రోజురోజుకూ రగులుతున్న నిరసనాంధ్ర | united movement intensifying day by day | Sakshi
Sakshi News home page

రోజురోజుకూ రగులుతున్న నిరసనాంధ్ర

Published Fri, Aug 30 2013 4:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM

రోజురోజుకూ రగులుతున్న నిరసనాంధ్ర

రోజురోజుకూ రగులుతున్న నిరసనాంధ్ర

సాక్షి నెట్‌వర్క్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి వేర్పాటు ప్రకటన వచ్చిన దరిమిలా సరిగ్గా నెలరోజుల కిందట ఎగసిన సమైక్య ఉద్యమం రోజురోజుకూ బలపడుతూ తీవ్రరూపం దాలుస్తోంది. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ సీమాంధ్ర జిల్లాల్లో ప్రతినిత్యం ఆందోళనలు మిన్నంటుతున్నాయి. తెలుగు భాషా, క్రీడా దినోత్సవమైన గురువారంనాడు కూడా రోజూమాదిరిగానే ధర్నాలు, రాస్తారోకోలు, వినూత్న ఆందోళనలతో కోస్తా, రాయలసీమ జిల్లాలు దద్దరిల్లాయి. అనంతపురం జిల్లా కదిరిలో జేఏసీ చేపట్టిన ‘ఖాద్రీ లక్ష జన గర్జన’ విజయంతమైంది. జై సమైక్యాంధ్ర అంటూ లక్ష గొంతులు నినదించాయి. ఎస్కేయూలో జేఏసీ నాయకులు, విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. గుంతకల్లులో వైఎస్సార్‌సీపీ యూత్ విభాగం ఆధ్వర్యంలో మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో మునిసిపల్ కమిషనర్, గుంటూరు జిల్లా తెనాలి గాంధీచౌక్ సెంటర్‌లో మునిసిపల్ ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. గుంటూరులో భారీ మానవహారంగా ఉద్యమకారులు ఏర్పడ్డారు.
 
 రాజకీయ జేఏసీ నేతృత్వంలో ప్రైవేటు ఉపాధ్యాయుల రిలేదీక్షల శిబిరాన్ని వైఎస్‌ఆర్ సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆర్టీసీ కార్మికులు శరీరానికి చెట్ల కొమ్మలు చుట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు భారీ ప్రదర్శన చేపట్టారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో ఐదుగురు విద్యుత్ కార్మికుల అరెస్టును నిరసిస్తూ రెండు వేల మందికి పైగా ఆర్టీపీపీ కార్మికులు, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, లింగారెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి నేతృత్వంలో పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. దీంతో చేసేదేమి లేక పోలీసులు వారిని విడుదల చేశారు. రైల్వేకోడూరులో అర్ధ లక్ష గళ గర్జన పేరుతో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖలో వ్యవసాయశాఖ అనుబంధశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో గడ్డి తినే కార్యక్రమం జరిగింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి  మూడురోడ్ల జంక్షన్‌లో ఉపాధ్యాయులు మోకాళ్లతో నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు.
 
  తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం బెండమూరులంకలో రైతులు రోడ్డుపై పశువులను ఉంచి దిగ్బంధం చేశారు. స్పోర్ట్స్ డే సందర్భంగా కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్‌లో పీఈటీలు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. కాకినాడలో ఉపాధ్యాయులు భారీ బైక్ ర్యాలీ చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వికలాంగులు ర్యాలీ చేపట్టి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. స్పోర్ట్స్ డేను పురస్కరించుకుని గురువారం చిత్తూరులో ఎమ్మెల్యే సీకేబాబు, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఏఎస్.మనోహర్‌తోపాటు పలువురు జేఏసీ నేతలు రోడ్డుపైనే క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్ ఆడారు.  శ్రీకాకుళంలో 500 మంది డ్వాక్రా సంఘాల మహిళలు నిండు బిందెలతో ర్యాలీగా వెళ్లి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పంచామృతాభిషేకం చేశారు. నరసన్నపేటలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో 10 వేల మంది విద్యార్థులతో గళార్చన కార్యక్రమం జరిగింది. కృష్ణాజిల్లా బెజవాడ దుర్గమ్మ గుడి అర్చకులు, వేద పండితులు ప్రవచనాలు చెప్పి నిరసన తెలిపారు. గుడివాడలో మున్సిపల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 4 వేల మంది డ్వాక్రా మహిళలతో ర్యాలీ జరిపారు.
 
 తెలంగాణ-రాయలసీమ రహదారి దిగ్బంధం
 తెలంగాణ-రాయలసీమ సరిహద్దు గ్రామమైన శ్రీశైలం వద్ద సమైక్యవాదులు రహదారిని దిగ్బంధించారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీ, విద్యార్థి జేఏసీ, శ్రీశైలం మండల జర్నలిస్ట్‌ల ఆసోసియేషన్‌ల ఆధ్వర్యంలో వాహనాలను అడ్డుకున్నారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  కేసీఆర్, సోనియా గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, న్యాయశాఖ మంత్రి ఏరాసుప్రతాపరెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేసి కృష్ణానదిలో నిమజ్జనం చేశారు.
 
 ‘మెగా’ సినిమాలను అడ్డుకుంటాం: సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ
 సమైక్యాంధ్రకు కట్టుబడి కేంద్రమంత్రి చిరంజీవి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని లేదంటే ఆయన కుటుంబ సభ్యుల సినిమాల విడుదలను అడ్డుకుంటామని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు డి.అంజయ్య బుధవారం నెల్లూరులో హెచ్చరించారు.  
 
 తిరుపతి, చిత్తూరు దిగ్బంధం.. విజయవంతం
 సమైక్యాంధ్ర జేఏసీల ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపు మేరకు తిరుపతి, చిత్తూరు నగరాల్లో 48 గంటల పాటు చేపట్టిన దిగ్బంధనం విజయవంతంమైంది. బుధ, గురువారాలు రెండు రోజులు సమైక్యవాదులు ద్విచక్ర వాహనాలను మినహా ఏ వాహనాన్నీ తిరగనివ్వలేదు. ఫలితంగా తిరుపతి, చిత్తూరు శివారు ప్రాంతంలో తమిళనాడు, కర్ణాటక వైపు వెళ్లివచ్చే వాహనాలు  కిలోమీటర్ల మేర రోడ్లపై నిలిచిపోయాయి. మందుల షాపులు మినహా ఆసుపత్రులు, సినిమాహాళ్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు తాళాలు వేశారు. కూరగాయల మార్కెట్లు కూడా మూసివేశారు.
 
 అరెస్టు  చేస్తే కరెంట్ కట్ చేస్తాం: విద్యుత్ జేఏసీ
 సమైక్యాంధ్ర కోసం పోరాటం చేసే విద్యుత్ ఉద్యోగులను, జేఏసీ నేతలను అరెస్టుచేస్తే ఆయా పోలీసుస్టేషన్లు, ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాలకు కరెంట్ తీసేస్తామని విద్యుత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కోలాకి శ్రీనివాసరావు గురువారం విశాఖలో హెచ్చరించారు. వైఎస్సార్ జిల్లా కడపలోని రాయలసీమ థర్మల్ పవర్‌స్టేషన్‌కి చెందిన పది మంది కాంట్రాక్టు ఉద్యోగులను పోలీసులు గురువారం అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
 
 5 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి ఇంటర్ అధ్యాపకులు
 రానున్న సెప్టెంబర్ 5వ తేదీ గురుపూజోత్సవం అర్ధరాత్రి నుంచి ఇంటర్‌అధ్యాపకులంతా సమ్మెలోకి వెళ్లనున్నుట్టు ఇంటర్మీడియేట్ అధ్యాపక జేఏసీ కన్వీనర్ వి.రవి ప్రకటించారు. విజయవాడలో గురువారం అధ్యాపక జేఏసీ 13 జిల్లాల నాయకుల సమీక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోస్తా, సీమ జిల్లాల్లోని 665 కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, సిబ్బంది సమ్మెలో పాల్గొంటూ నిరవధిక నిరాహారదీక్షలకు దిగనున్నట్టు చెప్పారు. ప్రైవేటు కళాశాలల అధ్యాపక సిబ్బంది కూడా తమతో కలిసివచ్చేందుకు చర్చలు జరుపుతున్నామన్నారు.
 
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం బాగుండాలని ఖమ్మం జిల్లా  భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోకాళ్లపై మెట్లెక్కి ఆలయంలో పూజలు చేశారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ తెల్లం వెంకట్రావు, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర నేత కడియం రామాచారి పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement