భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: ఇదేమీ సాయమంటూ ప్రజాప్రతినిధులు, అధికారులపై భద్రాచలం పట్టణంలో ఆదివారం వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల నుంచి పునరావాస కేంద్రంలో ఉన్నా పట్టించుకున్న అధికారి, ప్రజాప్రతినిధి లేరంటూ రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై ధర్నా చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
అడుగడుగునా నిర్లక్ష్యం...
రెండు రోజుల క్రితం గోదావరికి వరద ఉధృతంగా రావడంతో రాత్రికి రాత్రే కరకట్ట దిగువన ఉన్న సుభాష్‌నగర్ కాలనీలోని ఇళ్లలోని నీరు చేరింది. దీంతో ఆ కాలనీ వాసులు అప్పటికప్పుడు సామగ్రి సర్దుకుని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. కానీ వారికి వసతులు కల్పించడంతో అధికారులు విఫలమయ్యారు. కావాల్సిన నిత్యావసరాలను అందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పునరావాస కేంద్రాల్లో అనేక మంది విష జ్వరాలతో బాధపడుతున్నారని, అలాగే చిన్న పిల్లలకు అవసరమైన పాలు, బ్రెడ్‌లను అందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. రెండు రోజు లుగా పట్టణంలోని పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు బాధితులకు భోజనం, అల్పాహారం అందించారని, అధికారులు మాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను నిలదీసిన బాధితులు
అధికారుల నిర్లక్ష్యంపై జూనియర్ కళాశాల సెంటర్‌లో కూనవరం రహదారిపై బాధితులు ధర్నా చేస్తుండగా అక్కడకు భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు రావడంతో బాధితులు కోపోద్రిక్తులయ్యారు. రెండు రోజులుగా పునరావాస కేంద్రంలో కష్టాలు పడుతుంటే ఇప్పుడు వస్తారా..? అంటూ వారిని నిలదీశారు. బాధితులు వారిని చుట్టుముట్టడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. వారు సముదాయించేందుకు యత్నించినప్పటికీ బాధితులు శాంతించలేదు. మా గోడు మీరే చూడండంటూ వారిని పునరావాస కేంద్రంలోకి తీసుకెళ్లారు. కనీసం తాగునీరు కూడా లేదంటూ కళాశాల ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ట్యాంకర్‌ను చూపించారు. అదేవిధంగా బియ్యం, పప్పు, పిల్లలకు పాలు, బ్రెడ్‌లను కూడా అందించలేదని అన్నారు.
తిండిపెట్టని ప్యాకేజీలు ఎందుకు...?
వరద బాధితులకు స్పెషల్ ప్యాకేజీలు ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలకు వినతిపత్రం అందజేశామని, త్వరలోనే స్పెషల్ ప్యాకేజీ వస్తుందని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పేర్కొనగా బాధితులు మరింత కోపోద్రిక్తులయ్యారు. కూడు, గుడ్డ లేకుండా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న తమకు సరైన తిండి పెట్టకుండా స్పెషల్ ప్యాకేజీలంటూ హామీలు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం ముంపునకు సంబంధించి ఇప్పటి వరకు పరిహారం నేటికీ అందలేదని ఆరోపించారు. తక్షణమే నెల్లిపాక వరకు కరకట్ట నిర్మించాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వెంటనే సెక్టోరియల్ అధికారి, పోలవరం డిప్యూటీ కలెక్టర్ వైవీ గణేష్‌ను అక్కడికి పిలిపించి బాధితులకు అందుతున్న సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య బాధితులకు సత్వరమే సహాయం అందించాలంటూ ఎమ్మెల్యేకు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కుంజా సత్యవతి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చి వెనుతిరిగారు.
అధికారులపై వరద బాధితుల ఆగ్రహం..
Published Mon, Aug 5 2013 6:51 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
Advertisement