జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి గుంతకల్లు ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్ గుప్తా చేసిన రాజీనామాను పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ శుక్రవారం ఆమోదించారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ నోట్‌ను కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన తర్వాత గత ఏడాది అక్టోబర్ 8న డీసీసీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. ఇన్నాళ్లూ దాన్ని ఆమోదించని బొత్స.. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కావడంతో ఆమోదముద్ర వేశారు. ఈ క్రమంలో కొత్త డీసీసీ అధ్యక్షుడిని ఎన్నిక చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది.
జిల్లాలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించగా.. మాజీ సీఎం కిరణ్ పార్టీ పెడితే అందులో మరో మాజీ మంత్రి శైలజానాథ్ చేరుతారన్న అభిప్రాయం ఉంది. కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ అయిన జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డిలు ఆ పార్టీని వీడే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త డీసీసీ అధ్యక్షని ఎంపిక విషయంలో రఘువీరారెడ్డి మాటే చెల్లుబాటవుతుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్సీలు పాటిల్, వై.శివరామిరెడ్డి పేర్లను డీసీసీ అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తున్నారు. కానీ.. ఎన్నికల్లో పోటీచేసే నేతకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకూడదని ఆ పార్టీ యువనేత రాహుల్‌గాంధీ నిబంధన పెట్టారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తోన్న ముగ్గురు నేతలు కూడా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. గుండుమల తిప్పేస్వామి హిందూపురం లోక్‌సభ స్థానాన్ని ఆశిస్తుండగా.. పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి రాయదుర్గం, వై.శివరామిరెడ్డి ఉరవకొండ శాసనసభ స్థానాల నుంచి పోటీచేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాయదుర్గం నుంచి పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి కుటుంబంలో ఒకరి టికెట్ ఇచ్చి.. ఆయనను డీసీసీ అధ్యక్షునిగా నియమించాలని రఘువీరా ప్రతిపాదిస్తున్నట్లు ఆపార్టీ వర్గాలు వెల్లడించాయి.
మునిగిన నావకు కొత్త సారథెవరో?
Published Sat, Feb 22 2014 3:28 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement