హోరెత్తిన నిరసనలు
సాక్షి నెట్‌వర్క్: జై సమైక్యాంధ్ర.. జై తెలంగాణ..నినాదాలతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పోటాపోటీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం రాజధానిలోని విద్యుత్‌సౌధ, ఇతర ప్రధాన ప్రభుత్వ విభాగాలు నిరసన కార్యక్రమాలతో హోరెత్తాయి. వివరాలు..సమైక్యాంధ్రను కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు, ప్రత్యేక తెలంగాణను వెంటనే ప్రకటించాల తెలంగాణ ఉద్యోగుల ధర్నాలు, నినాదాలతో విద్యుత్‌సౌధ దద్దరిల్లింది. సీమాంధ్ర ఉద్యోగులు- ‘కుర్చీని కాపాడుకోవడం ఎలా?’ అనే నాటికను ప్రదర్శించారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య తలెత్తుతుందని సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీవిద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
శాంతిభద్రతల్ని సాకుగా చూపుతూ సీఎం మాట్లాడడం సరికాదని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు రఘు పేర్కొన్నారు. కాగా, సమైక్యాంధ్రకు మద్దతుగా కోఠి డీఎంహెచ్‌ఎస్‌లో ఏపీఎన్జీవోలు విధులు బహిష్కరించి డీఎంహెచ్‌ఎస్ క్యాంపస్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైద్య విధాన పరిషత్, ఏపీసాక్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం, డీఎంఈ, డీహెచ్ తదితర కార్యాలయాల ఉద్యోగులు ర్యాలీలో సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అబిడ్స్ తిలక్‌రోడ్డులోని బీమాభవన్‌లో, బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ కార్యాలయంలోనూ ఏపీఎన్జీవోల ప్రదర్శనలు కొనసాగాయి.