Natural gas prices
-
ఇంధన భద్రతలో ఆటో ఎల్పీజీ కీలకపాత్ర
న్యూఢిల్లీ: ఓవైపు అంతర్జాతీయంగా సహజ వాయువు ధరలు పెరుగుతుండగా, మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలను సరఫరా వ్యవస్థ సమస్యలు వెన్నాడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఇంధన భద్రతను సాధించడంలో ఆటో ఎల్పీజీ కీలక పాత్ర పోషించగలదని పరిశ్రమ సమాఖ్య ఐఏసీ తెలిపింది. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ తర్వాత రవాణా కోసం అత్యధికంగా ఉపయోగించే ఇంధనాల్లో ఆటో ఎల్పీజీ మూడో స్థానంలో ఉందని వివరించింది. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ అవకాశాలు చాలా తక్కువని ఐఏసీ పేర్కొంది. కరోనా కారణంగా అంతర్జాతీయంగా ఇంధనాల సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతుండటం, ఇంధన ఎగుమతిలో కీలకంగా ఉంటున్న ఒక దేశం పూర్తి స్థాయి యుద్ధంలో నిమగ్నమై ఉండటం తదితర అంశాల కారణంగా ఇంధన భద్రత సాధించడం మరింత కీలకంగా మారిందని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా ఆటో ఎల్పీజీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలపై కూడా ప్రభుత్వం మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలా కాకుండా వాటికి తగినంత గుర్తింపునివ్వకపోవడం ఆందోళన కలిగించే అంశమని ఐఏసీ డైరెక్టర్ జనరల్ సుయశ్ గుప్తా వ్యాఖ్యానించారు. విద్యుత్‌తో పోలిస్తే ఉత్పత్తి దశ నుంచి వినియోగం వరకూ ఎల్పీజీ వల్ల వచ్చే ఉద్గారాలు చాలా తక్కువని ఆయన చెప్పారు. -
సహజ వాయువు ధరపై నియంత్రణలు
న్యూఢిల్లీ: దేశంలో సహజ వాయువు ధరలు అసాధారంగా పెరిగిపోకుండా కిరీట్ పారిఖ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. లెగసీ క్షేత్రాల నుంచి (నామినేషన్‌పై ప్రభుత్వం కేటాయించిన) ఉత్పత్తి అయ్యే సహజ వాయువు ధరలకు కనిష్ట, గరిష్ట పరిమితులను సూచించింది. దీనివల్ల దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం సహజ వాయువులో రెండొంతులపై (పాత క్షేత్రాల నుంచి) కచ్చితమైన ధరల విధానం ఉంటుందని అభిప్రాయపడింది. తయారీ సంస్థలకు ధరలపై స్పష్టత ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వరంగ సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా ఈ తరహా క్షేత్రాలను నిర్వహిస్తున్నాయి. కేజీ డీ6 తదితర రిలయన్స్, బీపీ ఇతర సంస్థలు ఉత్పత్తి చేస్తున్న వాటికి ఈ ధరల పరిమితి వర్తించదు. తాజా సూచనలతో 70 శాతం మేర పెరిగిపోయిన ధరలు కొంత దిగి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు నామినేషన్‌పై ఇచ్చిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్‌కు, దిగుమతి చేసుకునే గ్యాస్ ధరనే చెల్లించాలని సిఫారసు చేసింది. అంతేకానీ, అంతర్జాతీయ ధరలను చెల్లించొద్దని సూచించింది. మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ)కు కనీసం 4 డాలర్లు, గరిష్టంగా 6.5 డాలర్ల చొప్పున పరిమితులు సూచించింది. దీనికి ఏటా 0.05 డాలర్లను పెంచుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఎంబీటీయూ ధర 8.57 డాలర్లు ఉంది. లోతైన సముద్ర ప్రాంతాలు, అధిక ఉష్ణోగ్రతలు ఉండే జోన్లకు ప్రస్తుతం భిన్న రేట్ల విధానం అమల్లో ఉంది. వీటికి సంబంధించి సైతం ఎంబీటీయూ గరిష్ట ధర 12.46 డాలర్లు మించకూడదని పారిఖ్ కమిటీ సిఫారసు చేసింది. ఇక 2026 జనవరి 1 నుంచి ధరలపై ఎలాంటి పరిమితుల్లేని స్వేచ్ఛా విధానాన్ని సూచించింది. -
గ్యాస్ రేట్ల సమీక్షకు పారిఖ్ కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ: ఓఎన్జీసీ, రిలయన్స్ తదితర సంస్థలు ఉత్పత్తి చేసే సహజ వాయువు రేట్లను సమీక్షించి, తగు సిఫార్సులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు కిరీట్ పారిఖ్ సారథ్యం వహిస్తారు. నెలాఖరులోగా కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. దేశీయంగా ఉత్పత్తి చేసే గ్యాస్ రేట్లను నిర్ణయించేందుకు ప్రభుత్వం నిర్దిష్ట ఫార్ములాను ఉపయోగిస్తుంది. ఏటా రెండు సార్లు .. ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న సమీక్షిస్తోంది. దీని ప్రకారం ఒకోసారి ఉత్పత్తి వ్యయాల కన్నా కూడా ధర తక్కువగా ఉండేది. అయితే, ఈ ఏడాది మార్చి నుంచి అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయంగాను క్రూడాయిల్, గ్యాస్ రేట్లు పెరిగాయి. అటు వినియోగదారులకు భారం కాకుండా ఇటు ఉత్పత్తి కంపెనీలూ దెబ్బతినకుండా సముచిత రేటును సిఫార్సు చేసేందుకు పారిఖ్ కమిటీ ఏర్పాటైంది. -
రికార్డు కనిష్టానికి నేచురల్ గ్యాస్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా సహజ వాయువు రేటును కేంద్ర ప్రభుత్వం 25 శాతం మేర తగ్గించింది. దీనితో యూనిట్ (ఎంబీటీయూ) రేటు ధర 1.79 డాలర్లకు దిగివచ్చింది. ఇది రికార్డు కనిష్ట స్థాయి. విద్యుదుత్పత్తి, ఎరువుల తయారీ మొదలైన వాటికి ఉపయోగించే గ్యాస్ రేటును అక్టోబర్ 1 నుంచి 1.79 డాలర్లకు తగ్గిస్తున్నట్లు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) వెల్లడించింది. ఇప్పటిదాకా దీని రేటు 2.39 డాలర్లుగా ఉంది. ఏడాది కాలంలో గ్యాస్ రేటును తగ్గించడం ఇది మూడోసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా 26 శాతం మేర కోత విధించడంతో ధర 2.39 డాలర్లకు తగ్గింది. మరోవైపు, సంక్లిష్ట క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేటును సైతం యూనిట్‌కు 5.61 డాలర్ల నుంచి 4.06 డాలర్లకు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా సహజ వాయువు ధరను ప్రతి ఆర్నెల్లకోసారి .. ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న ప్రభుత్వం సవరిస్తోంది. గ్యాస్ ఎగుమతి దేశాలైన అమెరికా, కెనడా, రష్యాల్లోని రేట్లను ఇందుకు ప్రామాణికంగా తీసుకుంటుంది. -
గ్యాస్, యూరియా రేట్లకు రెక్కలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సహజ వాయువు ధరలు 10 శాతం మేర పెరగనున్నాయి. మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరనున్నాయి. దీంతో సీఎన్జీ, పైపుల ద్వారా సరఫరా చేసే వంట గ్యాస్ రేట్లతో పాటుయూరియా ఉత్పత్తి వ్యయాలు కూడా పెరగనున్నాయి. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఆర్నెల్ల వ్యవధికి గాను దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు రేటు మిలియన్ బ్రిటీష్ థర్మల్ యూనిట్‌కు (ఎంఎంబీటీయూ) 3.69 డాలర్లకి చేరనుంది. ప్రస్తుతం ఇది యూనిట్‌కు 3.36 డాలర్లుగా ఉంది. మరోవైపు, సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర యూనిట్‌కు 7.67 డాలర్ల స్థాయి నుంచి 9.32 డాలర్లకు పెరగనుంది. గ్యాస్ రేట్లను పెంచడం ఇది వరుసగా నాలుగోసారి. 2015 అక్టోబర్– 2016 మార్చి మధ్య కాలంలో గ్యాస్ రేటు అత్యధికంగా యూనిట్‌కు 3.82 డాలర్లుగా నమోదైంది. ధర పెంపునకు సంబంధించి ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ప్రతి ఆరు నెలలకోసారి గ్యాస్ ధరను సవరించడం సాధారణంగా జరిగేదే. అయితే, ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్‌కు ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందా అన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓఎన్జీసీ, రిలయన్స్‌కు మేలు.. సాధారణంగా ప్రతి ఆర్నెల్లకోసారి ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరలను సవరిం చడం జరుగుతుంది. మిగులు గ్యాస్ ఉన్న అమెరికా, రష్యా, కెనడా వంటి దేశాల సగటు రేట్ల ప్రాతిపదికన గ్యాస్ రేటును సవరిస్తారు. అమెరికాలోని హెన్రీ హబ్, బ్రిటన్‌లోని నేషనల్ బ్యాలెన్సింగ్ పాయింట్, అల్బెర్టా(కెనడా), రష్యాల్లో గత త్రైమాసికంలో ఉన్న సగటు రేటు ఆధారంగా దేశీ గ్యాస్ ధరను లెక్కేస్తారు. ధర పెంచడం వల్ల సహజ వాయువు ఉత్పత్తి చేసే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ), రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థల ఆదాయాలు పెరగనుండగా, మరోవైపు.. సహజవాయువు ముడివనరుగా తయారయ్యే ఎరువులు, పెట్రోకెమికల్స్, సీఎన్జీ, పైప్డ్ గ్యాస్ మొదలైనవి భారం కానున్నాయి. గ్యాస్ ధర 1 డాలరు మేర పెరిగితే వార్షికంగా ఓఎన్జీసీ వంటి సంస్థకు రూ. 4,000 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం భారత్ సహజ వాయువు అవసరాల్లో దాదాపు సగభాగాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం దేశీయంగా ఉత్పత్తయ్యే గాయ్స్ కన్నా రెట్టింపు రేటు చెల్లించాల్సి వస్తోంది. -
10% తగ్గనున్న సహజ వాయువు ధర!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ రేట్లకు తగ్గట్లు దేశీయంగా ఉత్పత్తయ్యే సహజ వాయువు ధరలను కేంద్రం తగ్గించనుంది. ఏప్రిల్ 1 నుంచి యూనిట్ (మిలియన్ బ్రిటీష్ థర్మల్ యూనిట్) ధరను ప్రస్తుతమున్న 5.61 డాలర్ల నుంచి 5.02 డాలర్లకు తగ్గించే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది సుమారు 10 శాతం తగ్గుదల. దేశీయంగా సహజ వాయువు రేటు తగ్గించడం ఇదే మొదటిసారి కానుంది.ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి గ్యాస్ ఉత్పత్తి కంపెనీల ఆదాయాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ వారంలోనే దీనిపై నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా ప్రధానమైన గ్యాస్ హబ్‌ల వద్ద రేట్లను బట్టి ప్రతి ఆరు నెలలకోసారి దేశీయంగా ధరలను కేంద్రం సవరిస్తుంది. క్రితం సారి అక్టోబర్‌లో నిర్ణయించిన ధర గడువు మార్చితో ముగియనుంది.