సమైక్య ఆందోళనలతో.. ప్రభుత్వాఫీసుల మూత
సీమాంధ్ర వ్యాప్తంగా మిన్నంటిన సమైక్య ఆందోళనలు
సాక్షి నెట్‌వర్క్ : కేంద్రం టీ-నోట్‌ను ఆమోదించిన దరిమిలా ఉద్ధృతమైన సమైక్య ఉద్యమం తారస్థాయికి చేరింది. సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక, ఏపీఎన్జీవోల పిలుపు మేరకు మంగళవారం సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పోస్టాఫీసులు, బ్యాంకులను సమైక్యవాదులు, ఆందోళనకారులు మూయించారు. వైద్య ఆరోగ్య శాఖ జేఏసీ పిలుపు మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా అన్ని సేవలనూ నిలిపివేశారు. ఇక సోమవారం కూడా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలతో కోస్తా, రాయలసీమ జిల్లాలు హోరెత్తాయి.
పోలవరం పనులు అడ్డగింత
రాష్ర్టం ముక్కలైతే పోలవరం ప్రాజెక్టుతో ఇక పనేమిటంటూ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులను అడ్డగించారు. సోనియూగాంధీ, దిగ్విజయ్‌సింగ్ సహా విభజనవాదులందిరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ఏలూరులో జపం చేశారు. విశాఖలో దీక్షలు కొనసాగుతున్నాయి. అనకాపల్లిలో ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన వ్యక్తంచేశారు. నర్సీపట్నంలో గాజువాక ఎంఎల్‌ఎ చింతలపూడి వెంకట్రామయ్య ఇంటిని ముట్టడించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం, వేమగిరిల్లో 250 లారీలతో భారీ ర్యాలీ చేపట్టారు. సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్) ముట్టడి రెండోరోజు కూడా కొనసాగుతోంది. అమలాపురం ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ముమ్మిడివరం, మామిడికుదురులలో ఆందోళనలు జరిగాయి.
రాష్ట్రంలో రైల్వేను స్తంభింపజేస్తాం
అనంతపురం జిల్లా గుంతకల్లులో రైల్వే ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. విభజన ఆపకపోతే రాష్ట్రంలో రైల్వే వ్యవస్థను స్తంభింపజేస్తామని గుంతకల్లు డివిజన్ రైల్వే జేఏసీ నేతలు హెచ్చరించారు. మడకశిరలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఇంటిని ముట్టడించారు. కర్నూలులో కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ వైద్యులు యూపీఏ ప్రభుత్వాన్ని సమాధి చేసినట్లు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పీలేరులో సీమాంధ్ర మంత్రులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో సమైక్యవాదులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ముగ్గురు వైద్య ఉద్యోగులు ఆమరణ దీక్ష చేపట్టారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం ఈ నెల 11వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు విద్యాసంస్థల యాజ మాన్య కమిటీ ప్రకటించింది.
కోఠి ఎస్‌బీఐని ముట్టడించిన ఏపీఎన్జీవోలు
హైదరాబాద్: ఏపీఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపుపై మంగళవారం కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ప్రధాన కార్యాలయాన్ని ఏపిఎన్జీవోలు ముట్టడించారు. తమ కార్యాలయం నుండి ర్యాలీగా వచ్చిఎస్‌బీఐ ప్రధాన గేట్ వద్దకు నినాదాలు చేస్తూ దూసుకొచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఏపీఎన్జీవోల సంఘం నగర అధ్యక్షుడు పివీవీ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ తమ దీక్షా శిబిరాన్ని త్వరలో ఢిల్లీకి మార్చుతామన్నారు.
విద్యుత్ సబ్‌స్టేషన్ల దిగ్బంధం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావ్యాప్తంగా విద్యుత్ సబ్‌స్టేషన్ల ఎదుట సమైక్యవాదులు ఆందోళనలు చేపట్టారు. ఒంగోలులో ఉద్యోగులు ఎంపీ మాగుంట ఇంటిని ముట్టడించారు. మార్కాపురంలో చంద్రబాబు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లా ఆర్టీపీపీలో ఉద్యోగుల విధుల బహిష్కరతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. పులివెందులలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. తుమ్మలపల్లి యురేనియం ప్రాజెక్టుకు విద్యుత్ నిలిపేశారు.
సమైక్యాంధ్ర కోసం బలిదానం
హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోసం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పుంటించుకున్న వ్యక్తి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి 11.45 మృతి చెందాడు. అనంతపురం జిల్లా చెన్నంపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ మల్లికార్జున్‌నాయక్(35) ఈ నెల 6న కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మరోవైపు, విభజన కలతతో సీమాంధ్రలో నలుగురు గుండె పోటుతో మృతిచెందారు.
లగడపాటిపై ఫిర్యాదు
ఎంపీ లగడపాటి రాజగోపాల్ కనబడటం లేదంటూ విద్యార్థి, పొలిటికల్ జేఏసీల నాయకులు విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరులో జరిగిన సమైక్య శంఖారావం కార్యక్రమానికి వేలాదిగా విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే, ఎమ్మెల్యే మల్లాది విష్ణును న్యాయవాదులు అడ్డుకున్నారు. పదవికి రాజీ నామా చేయాలంటూ బార్ అసోసియేషన్ నేతలు నిలదీయగా, అంతుచూస్తానంటూ విష్ణు బెదిరించడంతో న్యాయవాదులు తిరగబడ్డారు.