రెండో రోజూ భగ్గున మండిన సీమాంధ్ర | samaikya bandh continues on second day in seemandhra districts | Sakshi
Sakshi News home page

రెండో రోజూ భగ్గున మండిన సీమాంధ్ర

Published Sat, Dec 7 2013 8:08 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

రెండో రోజూ భగ్గున మండిన సీమాంధ్ర - Sakshi

రెండో రోజూ భగ్గున మండిన సీమాంధ్ర

స్వరాలు పదునెక్కుతున్నాయి. గళాలు గర్జిస్తున్నాయి. ఉద్యమాంధ్రగా మారిన సీమాంధ్ర భగ్గున మండుతోంది. మొసలి కన్నీరు కారుస్తున్న మాటల మరాఠీల రాజకీయ జీవితాలకు చరమగీతం పాడుతామంటోంది. ఇప్పుడు 13 జిల్లాల్లో ఒకటే మాట... సమైక్యం... సమైక్యం... సమైక్యం...  ఒకటే బాట.... ఉద్యమం... ఉద్యమం... ఉద్యమం.. రాష్ట్రాన్ని ఒక్కటిగా కలిపి ఉంచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపుతో మమేకమవుతున్న ప్రజలు... వరుసగా రెండో రోజూ తమ తడాఖా చూపిస్తున్నారు. పల్లె, పట్నం, చిన్నా, పెద్దా ... బంద్‌లు, హర్తాళ్లు, నిరసనలతో తమ ఆకాంక్షను బలంగా చాటుతున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. కేబినెట్‌ నిర్ణయాన్ని నిరసిస్తూ పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. వర్తక, వాణజ్యసంస్థలు బంద్‌ పాటించాయి. సమైక్యవాదులు, విద్యార్థులు రోడ్డెక్కారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

వైఎస్‌ఆర్‌ జిల్లాలో కేంద్ర కేబినెట్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా సమైక్యవాదులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.  మైదుకూరులో బైకు ర్యాలీ నిర్వహించారు. దుకాణాలు మూయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వైఎస్ఆర్‌సీపీ నాయకుడు రఘురామిరెడ్డి బంద్‌ను పర్యవేక్షించారు.  

కర్నూలు జిల్లాలో బంద్‌ సంపూర్ణంగా కొనసాగింది. రాజ్‌విహార్‌ సెంటర్‌లో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.  కొడుమూరు, గుడూరు, సి.బెళగల్‌ మండలాల్లో దుకాణాలు, పాఠశాలలు, సినిమాహాళ్లు, బ్యాంకులు మూసివేశారు. ఆదోనిలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. నంద్యాల్లో తహశీల్దార్‌ కార్యాలయాన్ని ఏపీఎన్జీవోలు ముట్టడించారు.

అనంతపురం జిల్లా ఆందోళనలు మిన్నంటాయి. విద్యార్థులు, వికలాంగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సప్తగిరి సర్కిల్‌లో మానవహారం నిర్మించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. విధులను బహిష్కరించిన న్యాయవాదులు రోడ్లపైకి వచ్చి టైర్లను తగులబెట్టారు. ఉరవకొండలో ఉద్యోగ, విద్యార్థి జేఏసీల ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు.   గుంటూరు జిల్లాలో సమైక్య నిరసనలు వెల్లువెత్తాయి. మంగళగిరిలో నాన్‌పొలిటికల్‌ జేఏసీ, వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు.


ప్రకాశం జిల్లాలో సమైక్య సెగలు వెల్లువెత్తాయి. చీరాలలో ఆర్టీసీ బస్సులను అడ్డుకుని బస్టాండ్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. రోడ్డుపై పడుకుని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. బంద్‌తో పలు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి.

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో కనుమూరి బాపిరాజు నివాసానికి రక్షణ కల్పించేందుకు వెళ్తున్న పారామిలటరీ బలగాలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. తెలుగుజాతిని తాకట్టు పెట్టిన బాపిరాజు డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. పేరుపాలెం బీచ్‌లో స్వర్ణాంధ్ర కాలేజీకి చెందిన విద్యార్థులు సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో వచ్చే నీటి సమస్యను వివరించేందుకే సైకత శిల్పాన్ని చిత్రీకరించినట్లు విద్యార్థులు తెలిపారు.

విజయనగరంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. కలెక్టరేట్‌లో విధులు బహిష్కరించారు. సెక్షన్ 30ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ జంక్షన్‌ వద్ద మానవహారం నిర్మించిన ఉద్యోగులు వాహనాలు రాకపోకలను అడ్డుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. వ్యాపారులు దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు.

కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌ ఆధ్వర్యంలో విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నందిగామ-కంచికచర్ల సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది. పట్టణంలో బంద్‌ నిర్వహించారు.

చిత్తూరు జిల్లా పుత్తూరులో వ్యాపారులు దుకాణాలు మూసివేసి బంద్‌ పాటించారు. మదర్‌ థెరిసా యువజన విభాగం ఆధ్వర్యంలో బంద్‌ను పర్యవేక్షించారు. మరోవైపు తిరుపతికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. నెల రోజుల పాటు తిరుపతిలోనే బలగాలు భద్రతను పర్యవేక్షించనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement