విభజనపై రగులుతున్న కోస్తాంధ్ర
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యవాదులు చేపట్టిన బంద్తో సీమాంధ్ర రగులుతుంది. విశాఖపట్నంలో సమైక్యవాదులు జాతీయ రహదారులను దిగ్బంధించారు. దాంతో వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. బంద్ కారణంగా యూనివర్శిటీ పరిధిలోని నేడు, రేపు జరగవలసిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు విశాఖపట్నం ఆంధ్రయూనివర్శిటీ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే నేడు జరగాల్సిన పాలిటెక్నిక్ డిప్లొమో పరీక్షలు జనవరి 2వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపింది. విశాఖలోని కేజీహెచ్లో వైద్యసేవలను వైద్యులు నిలిపివేశారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆ ఆసుపత్రి వైద్యుల జేఏసీ కన్వీనర్ శ్యాంసుందర్ ప్రకటించారు.
రాష్ట్ర విభజనను నిరసిస్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోస్తాంధ్రలో చేపట్టిన బంద్కు పలు విద్యార్థి జేఏసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో బంద్ సాగుతుంది. శ్రీకాకుళంలో ఆర్టీసీ డిపో ఎదుట వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త కళ్యాణి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. 9 ఆర్టీసీ డిపోల్లో బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. విద్యా, వ్యాపార సంస్థల యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని న్యాయవాదుల జేఏసీ విధులను బహిష్కరించింది. పెట్రోలు బంకులు మూసివేశారు.
అయితే సీఆర్పీఎఫ్ బలగాలు కాకినాడ నగరానికి చేరుకున్నాయి. రాజోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, మట్టా శైలజలు 216 జాతీయ రహదారిని దిగ్బందించారు. దాంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. పశ్చిమగోదావరి జిల్లాలో బంద్ కొననసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమైనాయి. ఏలూరు నగరంలోని జూట్మిల్లును మూసివేశారు. అలాగే విద్యా,వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.
తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తోటగోపి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆ నిరసన కార్యక్రమంలో సమైక్యవాదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో బంద్ కొనసాగుతుంది. ఆయా జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. వివిధ రాజకీయపార్టీలు జాతీయ రహదారులపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దాంతో జాతీయ రహదారులపై వాహనాలు ఎక్కడివకక్కడ నిలిచిపోయాయి. కోస్తాంధ్రలో ప్రజా జీవనం పూర్తిగా స్తంభించిపోయింది.