బలమైన నాయకత్వం ప్రజల ఆకాంక్షకు అద్దంపట్టే నాయకత్వం, అన్యాయాన్ని ఎదిరించే శక్తి సామర్థ్యాలు గల నాయకత్వం, అన్నింటికీ మించి ప్రజలలో విశ్వాసం కలిగిన నాయకత్వం రాష్ట్రంలో ఈ సందర్భంలో చారిత్రక అవసరం. ఆ చారిత్రక అవసరాన్ని తీర్చగలిగే శక్తులు జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీ.
శరవేగంతో అభివృద్ధి పథంలో పరిగెడుతున్న ఆంధ్రప్రదేశ్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవలసివ చ్చింది. నేడు రాష్ట్రంలో జరు గుతున్న పరిణామాలు మొత్తం జాతినే కలవర పరుస్తున్నాయి. ఈ పరిణామాలకు మూలం కాంగ్రెస్, చంద్రబాబు, టీఆర్‌ఎస్ పార్టీలు. తొలి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో తలెత్తిన ప్రత్యేక తెలంగాణ (1969), ప్రత్యేక ఆంధ్ర (1972) ఉద్యమాలు కాంగ్రెస్ అసమ్మతివాదుల నుంచి పుట్టుకొ చ్చినవే. ఆ ఉద్యమాలలో ప్రజలు భారీగా పాల్గొని ఉండవచ్చు. అయితే నాయకత్వ పోటీ, పదవుల పందేరం వాటిలో పనిచేసిన సంగతి గుర్తుం చుకోవాలి. తెలుగుప్రజల ఆత్మగౌరవం, సర్వతో ముఖాభివృద్ధే ధ్యేయం గా పుట్టిన టీడీపీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే భావనకు ప్రాధాన్యం ఇచ్చింది.
కానీ హైటెక్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ప్రత్యేక తెలంగాణవాదం మళ్లీ ఊపిరిపోసుకున్న సంగతి గమనించాలి. అభి వృద్ధి కార్యక్రమాలు సరిగా అమలుకాని పరిస్థితులలో తెలంగాణ ఉద్య మం ఒక మేరకు బలపడింది. 2004- 2009 మధ్య వైఎస్ అందించిన పాలనతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా పరుగులుతీసింది. అలాం టి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26న చరి త్రాత్మక హైదరాబాద్ నగరంలో ‘సమైక్య శంఖారావానికి’ సమాయత్త మవుతున్నారు. అభివృద్ధికి ఆటంకంగా పరిణమించిన శక్తులను అడ్డు కోవడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తన వారసత్వంగా ఇచ్చిన జగన్ ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకానికి ఆశాకిరణమయ్యారు.
కుటుంబం మీద కక్షతోనే కుంపటి
వైఎస్ మరణానంతరం ఆయన కుటుంబం మీద కక్షతో, అప్రజాస్వామికంగా కాంగ్రెస్ రాష్ట్రవిభజన ప్రకటన చేసింది. నదీ జలాలు, విద్యుత్ సమస్యలు, రాజ ధాని సమస్య, ఉద్యోగస్తుల సమస్యలన్నింటినీ మించి రాజధాని నుంచి వచ్చే ఆదాయం పంపిణీ దగ్గర తలెత్తే సమస్యలను పట్టించుకోకుండా, పరిష్కారా లను చూపకుండా, పదేళ్లు మాత్రమే హైదరాబాద్‌లో ఉండి, ఆపై వదిలి వెళ్లా లని సీమాంధ్ర ప్రజలను కాంగ్రెస్ హైకమాండ్ నిర్దేశించింది. ఈ పరిణామం సీమాంధ్ర ప్రజలు తెలంగాణను దోచుకుంటున్నారని ప్రచారం చేస్తున్న వారి సరసన నిలబడి వారు చెప్పేదంతా నిజమని, న్యాయమని చెప్పినట్టు ఉంది. ఈ తీరు అందరినీ బాధించింది. హైకమాండ్ పేరుతో బాధ్యతారహితంగా స్పష్టత లేకుండా, తెలుగువారి మనోభావాలను గాయపరిచేటట్లు కాంగ్రెస్ పెద్దలు ప్రవ ర్తించారు.
ప్రతిపక్షం టీడీపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్త రామోజీరావు, ప్రచారకుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు ఈ ప్రక్రియకు దాసోహమనడం గమనార్హం. ఈ పరిణామాలు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారితో పాటు, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాలలోని తెలుగు వారినీ, ఎన్‌ఆర్‌ఐలనూ కూడా ఆవేదనకు గురిచేశాయి. తెలుగు వాళ్లందరికీ ఒక రాష్ట్రం అన్న భావన నుంచి పుట్టుకొచ్చిన సమైక్యవాదం ఒక ఆదర్శం. ఇటీవల మరోసారి ఆ ఆదర్శం కోసం తెలుగువాడు నినదించడం ప్రపంచ చరిత్ర పుటల్లోకి చేరింది. విశాఖ ఉక్కు, ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర, ఎన్టీఆర్ బర్త రఫ్ వ్యతిరేక నిరసన (1984), మహిళా లోకం చేపట్టిన సారా వ్యతిరేక ఉద్యమం చెప్పుకోదగ్గవి. ఈ ఉద్యమాల వెనుక బలమైన రాజకీయశక్తులు పనిచేశాయి. నేటి సమై క్యాంధ్ర ఉద్యమం ప్రజల గుండెల్లో నుంచి పుట్టుకొచ్చిం ది. ఒక ప్రాంతం ఇలా విడిపోవడానికి అంగీకరించే సంప్ర దాయానికి నేటి కాంగ్రెస్ తెరలేపింది.
ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడాలనే ప్రతిపాదనలు ఉత్తరప్ర దేశ్ నుంచి అసెంబ్లీ తీర్మానాల రూపంలో వచ్చాయి. గుర్ఖాలాండ్, విదర్భ డిమాండ్లు కూడా ఉన్నా, అవన్నీ పక్కన పెట్టి ఎన్నికలముందు కేవలం ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ చేపట్టడం ఏ ప్రమాణాలకు సంకేతం? 1969, 72లో వచ్చిన ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలను ఇందిరాగాంధీ నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. 8.2.1969న తిరుపతిలో (శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మైదానంలో) జరిగిన బహిరంగ సభలో ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ సూటిగా, ‘భాషా ప్రయుక్త రాష్ట్రాలు రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డాయి. కొందరు వ్యక్తులు లేదా వ్యవస్థలు లేదా ప్రాంతాలు ఈ భావనకు వ్యతిరే కంగా ప్రత్యేక విభజన వాదం పేరుతో ఉద్యమించడం అనైతికం, చట్టవ్యతిరేకం. ఇది జాతి సమైక్యత, సమగ్రతలకు ప్రమాదం’ అంటూ హెచ్చరించారు. జాతి సమైక్యత, సమగ్రతల కోసం ప్రాణాలు పోగొట్టుకున్న ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అందిపుచ్చుకోగలదా? లేదా? ఇది తేల్చుకోవలసిన తరుణం.
కపట నాటకం కాదా?
నేడు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అనేక ఎత్తుగడలు పన్నుతూ ప్రజాభిప్రా యాన్ని నీర్చుగార్చడానికి ప్రయత్నిస్తున్నది. ముఖ్యమంత్రి తాను సమైక్యతకు కట్టుబడి ఉన్నానంటూ, హైకమాండ్‌ను ధిక్కరిస్తున్నట్లు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ ప్రజల్ని మోసగిం చడానికి ఆడే కపట నాటకాలు. మరోవైపు, విభజనకు కాం గ్రెస్‌తో కలిసి పునాదులు వేసిన ప్రతిపక్షనేత గందరగోళం సృష్టిస్తూ, సీమాంధ్రకు అన్యాయం జరుగుతున్నదంటూ, విభజన ప్రక్రియ సరైన పద్ధతుల్లో అమలు చేయడంలేదంటూ ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారు. దివాళా తీసిన తమ పార్టీ వల్ల ఉపయోగం లేదని, సమైక్య రాష్ట్రం ఆశయంగా కొత్త పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయా లని కాంగ్రెస్‌లోనే కొందరు ఆలోచిస్తున్నారు. మూడు రాష్ట్రాల విభజ నను విజయవంతంగా అమలుపరిచామని చెప్పే బీజేపీ, విభజనను సమర్థిస్తూనే, ఇక్కడ ఆ ప్రక్రియ సరిగాలేదని సాంకేతిక కారణాలు చూపెడుతూ మరో తీరులో ప్రజలను మోసగించడానికి ప్రయత్నిస్తు న్నది. ఒకప్పుడు చంద్రబాబు సూచన మేరకు తెలంగాణ విభజనను పక్కన పెట్టింది బీజేపీయే.
శంఖారావం ఒక అవసరం
విభజన ప్రక్రియలో తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి అంటూ నేడు కేంద్ర ప్రభుత్వం జీఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) పేరుతో ఓ కుట్రపూరిత చర్యను చేపట్టింది. మహారాష్ర్ట, కర్ణాటక నుంచి ప్రాతి నిధ్యం వహించే వారికి, చిన్న రాష్ట్రాలను సమర్థించే నాయకులకు ఈ కమిటీలో చోటు కల్పించారు. కావేరీ జలాల వివాదంలో కర్ణాటక, తమిళనాడు మధ్య సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయని పరిస్థితిని చూస్తున్నాం. తుంగభద్ర, కృష్ణా, గోదావరి జలాలను, ఎగువన వినియోగించుకోవడానికి అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్న సంగతీ మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన షిండే ప్రముఖ పాత్ర పోషించే మంత్రుల కమిటీ తెలుగు వారికి న్యాయం చేయ గలదా? బలమైన నాయకత్వం ప్రజల ఆకాంక్షకు అద్దంపట్టే నాయకత్వం, అన్యాయాన్ని ఎదిరించే శక్తి సామర్థ్యాలు గల నాయకత్వం, అన్నింటికీ మించి ప్రజలలో విశ్వాసం కలిగిన నాయకత్వం రాష్ట్రంలో ఈ సందర్భంలో చారిత్రక అవసరం. ఆ చారిత్రక అవసరాన్ని తీర్చగలిగే శక్తులు జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీ. ఈ 26న చరిత్రాత్మక హైదరాబాద్‌లో జగన్ సమైక్య శంఖారావానికి ఉద్యుక్తులు కావడం అలాంటి చారిత్రక అవస రంలో భాగమే.
ఇదొక చారిత్రక సందర్భం
ప్రత్యేక తెలంగాణ కాదు, ప్రజల అభివృద్ధి కావాలి. ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. నన్ను నమ్మండి అంటూ జగన్ పంపిన సందేశం 26వ తేదీన ఒక ప్రభంజనంగా మారబోతున్నది. పార్టీని స్థాపించిన రెండేళ్లకే ఎన్నో సాధించి, జగన్ సంస్థను నడిపించిన తీరు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది. వైఎస్ పథకాలను తాను కూడా అమలు చేయగలనని స్పష్టమైన సంకేతాలు పంప గలిగారు. మూడే ళ్లలో 16 నెలలు జైలు జీవితం గడిపినా, ప్రజలకు ఇంత చేరు వైన నాయకుడు ఇటీవల కాలంలో కనిపించరు. జగన్‌మోహన్‌రెడ్డి ఎదుగు దలను నిలువరించడానికి జరగని కుట్రలేదు. చివరి అస్త్రంగా జగన్‌ను బలహీన పరచడానికి రాష్ట్రాన్నీ, తెలుగు ప్రజలను చీల్చడానికి సమాయత్తమయ్యారు. ప్రజలు ఈ పన్నాగాన్ని వ్యతిరేకించాల్సిన చారిత్రక సందర్భంలో ఉన్నారు. మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి సాధనకు చేపట్టిన సమైక్య శంఖారావానికి ప్రతి తెలుగోడు మద్దతు ప్రకటించాలి. జలాల సమస్య, జనాల సమస్యల పరిష్కారం కోసం జగన్ పూరిస్తున్న శంఖారావమిది.
-ఇమామ్, సంపాదకులు 'కదలిక'