న్యూస్‌లైన్ నెట్‌వర్క్ : గోదావరి నదిలో వరద తీవ్రత కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో, ముంపు బారిన పడిన గోదావరి లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో నీటిమట్టం 17.90 అడుగుల వద్ద ఉండగా, 19.53లక్షల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాలను ఆనుకుని ఉన్న16 మండలాలపై వరద తీవ్ర ప్రభావం చూపుతోంది. 59 గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వరద వల్ల 1.45 లక్షల మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లంకవాసులు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. పక్షం రోజుల్లో 12 రోజులకు పైబడి ఈ గ్రామాలు ముంపున ఉండడంతో ఇళ్లు, పంట నష్టం తీవ్రత ఇంకా పెరుగుతోంది. వరదలకు తోడు ఆదివారం రాత్రి నుంచి వర్షం కురవడంతో లంకవాసుల పరిస్థితి దుర్భరంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలంలో సోమవారం వరద నీటిలో ఓ నాటు పడవ మునిగిపోయింది.
అయితే, పది మంది ఒకరినొకరు పట్టుకుని సురక్షితంగా బయటపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా గోష్పాద క్షేత్రంలో ఆరడుగుల వరద నీరు ప్రవహిస్తోంది. కడెమ్మ స్లూయిజ్ వద్ద వరద ఉధృతంగా ఉండడంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాళ్లపూడి రేవులోని పలు ఆలయాలతోపాటు వేగేశ్వరపురంలోని మేరిమాత ఆలయం ఇంకా వరద ముంపులోనే ఉంది. కొవ్వూరు మండలంలో వందలాది ఎకరాల లంక భూముల్లోని పంటలు నీట మునిగాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీ గోదావరి వరదలతో అతలాకుతలమైంది. భద్రాచలం వద్ద అత్యధికంగా 62 అడుగుల నీటిమట్టంతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి సోమవారం సాయంత్రం 7గంటలకు 53 అడుగులకు చేరుకుంది. అల్పపీడనం కారణంగా సోమవారం రోజంతా విస్తారంగా వర్షం కురవడంతో ఏజెన్సీలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.
దీంతో మళ్లీ వరద స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి 19 గేట్లను 6 అడుగుల మేర ఎత్తి 73 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వాజేడు మండలం చీకుపల్లి వాగుకు అవతల ఉన్న 32 గ్రామాలకు ఎటూ దారిలేకుండాపోయింది. భద్రాచలం నుంచి కూనవరం రహదారిలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లో పత్తి, మిరప పంటలు నీట మునిగాయి.
పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు వరదలు ముంచెత్తడంతో పరివాహక ప్రాంతంలో సుమారు 35వేల ఎకరాలకు పైగా పంటకు నష్టం వాటిల్లింది. భద్రాచలం రామాలయం చుట్టూ ఉన్న ఇళ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి. చింతూరు మండలంలో శబరి నదిలో పడి పొన్నాడ ప్రసాద్(30) సోమవారం మృతి చెందాడు. ముంపు గ్రామాల్లో ఎటువంటి పునరావాసం లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 573 గ్రామాలకు విద్యుత్ సరఫరా లేకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జూరాలలో 28 క్రస్టుగేట్ల ఎత్తివేత
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో సోమవారం మరింత పెరిగిందని పీజేపీ అధికారులు కృష్ణయ్య తెలిపారు. దీంతో మొత్తం 28గేట్ల ద్వారా 2.32 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2.70లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, మొత్తం 34 క్రస్టుగేట్ల ద్వారా 2.11లక్షల క్యూసెక్కులు, ఆల్మట్టి ప్రాజెక్టుకు 2.20లక్షల ఇన్‌ఫ్లో ఉండగా, 26 క్రస్టుగేట్ల ద్వారా 2.70లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నిండుకుండలా శ్రీరాంసాగర్
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి సోమవారం సాయంత్రం వరద నీరు పెరగడంతో రెండు వరద గేట్లను ఎత్తి 5,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాల నుంచి 16 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులతో నిండుకుండలా ఉందని అధికారులు తెలిపారు.
రోడ్డు పక్కనే అంతిమ సంస్కారం
తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం వృద్ధ గౌతమి శ్మశాన వాటిక ముంపునకు గురవడంతో అంతిమ సంస్కారాలు, పిండ ప్రదానం చేయడానికి నానా ఇబ్బందు లు పడాల్సి వస్తోంది. కే జగన్నాథపురానికి చెందిన సంసాని నాగేశ్వరరావు (55) అనారోగ్యంతో సోమవారం మృతిచెందారు. ఆయన మృతదే హాన్ని శ్మశాన వాటికకు తీసుకువచ్చినా అక్కడ వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రోడ్డు పక్కనే అంతిమ సంస్కారం జరిపారు.
వరదలపై సీఎం కిరణ్ సమీక్ష
రాష్ట్రవ్యాప్తంగా భారీ వరదలకు గురైన ప్రాంతాల స్థితిగతులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మొహంతి, విపత్తుల నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడారు. ఇప్పటివరకూ వరదల కారణంగా 47 మంది మృతి చెందారని, 21,384 వేల ఇళ్లు దెబ్బతిన్నాయని సీఎంకు చెప్పారు. ఎనిమిది జిల్లాల్లో 73వేల హెక్టార్లలో పంట, 43వేల ఎకరాల్లో పత్తి, 3వేలకు పైగా ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు.ఇప్పటివరకూ వరద బాధిత ప్రాంతాల్లో 158 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశామని... ఖమ్మం, తూర్పుగోదావరి, అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో మరో 119 సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.