ఎగసిన సమైక్య పోరు
సాక్షి నెట్‌వర్క్: సమైక్య ఉద్యమం మరోమారు ఉవ్వెత్తున ఎగిసింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకిస్తూ ఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో సాగుతున్న సమ్మె శుక్రవారం రెండోరోజుకు చేరింది. ఈ సమ్మె ప్రభావంతో సీమాంధ్ర జిల్లాల్లో పాలన స్తంభించింది. పలు ప్రాంతాల్లో ఎన్‌జీఓలు, సమైక్యవాదుల ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ర్యాలీలు, మానవహారాలు, విగ్రహాలకు క్షీరాభిషేకాలు, దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని కోఠి డీఎంహెచ్‌ఎస్, అబిడ్స్ తిలక్‌రోడ్డులోని బీమా భవన్‌లో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పెన్‌డౌన్ కార్యక్రమం చేపట్టింది. విద్యుత్‌సౌధ ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సహా అన్ని పట్టణాల్లోను ఎన్జీవోలు ర్యాలీలు, రాస్తారోకోలు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో భరతమాత వేషధారణలో జెడ్పీ సిబ్బంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే దిష్టిబొమ్మకు ఉరి వేశారు. విశాఖ కలెక్టరేట్ వద్ద కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ చేపట్టారు. విజయనగరంలోని బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టల్ కార్యాలయాలను ముట్టడించారు.
నెల్లూరులో వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కిరణ్, చంద్రబాబు ఫ్లెక్సీలను దహనం చేశారు. కృష్ణా జిల్లా కైకలూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. విజయవాడలో మున్సిపల్ ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించగా న్యాయవాదులు రిక్షాలు తొక్కి నిరసన తెలిపారు. గుంటూరులో మానవహారం నిర్వహించారు. ఒంగోలులో న్యాయవాదులు వంటావార్పు చేపట్టారు. అనంతపురం జిల్లా శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో జేఏసీ నాయకులు రోడ్డుపై బైఠాయించారు.వైఎస్సార్ జిల్లా రాయచోటిలో సమాచార హక్కు చట్టం రాష్ట్ర కన్వీనర్ ఇంతియాజ్ అహ్మద్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు.