తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో సీమాంధ్రలో నిరసనలు సెగలు కక్కుతుంది. అటు ఉద్యోగ సంఘాలు, ఇటు రాజకీయ పార్టీలు 48 గంటల బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో తమ పరిధిలో జరగవలసిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సీమాంధ్రలోని పలు యూనివర్శిటీలు ప్రకటించాయి. కాకినాడలోని జేఎన్టీయూ పరిధిలోని 234 ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈరోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు ఆ యూనివర్శిటీ వీసీ తులసీరాందాస్ శుక్రవారం వెల్లడించారు.
ఆ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేంది తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. అలాగే తమ పరిధిలో నేడు, రేపు జరగవలసిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రయూనివర్శిటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. వీటితోపాటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ పరిదిలో నేడు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపాయి. అలాగే నేడు జరగవలసిన పాలిటెక్నిక్ పరీక్షను జనవరి 2వ తేదీకి వాయిదా వేసినట్లు సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.