ప్రజల మదిలో వైఎస్ చిరస్మరణీయుడు
ఖమ్మం, న్యూస్‌లైన్: తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇరు ప్రాంతాల ప్రజల మనసుల్లో చిరస్మరణీయుడిగా నిలిచారని వైఎస్సార్ కాంగ్రెస్ బీసీ విభాగం రాష్ట్ర కన్వీనర్ గట్టు రామచంద్రరావు అన్నారు. ఖమ్మం జిల్లాలో వైఎస్సార్సీపీ మద్దతుతో గెలిచి పంచాయతీల్లో నూతనంగా పదవీబాధ్యతలు చేపట్టిన 206 మంది సర్పంచుల అభినందన సభ మంగళవారం ఖమ్మంలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నట్లు తెలిపారు.
గత ఉప ఎన్నికల్లో ఈ ప్రాంతంలో పార్టీ అభ్యర్థులను బరిలో దింపకుండా తెలంగాణ వాదానికి మద్దతు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ఏడాది క్రితమే తన నిర్ణయం ప్రకటించి ఉంటే వెయ్యిమందికి పైగా తెలంగాణ బిడ్డలు చనిపోయే వారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ లబ్దికోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న ఆటలను బట్టబయలు చేసేలా షర్మిల మాట్లాడిన మాటలను వక్రీకరించి రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడిన వైఎస్, ఆయన కుటుంబ సభ్యులపైనా ఇక్కడివారికి ఎంతో గౌరవముందన్నారు. కష్టపడే వారికి వైఎస్సార్‌సీపీ ప్రాధాన్యమిస్తుందని అన్నారు. కోవర్టు రాజకీయాలు చేసేవారిని సహించదని, ఇటువంటి రాజకీయాలు చేసేవారే పార్టీ నుంచి వెళ్తున్నారని, వారి వల్ల పార్టీకి జరిగే నష్టమేమీ ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన తమ పార్టీ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందుతోందని, యువనేత జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ నాయకుడిగా ఎదుగుతారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలోని పార్టీకి వైఎస్‌ఆర్ కుటుంబ సభ్యులే అధ్యక్షులుగా ఉంటారన్నారు.
పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ జిల్లాలోనే అత్యధిక స్థానాలు గెలుచుకొని ఖమ్మం జిల్లాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఖిల్లాగా మార్చారన్నారు. నిజాలను నిలదీసే సత్తా, దమ్ము, ధైర్యం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్‌మోహన్‌రెడ్డికే ఉన్నాయని ప్రకటించారు. సమావేశంలో పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావు, ఖమ్మం పార్లమెంటరీ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, సీఈసీ సభ్యుడు మదన్‌లాల్, సీజీసీ సభ్యుడు చందా లింగయ్యదొర తదితరులు పాల్గొన్నారు.