.30 శ్రీకాకుళం సింహద్వారం వద్దకు చేరుకుంటారు. స్థానిక నాయకులతో కలసి అక్కడి నుంచి నేరుగా కంచిలి వెళ్తారు. ఆ మం డలంలోని పెద్దకొజ్జిరియా, జాడుపూడి ప్రాం తాల్లో పర్యటిస్తారు. అనంతరం కవిటి మం డలం రాజపురం, జగతి, ఇద్దివానిపాలెంతోపాటు అదే మండలంలోని కళింగపట్నం వె ళ్తారు. అక్కడి నుంచి సోంపేట మండలం ఇసుకలపాలెం చేరుకొని అటు తరువాత తలతంపర మీదుగా బారువ వెళ్తారు. ఆయా ప్రాం తాల్లో తుఫాన్ నష్టాలను పరిశీలించడంతోపా టు బాధితులను పరామర్శించి వారి కష్టనష్టాల ను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. అనంతరం విశాఖపట్నం బయలుదేరి వెళతారు. విజయవంతం చేయండి : కృష్ణదాస్ రిమ్స్‌క్యాంపస్: తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వస్తున్న పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులను కోరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు జిల్లా పార్టీ నాయకులంతా కలసి బాధిత ప్రాంతాల్లో పర్యటించామని, అక్కడి ప్రజల కష్టాలను ఆయనకు తెలియజేయగా విజయమ్మను జిల్లాకు పంపుతున్నారని వివరించారు. తుఫాన్ దాటికి తీవ్ర నష్టం వాటిల్లి ప్రజలు నానావస్ధలు పడుతుంటే, వారిని అదుకోవటంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రాష్ట్ర మంత్రుల బృందం బాధిత ప్రాంతాల్లో పర్యటించినా కనీసం ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారని అన్నారు. కవిటికి వెళ్లిన మంత్రి కొండ్రు మురళీ అసలు ఇక్కడేమీ నష్టం జరగలేదని వ్యాఖ్యానించడం దారుణమని విమర్శించారు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ టెక్కలి డివిజన్లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. బాధిత ప్రాంతాల్లో ఎక్కడా ప్రభుత్వం సహాయ చర్యలు చేపడుతున్నట్టు లేదన్నారు. బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయటం పట్ల వై.ఎస్.ఆర్ సీపీ ముందుండి నిల్చుంటుందని చెప్పారు. సమావేశంలో శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తలు వరుదు కల్యాణి, వై.వి.సూర్యనారాయణ, ఆమదాలవలస, ఎచ్చెర్ల సమన్వయకర్తలు బొడ్డేపల్లి మాధురి, గొర్లె కిరణ్‌కుమార్, జిల్లా అడ్హాక్ కమిటీ సభ్యుడు అందవరపు సూరిబాబు, శ్రీకాకుళం పట్టణ అధ్యక్షులు ధర్మాన ఉదయ్ భాస్కర్, రాష్ట్ర సాంసృ్కతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష, తదితరులు పాల్గొన్నారు. -
తీరంలో కన్నీరు
చుట్టూ ఎటుచూసినా నీరు.. ప్రజల కంట కన్నీరు.. ఊళ్లకు ఊళ్లు జలదిగ్బంధం. వాగులను తలపిస్తున్న పంటపొలాలు. ప్రచండ గాలులకు నేలకొరిగిన చెట్లు. దెబ్బతిన్న ఇళ్లు. నీటి ఉధృతికి ధ్వంసమైన పడవలు, వలలు. రోజుల తరబడి వీడని అంధకారం. ఇదీ ఉద్దానం పల్లెల్లో కనిపిస్తున్న విషాద దృశ్యం. ఇంత ఘోరకలిలోనూ అందని ఆపన్న హస్తం. మాట సాయానికైనా ముందుకు రాని సర్కారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు పర్యటనలతో హడావుడి చేసినా బాధితులకు ఉపశమనం కలిగించే ఒక్క హామీ అయినా ఇవ్వలేకపోగా.. నాలుగు రోజులవుతున్నా అధికార యంత్రాంగం గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. తక్షణ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. అంధకారం అలుముకున్న బాధితుల జీవితాల్లో ఇప్పట్లో వెలుగులు ప్రసరించే అవకాశం లేదు. కన్నీరు తుడిచే దిక్కూ లేదు. కొబ్బరి రైతుకు కోలుకోని దెబ్బ కవిటి: పై-లీన్ సృష్టించిన బీభత్సానికి నేలకూలిన పంటను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. మండలంలో సుమారు 7వేల హెక్టార్లలో ఉన్న కొబ్బరి, జీడిమామిడి, పనస తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లి రైతుల వెన్నువిరిగి పోయినా ఆదుకోవడంలో ప్రభుత్వ జాప్యాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో చేసేదేమీ లేక కొద్దిగా వాలిన చెట్ల వేర్లను మట్టితో పూడ్చడం, దెబ్బతిన్న మొవ్వులను కత్తిరించడం, రాలిన కాయలు, కమ్మలను పోగు చేయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. కూలిన చెట్లను తొలగించేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని నెలవంక, కపాసుకుద్ది, డీజీపుట్టుగ, కవిటి, జాగలి, భైరిపురం, రాజపురం, బెజ్జిపుట్టుగ, బొరివంక, వ రక, బల్లిపుట్టుగ, ఉలగాం, లండారిపుట్టుగ, పుటియాదళ రెవెన్యూ గ్రామాల పరిధిలో కొబ్బరి, అరటి, జీడి, మామిడి, పనస పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. తుపాను బాధితులను ఆదుకోవాలి పలాస రూరల్, న్యూస్‌లైన్: తుపానుతో పంటలు నష్టపోరుున రైతులతో పాటు రోడ్లు, విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించి తీరప్రాంత గ్రామాల ప్రజలను ఆదుకోవాలని పలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇచ్ఛాపురం నుంచి వజ్రపుకొత్తూరు వరకు ఉద్దాన ప్రాంతంలో పాడైన పంటలు, తోటలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకార గ్రామ ప్రజలకు నెల రోజులు పాటు ప్రభుత్వమే పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు, భోజనం, నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు, హుకుంపేట, మందస మండలం గంగువాడ తదితర ప్రాంతాల్లో రూ.2 లక్షలు విలువ గల 100 నాటు పడవలు, రూ.20 లక్షలు విలువ గల మరబోట్లు, రూ.4 లక్షలు విలువ గల చిన్నపడవలతో పాటు 20 టన్నుల చేపలు, ఎండుచేపలు నాశనమయ్యాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ బీసీలకు చెందిన బాధితులకు ఉచిత విద్యుత్ అందించాలని, కూలిపోరుున ఇళ్లస్థానంలో నూతనంగా నిర్మించాలని డిమాండ్ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వారిలో కుల నిర్మూలన పోరాట కమిటీ నాయకుడు మిస్క కృష్ణయ్య, డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కోత ధర్మారావు, పి.దుర్యోధన, పౌరహక్కుల సంఘ సహాయ కార్యదర్శి పత్తిరి దానేసు తదితరులు ఉన్నారు. ఉప్పు రైతులను ఆదుకోవాలి శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తుపాన్ ప్రభావంతో ఉప్పుమడుల్లో నీరుచేరి పాడయ్యూయని, రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు రైతులు కోరారు. ఈ మేరకు కళింగపట్నానికి చెందిన ఉప్పురైతులు కలెక్టర్ సౌరభ్‌గౌర్‌ని మంగళవారం ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. అరటి రైతుల గోడు వినేవారే కరువు నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: తుపాను తీవ్రతకు మండలంలో సాగుచేస్తున్న అరటి పంటకు తీవ్ర నష్టం సంభవించినా రైతుల గోడు వినేవారే కరువయ్యారు. కనీసం విరిగిన చెట్లను పరిశీలించేందుకు కూడా అధికారులు రాకపోకవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన అరటి పంట చేతికందివచ్చే సమయంలో కళ్లముందే ధ్వంసం కావడంతో గగ్గోలు పెడుతున్నారు. మండలంలో 65 ఎకరాల్లో అరటి తోటలు ధ్వంసం కాగా రూ.50 లక్షల వరకూ నష్టం జరిగినట్టు అంచనా. ఎకరా వీస్తీర్ణంలో 400 చెట్లకు 350కు పైగా చెట్లు గెలలుతో ఉన్నాయి. ఇవన్నీ తుపాను గాలికి నేలకొరిగాయి. ఎకరాకు రూ.80వేలు చొప్పున నష్టం జరిగిందని అంచనా. ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని కోమర్తి, దేవాది, మాకివలస, గోపాలపెంట, కిళ్లాం గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన చెందుతున్నారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం కవిటి, న్యూస్‌లైన్: తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. మండలంలోని రాజపురం, కపాసుకుద్ది, జగతి తదితర గ్రామాల్లో నాయకుల బృందం పర్యటించి రైతులు, మత్స్యకారులు, సామాన్య ప్రజలు పడిన ఇబ్బందులను తెలుసుకుంది. పంట నష్టం పరిశీలనకు వచ్చిన మంత్రులు రఘువీరారెడ్డి, కృపారాణి, కోండ్రు మురళీ, శత్రుచర్ల, గంటా శ్రీనివాస్‌లు కనీసం తమ మాటలు కూడా వినకుండా వెళ్లిపోయారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందజేసి ఆదుకోవాలని కోరారు. ఈ పర్యటనలో వైఎస్సార్ సీపీ నాయకులు ధర్మాన కృష్ణదాస్, పిరియా సాయిరాజ్, కణితి విశ్వనాథం, తమ్మినేని సీతారాం, బి.హేమమాలినీరెడ్డి, బి.మాధురి, వజ్జ బాబూరావు, కోత మురళీధర్, కె.వెంకటేశ్వరరావు, రమేష్‌కుమార్, పి. కామేశ్‌లు పాల్గొన్నారు. తుపాను తీవ్రత, బాధిత రైతులు, మత్స్యకారుల సమస్యలను పార్టీ అధినేత జగన్మోహనరెడ్డికి వివరిస్తామని తెలిపారు. పక్క ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కోనారి మల్లేసు. వజ్రపుకొత్తూరు మండలం రెయ్యిపాడు గ్రామం. ఎనిమిది ఎకరాల జీడి, రెండు ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి తోటలు ఉన్నాయి. వీటిద్వారా ఏటా రూ. 3 లక్షల ఆదాయం సమకూరుతుంది. తుపాను ధాటికి 55 జీడి చెట్లు, 15 కొబ్బరి, 90 టేకు మొక్కలు, 25 అకేషియా చెట్లు ధ్వంసమయ్యాయి. సుమారు రూ1.50 లక్షల నష్టం సంభవించింది. రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు నష్టాన్ని అంచనావేసేందుకు రాలేదు. గ్రామంలో సుమారు 125 మంది రైతుల పరిస్థితీ ఇదే. కూరగాయల పంటతో ఏటా రూ.30 వేలు వరకు సంపాదించుకునేవాడినని, తుపానుతో పంటలు పూర్తిగా నాశనమయ్యాయని వజ్రపు కొత్తూరు మండలం పెద్దమురహరిపురానికి చెందిన యలమంచిలి జగ్గారావు ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. పువ్వు పిందెలతో ఉన్న బీర పంట పూర్తిగా పాడైందని వాపోతున్నాడు. సుమారు.40 వేలు నష్టం సంభవించిందని వాపోతున్నాడు. సుమారు 30 గ్రామాల్లో రూ.19 లక్షల నష్టం సంభవించి ఉంటుందని రైతులు చెబుతున్నారు. చిత్రంలో నేలకూలిన అరటి చెట్లను చూపిస్తున్న రైతు పేరు బత్సల ధర్మారావు. రెయ్యిపాడు గ్రామం. ఇతనికి 4 ఎకరాల జీడి, కొబ్బరి తోటలు ఉన్నాయి. తుపానుకు తోటలోని అరటి, జీడి, కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. సుమారు 1.20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ప్రతి మొక్కనూ కొడుకులా పెంచుకున్నామని, ఫలసాయం అందివచ్చే సరికి తీవ్ర నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తేరుకోవడానికి దశాబ్దాలే..! ఇచ్ఛాపురం, న్యూస్‌లైన్: తుపాను బాధితులను ప్రభుత్వం ఆదుకోకుంటే మరో దశాబ్దం గడిచినా తేరుకోవడం కష్టమే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నా యి. మండలంలోని తీరప్రాంతంలో ఉన్న 6 గ్రామాల మత్య్సకారులు తుపా ను ధాటికి అల్లాడిపోతున్నారు. బోట్లు, వలలు అలల ఉద్ధృతికి ధ్వంసం కావడంతో ఏంచేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. సుమారు 40 పెద్ద బోట్లు, 65 చిన్నబోట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందులో కొన్ని సముద్రం లో కొట్టుకుపోగా మిగిలినవి మరమ్మతులకు గురయ్యాయని బూర్జపాడు సర్పంచ్ జానకిరావు చెప్పారు. కుళ్లిపోయిన పది టన్నుల చేపలు తుపాను రాకముందు నిల్వ ఉంచిన చేపలు మార్కెట్ చేయలేకపోవడంతో కుళ్లిపోయాయి. సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లింది. రొయ్యల చెరువులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పద్మనాభపురం గెడ్డ పొంగడంతో ఇన్నీసుపేట, ధర్మపురం, తులసీగాం, రత్తకన్న, మం డపల్లి, తేలుకుంచి, మశాఖపురం గ్రామాల పరిధిలోని వందలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. అంధకారంలో 219 గ్రామాలు సరఫరా పునరుద్ధరణకు మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో ఇప్పటికీ 219 గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. తొలిరోజున 719 గ్రామాలు అంధకారంలో ఉండగా, మంగళ వారం నాటికి ఈ సంఖ్యను 219కి తగ్గించారు. అన్ని సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా అవుతున్నా గ్రామాలకు వెళ్లే విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సరఫరాకు ఆటంకం కలుగుతోంది. లైన్లు బాగుచేసేందుకు మరో రెండుమూడు రోజులు పట్టే అవకాశం ఉంది. పునరుద్ధరణ పనులతో ఉదయం సరఫరా నిలిపివేస్తుండడంతో మిగిలిన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబు తొలి నుంచి ఇచ్ఛాపురంలో మకాం వేసి ఉండగా, ఎంపీడీసీఎల్ సీఎం కార్తీకేయ మిశ్రా సోమవారం ఇచ్ఛాపురం చేరుకొని పునరుద్ధరణ పనులు పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు, ఇతర జిల్లాలకు చెందిన ఎస్ఈ, డిఈ స్థాయి ఉద్యోగులందరూ పునరుద్ధరణ పనుల పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు. అన్నదాతకు ఆర్థిక కష్టాలు పలాస, న్యూస్‌లైన్: ఉద్దానం ప్రాంత రైతులకు ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నారుు. నేలకూలిన జీడి, కొబ్బరి, మునగ, పనస చెట్లను తొలగించేందుకు నానా యాతనలు పడుతున్నారు. చేతిలో పెట్టుబడి లేక మనోవేదన చెందుతున్నారు. ఉద్దానంలో సుమారు 20వేల హెక్టార్ల జీడి సాగవుతోంది. తుపాను ప్రభావంతో ఎకరాకు రూ. 25వేల చొప్పున నష్టం జరిగి ఉంటుందని అధికారుల ప్రాథమిక అంచనా. దీని ప్రకారం మొత్తం జీడి పంటకు సుమారు రూ.100కోట్లు నష్టం కలిగింది. అలాగే కొబ్బరికి మరో రూ. 25 కోట్లు నష్టం కలిగింది. పనస, మునగ, మామిడి, టేకు, సరుగుడు వనాలు సర్వనాశనమయ్యాయి. ఇంత భారీ నష్టం జరిగినా అధికారులు కనీసం గ్రామాల్లో పర్యటించిన దాఖలా లేవు. గ్రామాల్లో నేలకూలిని పూరిగుడిసెలు, విద్యుత్ స్తంభాలు, చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలు వందల సంఖ్యలో ఉన్నాయి. తుపాను పెనుగాలులకు ప్రాణ నష్టం లేకపోయిన ప్రజల బతుకులు ఛిద్రమయ్యా యి. మత్స్యకారులు వారం రోజుల పాటు జీవనోపాధిని కోల్పోయా రు. వజ్రపుకొత్తూరు మండలంలో 81 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. 4 చెరువులకు గండ్లు పడ్డాయి. 9 రోడ్లు పాడయ్యాయి. 2 పశువులు మృత్యువాతపడ్డాయి. 24 పూరిళ్లు పూర్తిగా పడిపోయా యి. 180 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 25,980 జీడిచెట్లు విరిగి పోయాయి. 3761 కొబ్బరి చెట్లు నేలకొరిగారుు. 2005 ఎకరాల్లో 50 శాతం వరి పంటకు నష్టం జరిగింది. మందస మండలంలో 45 వేలు జీడిచెట్లు, 12 వేల కొబ్బరిచెట్లు, 15 ఎకరాల్లో అరటి చెట్లు ధ్వంసమయ్యాయి. 178 ఇళ్లు పూర్తిగా, 215 పాక్షికంగా దెబ్బతిన్నాయి. 3500 విద్యుత్ స్తంభాలు, 7 ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి. 8 గొర్రెలు, ఒక ఎద్దు, ఒక గేదె మృత్యువాతపడ్డాయి. పలాస మండలంలో 20 వేల జీడిచెట్లు నేలమట్టమయ్యాయి. 2 వేలు కొబ్బరి చెట్లు ధ్వంసమయ్యాయి. పనస, మామిడి, టేకు చెట్లు నేలమట్టమయ్యాయి. ఒక మేక మృతి చెందింది. అలాగే 20 పూరిళ్లు పూర్తిగా, 73 పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఉద్దాన ప్రాంతంలో వేలాది ఎకరాల్లో రైతులకు అపారమైన నష్టం జరిగింది. భయంకరమైన పై-లీన్ ప్రభావం నుంచి ప్రాంత వాసులు ఇంకా బయటపడలేదు. అధికారులు వస్తే తమ బాధలు చెప్పుకోవడానికి ఆశగా ఎదురుచూస్తున్నారు. హెక్టారుకు రూ.50వేలు చెల్లించాలి సోంపేట, న్యూస్‌లైన్: తుపానుతో కొబ్బరి, జీడిమామిడి, వరి తదితర పంటలు నష్టపోయిన కవిటి, సోంపేట మండలాల రైతులకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు చౌదరి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సీపీఎం ప్రతినిధులతో కలిసి సోంపేట, కవిటి మండలాల్లోని పలు గ్రామాల్లో సోమవారం పర్యటించారు. సామూహిక వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. కొబ్బరి ఉపకేంద్రాన్ని కవిటి మండలంలో ఏర్పాటు చేసి శాస్త్రవేత్తల సూచనలతో రైతులను ఆదుకోవాలన్నారు. చిన్నసన్నకారు రైతులకు బ్యాంకులు ఇచ్చిన రుణాలను మాఫీ చేయాలని కోరారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.నారాయణరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహన్‌రావు, ఎ.సత్యనారాయణ, డి.సత్యం తదితరులు ఉన్నారు. తీరని నష్టం సోంపేట, న్యూస్‌లైన్: పై-లీన్ ప్రభావం సోంపేట మండల రైతులను దెబ్బతీసింది. తీరని నష్టం మిగిల్చింది. మండలంలోని పాలవలస గ్రామంలో సాగుచేస్తున్న టేకు తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గ్రామంలోని జి.కె.నాయుడుకు చెందిన సుమారు 5 ఎకరాల్లోని 2000 టేకు చెట్లు నేలకొరిగాయి. 1999లో వచ్చిన తుపాను వల్ల 500 చెట్టు పడిపోయాయని, ఇప్పుడు వచ్చిన తుపానుతో ఉన్న చెట్లు నేలకూలాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశాడు. అలాగే, శాసనాం గ్రామంలోని వి.మాధవరావుకు చెందిన టేకు తోటలో 300 చెట్లు పడిపోయాయి. మండలంలో సాగులో ఉన్న వరి, క్యాబేజీ, బీర, దొండ, వంగ, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుపాను వర్షాలకు కూరగాయల పంటలు యువకపట్టాయి. -
కోలుకుంటున్న ఒడిశా
భువనేశ్వర్/ఛత్రపూర్/న్యూఢిల్లీ: పై-లీన్ తుపాను దెబ్బ నుంచి ఒడిశా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సహాయక చర్యలు, రోడ్ల పునర్నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. తుపాను కారణంగా రాష్ట్రంలోని 16 వేల గ్రామాల్లో 1.2 కోట్ల మంది ప్రభావితమయ్యారు. వరదల్లో కొట్టుకుపోయి 28 మంది చనిపోయారు. తుపానుతో తీవ్రంగా దెబ్బతిన్న బాలసోర్, జాజ్‌పూర్, భద్రక్, మయూర్భంజ్ జిల్లాల్లో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం ఏరియల్ సర్వే చేశారు. గంజాం జిల్లా ఛత్రపూర్‌లోని సహాయ శిబిరాన్ని సందర్శించారు. బాధితులకు ప్రభుత్వం అందిం చే ఇతర సాయంతో నిమిత్తం లేకుండా తక్షణమే ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున అందించాలని ఆదేశించారు. బాల సోర్, జాజ్‌పూర్ జిల్లాల్లో 75 వేల మంది ఇంకా వరద నీటిలోనే ఉన్నారు. కోతకొచ్చిన వరి పంట పూర్తిగా నీటమునగడంతో రైతులు ఘొల్లుమంటున్నారు. రాష్ట్రంలో 6.25 లక్షల హెక్టార్లలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, 3.33 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయని రెవెన్యూ మంత్రి ఎస్ఎన్ పాత్రో తెలిపారు. మొత్తం 9.9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. సువర్ణరేఖ నది ఇంకా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బస్తా, భోగరాయ్, జలేశ్వర్, బలియాపాల్ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడం లేదు. ఆర్మీ, నేవీ, వాయుసేన, జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్డీఆర్ఎఫ్) సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ ఇప్పటిదాకా వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లపై పడిన చెట్లు, రాళ్లు, తదితర అడ్డంకులను తొలగించింది. ఇళ్లు కోల్పోయిన బాధితులకు సాయం అందించి, ఉదారంగా ఆదుకుంటామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ సీఎం నవీన్ పట్నాయక్‌కు లేఖ రాశారు. గంజాంకు పెనునష్టం: మిగతా జిల్లాలతో పోల్చుకుంటే గంజాంలో పై-లీన్ పెను బీభత్సం సృష్టించింది. ఒక్క ఈ జిల్లాల్లోనే రూ.3వేల కోట్ల నష్టం వాటిల్లింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. జనజీవనం ఛిన్నాభిన్నమైం ది. రాష్ట్రం మొత్తమ్మీద 3.33 లక్షల ఇళ్లు దెబ్బతింటే ఒక్క గంజాంలోనే 2.4 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి. మామిడి, కొబ్బరి తోటలు నేలమట్టమయ్యాయి. విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. బ్యాంకులు, ప్రభు త్వ కార్యాలయాలు వరుసగా మూడోరోజు కూడా తెరుచుకోలేదు. కరెంటు స్తంభాలు, సెల్ టవర్లు విరిగిపడిపోవడంతో విద్యుత్, ఇంటర్నెట్, ఫోన్ లైన్లు కట్ అయ్యాయి. ప్రధాన సర్వర్లు కుప్పకూలిపోవడంతో ఏటీఎంలు కూడా పనిచేయడం లేదు. ‘నాలుగు రోజుల నుంచి కరెంటు లేదు. ఇన్వర్టర్లు కూడా పని చేయడం లేదు. జనరేటర్లు నడుపుకుందామంటే డీజిల్ కూడా దొరకడం లేదు’ అని ప్రమోద్ జెనా అనే వ్యక్తి చెప్పారు. జిల్లాలోని ఆరు బ్లాకుల్లో పాక్షికం గా విద్యుత్‌ను పునరుద్ధరించగా, చాలా ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి. జిల్లాలో నష్టపోయినవారిలో మత్స్యకారులే ఎక్కువున్నారు. వీరి కోసం ప్రభుత్యం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ కృష్ణకుమార్ తెలిపారు. తడిసిన 52 వేల టన్నుల ఆహార ధాన్యాలు.. కుంభవృష్టి వర్షాలకు జగన్నాథ్‌పూర్, బరంపురంలోని గోదాముల్లో 52 వేల టన్నుల ఆహార ధాన్యాలు తడిసిపోయాయి. ఇవి ప్రజలకు పంపిణీ చేయడానికి పనికి వస్తాయో రావో తేల్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను పంపింది. గోదాములకు వాటిల్లిన నష్టంపై కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం మృతుల కుటుంబాలకు ప్రధాని మన్మోహన్సింగ్ రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ఇస్తామన్నారు. భారీ ప్రాణనష్టాన్ని నివారించినందుకు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతోపాటు సహాయక చర్యల్లో పాల్గొన్న విభాగాలను అభినందించారు. మృతుల కుటుంబాలకు ఒడిశా సర్కారు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒడిశాకు ఐరాస అభినందన: పై-లీన్ తుపానును ఒడిశా సర్కారు సమర్థంగా ఎదుర్కొందని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. ఒడిశా తీసుకున్న చర్యలు విపత్తు నిర్వహణ చ రిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోతాయని ఐరాస అధినేత ప్రత్యేక ప్రతినిధి మార్గరెటా వాల్మ్ పేర్కొన్నారు. వాల్మ్ స్వయంగా సీఎం నవీన్ పట్నాయక్‌కు ఫోన్ చేసి అభినందించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. -
తుఫాన్ టెన్షన్, అప్రమత్తమైన అధికార యంత్రాంగం
జిల్లాకు ‘ఫైలిన్’ తుఫాన్ హెచ్చరిక రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలియజేయడంతో యంత్రాంగం వీటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమైంది. ప్రకాశం భవనంలోని కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ 08592-281400,ట్రోల్ ఫ్రీనెం. 1044ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 11 తీరప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించేందుకు వీలుగా ప్రత్యేకాధికారులను నియమించారు. బుధవారం రాత్రికే తమకు కేటాయించిన మండలాలకు చేరుకొని పరిస్థితులను అంచనా వేయాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆదేశాలు జారీ చేశారు. రానున్న 48 గంటల్లో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని కోరారు. ఇప్పటికే వేట సాగిస్తున్న మత్స్యకారులు వెంటనే తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్టణంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం 1వ ప్రమాద హెచ్చరిక , కృష్ణాపట్నం నుంచి 2వ ప్రమాద హెచ్చరిక విడుదల చేశాయి. ఉధృతంగా సముద్రం వాయుగుండం తుఫాన్‌గా మారడంతో సముద్రతీరం ఉధృతంగా ఉంది. ప్రస్తుతం గంటకు 40 నుంచి 60 కి.మీ. మేర గాలులు వీస్తున్నాయి. గురువారం ఉదయం నాటికి 100 కి.మీ. మేర గాలులు వీచే అవకాశాలున్నాయి. రాత్రి 8 గంటల నాటికి గాలుల తీవ్రత 150 కి.మీ.కు, శుక్రవారం ఉదయం నాటికి 175 కి.మీ. మేర పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మండలాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. జిల్లాకు ప్రత్యేకాధికారి:తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాకు ప్రత్యేకాధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జిల్లా కలెక్టర్‌గా పని చేసిన కరికాలవళవన్ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించిం ది. స్పెషల్ ఆఫీసర్ గురువారం జిల్లాకు చేరుకోనున్నారు. తుఫాన్ తీవ్రత సద్దుమణిగే వరకు ఆయన ఇక్కడే ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధి కారులను అప్రమత్తం చేయనున్నారు.