Samaikya bandh
-
సమైక్య బంద్‌ను విజయవంతం చేయండి
సాక్షి, నెల్లూరు : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ రాష్ర్ట పార్టీ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించనున్న జిల్లా సమైక్యబంద్ను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ పది నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిర్వహించనున్న బంద్‌లో పార్టీ శ్రేణులు భారీగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కంకణం కట్టుకున్నాయని విమర్శించారు. విభజన జరిగితే సీమాంధ్ర తీవ్రంగా నష్టపోతుందన్నారు. ముఖ్యంగా రాయలసీమతోపాటు నెల్లూరు జిల్లా తీవ్రంగా నష్టపోతుందని మేరిగ ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్ర బిడ్డగా విభజనను అడ్డుకోవాల్సిన చంద్రబాబు విభజనకు మద్దతు పలికి సీమాంధ్రులకు తీరని ద్రోహం తలపెట్టారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు శాయశక్తులా కృషి చేస్తోందని మేరిగ చెప్పారు. పార్టీ అధినేతలు విజయమ్మ, జగన్ ఆమరణ నిరాహార దీక్షలు సైతం చేపట్టారన్నారు. విభజన ఆగేవరకూ పార్టీ పోరాటం సాగిస్తుందన్నారు. శుక్రవారం బంద్‌ను విజయవంతం చేయడమేకాక ఈ నెల 6న జరగనున్న మానవహారాలు, 7 నుంచి 10 వరకూ నిర్వహించ నున్న రిలేదీక్షలను కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర సాధన కోసం జరగనున్న ఈ పోరాటాల్లో సమైక్యవాదులందరూ పాల్గొనాలని మేరిగ మురళీధర్ పిలుపు నిచ్చారు. -
రెండో రోజూ భగ్గున మండిన సీమాంధ్ర
-
రెండో రోజూ భగ్గున మండిన సీమాంధ్ర
స్వరాలు పదునెక్కుతున్నాయి. గళాలు గర్జిస్తున్నాయి. ఉద్యమాంధ్రగా మారిన సీమాంధ్ర భగ్గున మండుతోంది. మొసలి కన్నీరు కారుస్తున్న మాటల మరాఠీల రాజకీయ జీవితాలకు చరమగీతం పాడుతామంటోంది. ఇప్పుడు 13 జిల్లాల్లో ఒకటే మాట... సమైక్యం... సమైక్యం... సమైక్యం... ఒకటే బాట.... ఉద్యమం... ఉద్యమం... ఉద్యమం.. రాష్ట్రాన్ని ఒక్కటిగా కలిపి ఉంచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపుతో మమేకమవుతున్న ప్రజలు... వరుసగా రెండో రోజూ తమ తడాఖా చూపిస్తున్నారు. పల్లె, పట్నం, చిన్నా, పెద్దా ... బంద్‌లు, హర్తాళ్లు, నిరసనలతో తమ ఆకాంక్షను బలంగా చాటుతున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. కేబినెట్ నిర్ణయాన్ని నిరసిస్తూ పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. వర్తక, వాణజ్యసంస్థలు బంద్ పాటించాయి. సమైక్యవాదులు, విద్యార్థులు రోడ్డెక్కారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వైఎస్ఆర్ జిల్లాలో కేంద్ర కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా సమైక్యవాదులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మైదుకూరులో బైకు ర్యాలీ నిర్వహించారు. దుకాణాలు మూయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు రఘురామిరెడ్డి బంద్‌ను పర్యవేక్షించారు. కర్నూలు జిల్లాలో బంద్ సంపూర్ణంగా కొనసాగింది. రాజ్‌విహార్ సెంటర్లో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కొడుమూరు, గుడూరు, సి.బెళగల్ మండలాల్లో దుకాణాలు, పాఠశాలలు, సినిమాహాళ్లు, బ్యాంకులు మూసివేశారు. ఆదోనిలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. నంద్యాల్లో తహశీల్దార్ కార్యాలయాన్ని ఏపీఎన్జీవోలు ముట్టడించారు. అనంతపురం జిల్లా ఆందోళనలు మిన్నంటాయి. విద్యార్థులు, వికలాంగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సప్తగిరి సర్కిల్లో మానవహారం నిర్మించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. విధులను బహిష్కరించిన న్యాయవాదులు రోడ్లపైకి వచ్చి టైర్లను తగులబెట్టారు. ఉరవకొండలో ఉద్యోగ, విద్యార్థి జేఏసీల ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు జిల్లాలో సమైక్య నిరసనలు వెల్లువెత్తాయి. మంగళగిరిలో నాన్‌పొలిటికల్ జేఏసీ, వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో సమైక్య సెగలు వెల్లువెత్తాయి. చీరాలలో ఆర్టీసీ బస్సులను అడ్డుకుని బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. రోడ్డుపై పడుకుని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. బంద్‌తో పలు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో కనుమూరి బాపిరాజు నివాసానికి రక్షణ కల్పించేందుకు వెళ్తున్న పారామిలటరీ బలగాలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. తెలుగుజాతిని తాకట్టు పెట్టిన బాపిరాజు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పేరుపాలెం బీచ్‌లో స్వర్ణాంధ్ర కాలేజీకి చెందిన విద్యార్థులు సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో వచ్చే నీటి సమస్యను వివరించేందుకే సైకత శిల్పాన్ని చిత్రీకరించినట్లు విద్యార్థులు తెలిపారు. విజయనగరంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. కలెక్టరేట్లో విధులు బహిష్కరించారు. సెక్షన్ 30ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ జంక్షన్ వద్ద మానవహారం నిర్మించిన ఉద్యోగులు వాహనాలు రాకపోకలను అడ్డుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. వ్యాపారులు దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ ఆధ్వర్యంలో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నందిగామ-కంచికచర్ల సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. పట్టణంలో బంద్ నిర్వహించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో వ్యాపారులు దుకాణాలు మూసివేసి బంద్ పాటించారు. మదర్ థెరిసా యువజన విభాగం ఆధ్వర్యంలో బంద్‌ను పర్యవేక్షించారు. మరోవైపు తిరుపతికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. నెల రోజుల పాటు తిరుపతిలోనే బలగాలు భద్రతను పర్యవేక్షించనున్నాయి. -
సీమాంధ్రలో రగులుతున్న విభజన జ్వాల
-
బంద్...బంద్.....
-
సీమాంధ్ర యూనివర్శిటీల్లో పరీక్షలు వాయిదా
తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో సీమాంధ్రలో నిరసనలు సెగలు కక్కుతుంది. అటు ఉద్యోగ సంఘాలు, ఇటు రాజకీయ పార్టీలు 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో తమ పరిధిలో జరగవలసిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సీమాంధ్రలోని పలు యూనివర్శిటీలు ప్రకటించాయి. కాకినాడలోని జేఎన్టీయూ పరిధిలోని 234 ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈరోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు ఆ యూనివర్శిటీ వీసీ తులసీరాందాస్ శుక్రవారం వెల్లడించారు. ఆ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేంది తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. అలాగే తమ పరిధిలో నేడు, రేపు జరగవలసిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రయూనివర్శిటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. వీటితోపాటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ పరిదిలో నేడు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపాయి. అలాగే నేడు జరగవలసిన పాలిటెక్నిక్ పరీక్షను జనవరి 2వ తేదీకి వాయిదా వేసినట్లు సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. -
విభజనపై రగులుతున్న కోస్తాంధ్ర
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యవాదులు చేపట్టిన బంద్‌తో సీమాంధ్ర రగులుతుంది. విశాఖపట్నంలో సమైక్యవాదులు జాతీయ రహదారులను దిగ్బంధించారు. దాంతో వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. బంద్ కారణంగా యూనివర్శిటీ పరిధిలోని నేడు, రేపు జరగవలసిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు విశాఖపట్నం ఆంధ్రయూనివర్శిటీ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే నేడు జరగాల్సిన పాలిటెక్నిక్ డిప్లొమో పరీక్షలు జనవరి 2వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపింది. విశాఖలోని కేజీహెచ్‌లో వైద్యసేవలను వైద్యులు నిలిపివేశారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆ ఆసుపత్రి వైద్యుల జేఏసీ కన్వీనర్ శ్యాంసుందర్ ప్రకటించారు. రాష్ట్ర విభజనను నిరసిస్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోస్తాంధ్రలో చేపట్టిన బంద్‌కు పలు విద్యార్థి జేఏసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో బంద్ సాగుతుంది. శ్రీకాకుళంలో ఆర్టీసీ డిపో ఎదుట వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త కళ్యాణి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. 9 ఆర్టీసీ డిపోల్లో బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. విద్యా, వ్యాపార సంస్థల యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని న్యాయవాదుల జేఏసీ విధులను బహిష్కరించింది. పెట్రోలు బంకులు మూసివేశారు. అయితే సీఆర్పీఎఫ్ బలగాలు కాకినాడ నగరానికి చేరుకున్నాయి. రాజోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, మట్టా శైలజలు 216 జాతీయ రహదారిని దిగ్బందించారు. దాంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. పశ్చిమగోదావరి జిల్లాలో బంద్ కొననసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమైనాయి. ఏలూరు నగరంలోని జూట్‌మిల్లును మూసివేశారు. అలాగే విద్యా,వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తోటగోపి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆ నిరసన కార్యక్రమంలో సమైక్యవాదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో బంద్ కొనసాగుతుంది. ఆయా జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. వివిధ రాజకీయపార్టీలు జాతీయ రహదారులపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దాంతో జాతీయ రహదారులపై వాహనాలు ఎక్కడివకక్కడ నిలిచిపోయాయి. కోస్తాంధ్రలో ప్రజా జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. -
రాయలసీమలో విజయవంతంగా జరుగుతున్న బంద్
-
రాయలసీమలో విజయవంతంగా జరుగుతున్న బంద్
రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాయలసీమ నాలుగు జిల్లాల్లో బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఒక్క దుకాణం కూడా తెరుచుకోలేదు. బస్సులన్నీ డిపోలకే పరిమితం అయిపోయాయి. విభజన ప్రక్రియను ఆపేవరకు తమ పోరాటం ఆపేది లేదని నాయకులు, ప్రజలు స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో విద్యా, వ్యాపార సంస్థలను స్వచ్చందంగా మూసేశారు. బస్సులేవీ డిపోల నుంచి బయలకు రాలేదు. పలు నియోజకవర్గాల్లో ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కడప అప్సర సర్కిల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. కడప సెవన్ రోడ్డులో ఇంఛార్జ్ అంజాద్ బాషా ఆధ్వర్యంలో బంద్ చేయగా, పులివెందులలో వైఎస్ అవినాష్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. కర్నూలు జిల్లాలో బస్టాండ్‌లో బస్సులను వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. పలు నియోజకవర్గాల్లో నాయకులు రాస్తారోకోలు, ధర్నాలకు శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లాలో కూడా బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ధర్నాచేశారు. నారాయణవనం వద్ద వైఎస్ఆర్సీపీ నేత ఆదిమూలం ఆధ్వర్యంలో రాస్తారోకో చేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ధర్మవరం, హిందూపురం, రాప్తాడు, పుట్టపర్తి నియోజకవర్గాలలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. దుకాణాలు, విద్యాసంస్థలు పూర్తిగా మూసేశారు. -
సమైక్య బంద్
-
రైల్వే ఆదాయానికి సమైక్య సెగ
ఆమదాలవలస, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ కు అనుకూలంగా కేంద్ర మంత్రిమండలి ఆమో దం తెలపడంతో సీమాంధ్ర జిల్లాల్లో పెల్లుబికిన ఆగ్రహజ్వాల రైల్వే శాఖకు తాకింది. జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో పట్టణ జేఏసీ ఆమదాల వలస పట్టణ బంద్‌కు పిలుపు నిచ్చింది. వాహనాల రాకపోకలు ఎక్కడక్కడ నిలిచి పోవడంతో ఆమదావలస రైల్వే స్టేషన్‌కు ప్రయాణికులు రాలేకపోయారు. దీంతో ప్రయాణికులతో రద్దీగా ఉండే శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ శుక్రవారం వెలవెలబోయింది. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ కావడంతో జిల్లా నలుమూలల నుంచి ప్రయాణికులు ఇక్కడికి వస్తారు. బంద్ ప్రకటించడంతో పలువురు ప్రయాణికులు తమప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. దీంతో రైల్వేస్టేషన్‌కు గణ నీయంగా ఆదాయం తగ్గింది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ. 6లక్షలు ఆదాయం సమకూరుతుంది. బంద్‌తో *2.50 లక్షలే ఆదాయం సమకూరిందని రైల్వే అదికారులు తెలిపారు. వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ప్రత్యూమ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో రైల్వే స్టేషన్ ఆవరణలో పడిగాపులు పడ్డారు. ప్రయాణికులు లేకపోవడంతో బుకింగ్ కార్యాలయం బోసిపోయింది. ప్రయాణికులు లేక కొన్ని రైళ్లు ఖాళీగా వెళ్లాయి. మొత్తంమీద సమైక్య బంద్ ప్రభావం రైల్వే శాఖమీద తీవ్రంగాచూపిందని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొన్నారు.