సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా సహజ వాయువు రేటును కేంద్ర ప్రభుత్వం 25 శాతం మేర తగ్గించింది. దీనితో యూనిట్ (ఎంబీటీయూ) రేటు ధర 1.79 డాలర్లకు దిగివచ్చింది. ఇది రికార్డు కనిష్ట స్థాయి. విద్యుదుత్పత్తి, ఎరువుల తయారీ మొదలైన వాటికి ఉపయోగించే గ్యాస్ రేటును అక్టోబర్ 1 నుంచి 1.79 డాలర్లకు తగ్గిస్తున్నట్లు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) వెల్లడించింది. ఇప్పటిదాకా దీని రేటు 2.39 డాలర్లుగా ఉంది. ఏడాది కాలంలో గ్యాస్ రేటును తగ్గించడం ఇది మూడోసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా 26 శాతం మేర కోత విధించడంతో ధర 2.39 డాలర్లకు తగ్గింది. మరోవైపు, సంక్లిష్ట క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేటును సైతం యూనిట్‌కు 5.61 డాలర్ల నుంచి 4.06 డాలర్లకు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా సహజ వాయువు ధరను ప్రతి ఆర్నెల్లకోసారి .. ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న ప్రభుత్వం సవరిస్తోంది. గ్యాస్ ఎగుమతి దేశాలైన అమెరికా, కెనడా, రష్యాల్లోని రేట్లను ఇందుకు ప్రామాణికంగా తీసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment