జిల్లాకు ‘ఫైలిన్’ తుఫాన్ హెచ్చరిక రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలియజేయడంతో యంత్రాంగం వీటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమైంది. ప్రకాశం భవనంలోని కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ 08592-281400,ట్రోల్ ఫ్రీనెం. 1044ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 11 తీరప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించేందుకు వీలుగా ప్రత్యేకాధికారులను నియమించారు. బుధవారం రాత్రికే తమకు కేటాయించిన మండలాలకు చేరుకొని పరిస్థితులను అంచనా వేయాలని కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ ఆదేశాలు జారీ చేశారు. రానున్న 48 గంటల్లో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని కోరారు. ఇప్పటికే వేట సాగిస్తున్న మత్స్యకారులు వెంటనే తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్టణంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం 1వ ప్రమాద హెచ్చరిక , కృష్ణాపట్నం నుంచి 2వ ప్రమాద హెచ్చరిక విడుదల చేశాయి.
ఉధృతంగా సముద్రం
వాయుగుండం తుఫాన్‌గా మారడంతో సముద్రతీరం ఉధృతంగా ఉంది. ప్రస్తుతం గంటకు 40 నుంచి 60 కి.మీ. మేర గాలులు వీస్తున్నాయి. గురువారం ఉదయం నాటికి 100 కి.మీ. మేర గాలులు వీచే అవకాశాలున్నాయి. రాత్రి 8 గంటల నాటికి గాలుల తీవ్రత 150 కి.మీ.కు, శుక్రవారం ఉదయం నాటికి 175 కి.మీ. మేర పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మండలాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
జిల్లాకు ప్రత్యేకాధికారి:తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాకు ప్రత్యేకాధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జిల్లా కలెక్టర్‌గా పని చేసిన కరికాలవళవన్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించిం ది. స్పెషల్ ఆఫీసర్ గురువారం జిల్లాకు చేరుకోనున్నారు. తుఫాన్ తీవ్రత సద్దుమణిగే వరకు ఆయన ఇక్కడే ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధి కారులను అప్రమత్తం చేయనున్నారు.
తుఫాన్ టెన్షన్, అప్రమత్తమైన అధికార యంత్రాంగం
Published Thu, Oct 10 2013 7:37 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
Advertisement
Advertisement