కోలుకుంటున్న ఒడిశా | Cyclone Phailin: Recovery challenge looms in Odisha | Sakshi
Sakshi News home page

కోలుకుంటున్న ఒడిశా

Published Wed, Oct 16 2013 4:43 AM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM

కోలుకుంటున్న ఒడిశా

కోలుకుంటున్న ఒడిశా

భువనేశ్వర్/ఛత్రపూర్/న్యూఢిల్లీ: పై-లీన్ తుపాను దెబ్బ నుంచి ఒడిశా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సహాయక చర్యలు, రోడ్ల పునర్నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. తుపాను కారణంగా రాష్ట్రంలోని 16 వేల గ్రామాల్లో 1.2 కోట్ల మంది ప్రభావితమయ్యారు. వరదల్లో కొట్టుకుపోయి 28 మంది చనిపోయారు.  తుపానుతో తీవ్రంగా దెబ్బతిన్న బాలసోర్, జాజ్‌పూర్, భద్రక్, మయూర్‌భంజ్ జిల్లాల్లో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం ఏరియల్ సర్వే చేశారు. గంజాం జిల్లా ఛత్రపూర్‌లోని సహాయ శిబిరాన్ని సందర్శించారు. బాధితులకు ప్రభుత్వం అందిం చే ఇతర సాయంతో నిమిత్తం లేకుండా తక్షణమే ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున అందించాలని ఆదేశించారు. బాల సోర్, జాజ్‌పూర్ జిల్లాల్లో 75 వేల మంది ఇంకా వరద నీటిలోనే ఉన్నారు. కోతకొచ్చిన వరి పంట పూర్తిగా నీటమునగడంతో రైతులు ఘొల్లుమంటున్నారు.
 
 రాష్ట్రంలో 6.25 లక్షల హెక్టార్లలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, 3.33 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయని రెవెన్యూ మంత్రి ఎస్‌ఎన్ పాత్రో తెలిపారు. మొత్తం 9.9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. సువర్ణరేఖ నది ఇంకా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బస్తా, భోగరాయ్, జలేశ్వర్, బలియాపాల్ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడం లేదు. ఆర్మీ, నేవీ, వాయుసేన, జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్ ఇప్పటిదాకా వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లపై పడిన చెట్లు, రాళ్లు, తదితర అడ్డంకులను తొలగించింది. ఇళ్లు కోల్పోయిన బాధితులకు సాయం అందించి, ఉదారంగా ఆదుకుంటామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ సీఎం నవీన్ పట్నాయక్‌కు లేఖ రాశారు.
 
 గంజాంకు పెనునష్టం: మిగతా జిల్లాలతో పోల్చుకుంటే గంజాంలో పై-లీన్ పెను బీభత్సం సృష్టించింది. ఒక్క ఈ జిల్లాల్లోనే రూ.3వేల కోట్ల నష్టం వాటిల్లింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. జనజీవనం ఛిన్నాభిన్నమైం ది. రాష్ట్రం మొత్తమ్మీద 3.33 లక్షల ఇళ్లు దెబ్బతింటే ఒక్క గంజాంలోనే 2.4 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి. మామిడి, కొబ్బరి తోటలు నేలమట్టమయ్యాయి. విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. బ్యాంకులు, ప్రభు త్వ కార్యాలయాలు వరుసగా మూడోరోజు కూడా తెరుచుకోలేదు. కరెంటు స్తంభాలు, సెల్ టవర్లు విరిగిపడిపోవడంతో విద్యుత్, ఇంటర్నెట్, ఫోన్ లైన్లు కట్ అయ్యాయి. ప్రధాన సర్వర్లు కుప్పకూలిపోవడంతో ఏటీఎంలు కూడా పనిచేయడం లేదు. ‘నాలుగు రోజుల నుంచి కరెంటు లేదు. ఇన్వర్టర్లు కూడా పని చేయడం లేదు. జనరేటర్లు నడుపుకుందామంటే డీజిల్ కూడా దొరకడం లేదు’ అని ప్రమోద్ జెనా అనే వ్యక్తి చెప్పారు. జిల్లాలోని ఆరు బ్లాకుల్లో పాక్షికం గా విద్యుత్‌ను పునరుద్ధరించగా, చాలా ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి. జిల్లాలో నష్టపోయినవారిలో మత్స్యకారులే ఎక్కువున్నారు. వీరి కోసం ప్రభుత్యం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ కృష్ణకుమార్ తెలిపారు.
 
 తడిసిన 52 వేల టన్నుల ఆహార ధాన్యాలు..
 కుంభవృష్టి వర్షాలకు జగన్నాథ్‌పూర్, బరంపురంలోని గోదాముల్లో 52 వేల టన్నుల ఆహార ధాన్యాలు తడిసిపోయాయి. ఇవి ప్రజలకు పంపిణీ చేయడానికి పనికి వస్తాయో రావో తేల్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను పంపింది. గోదాములకు వాటిల్లిన నష్టంపై కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు.
 
 మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
 మృతుల కుటుంబాలకు ప్రధాని మన్మోహన్‌సింగ్ రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ఇస్తామన్నారు. భారీ ప్రాణనష్టాన్ని నివారించినందుకు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతోపాటు సహాయక చర్యల్లో పాల్గొన్న విభాగాలను అభినందించారు. మృతుల కుటుంబాలకు ఒడిశా సర్కారు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
 
 ఒడిశాకు ఐరాస అభినందన: పై-లీన్ తుపానును ఒడిశా సర్కారు సమర్థంగా ఎదుర్కొందని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. ఒడిశా తీసుకున్న చర్యలు విపత్తు నిర్వహణ చ రిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోతాయని ఐరాస అధినేత ప్రత్యేక ప్రతినిధి మార్గరెటా వాల్మ్ పేర్కొన్నారు. వాల్మ్ స్వయంగా సీఎం నవీన్ పట్నాయక్‌కు ఫోన్ చేసి అభినందించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement