
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సహజ వాయువు ధరలు 10 శాతం మేర పెరగనున్నాయి. మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరనున్నాయి. దీంతో సీఎన్‌జీ, పైపుల ద్వారా సరఫరా చేసే వంట గ్యాస్ రేట్లతో పాటుయూరియా ఉత్పత్తి వ్యయాలు కూడా పెరగనున్నాయి. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఆర్నెల్ల వ్యవధికి గాను దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు రేటు మిలియన్ బ్రిటీష్ థర్మల్ యూనిట్‌కు (ఎంఎంబీటీయూ) 3.69 డాలర్లకి చేరనుంది. ప్రస్తుతం ఇది యూనిట్‌కు 3.36 డాలర్లుగా ఉంది.
మరోవైపు, సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర యూనిట్‌కు 7.67 డాలర్ల స్థాయి నుంచి 9.32 డాలర్లకు పెరగనుంది. గ్యాస్ రేట్లను పెంచడం ఇది వరుసగా నాలుగోసారి. 2015 అక్టోబర్– 2016 మార్చి మధ్య కాలంలో గ్యాస్ రేటు అత్యధికంగా యూనిట్‌కు 3.82 డాలర్లుగా నమోదైంది. ధర పెంపునకు సంబంధించి ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ప్రతి ఆరు నెలలకోసారి గ్యాస్ ధరను సవరించడం సాధారణంగా జరిగేదే. అయితే, ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్‌కు ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందా అన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఓఎన్‌జీసీ, రిలయన్స్‌కు మేలు..
సాధారణంగా ప్రతి ఆర్నెల్లకోసారి ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరలను సవరిం చడం జరుగుతుంది. మిగులు గ్యాస్ ఉన్న అమెరికా, రష్యా, కెనడా వంటి దేశాల సగటు రేట్ల ప్రాతిపదికన గ్యాస్ రేటును సవరిస్తారు. అమెరికాలోని హెన్రీ హబ్, బ్రిటన్‌లోని నేషనల్ బ్యాలెన్సింగ్ పాయింట్, అల్బెర్టా(కెనడా), రష్యాల్లో గత త్రైమాసికంలో ఉన్న సగటు రేటు ఆధారంగా దేశీ గ్యాస్ ధరను లెక్కేస్తారు. ధర పెంచడం వల్ల సహజ వాయువు ఉత్పత్తి చేసే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ), రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థల ఆదాయాలు పెరగనుండగా, మరోవైపు.. సహజవాయువు ముడివనరుగా తయారయ్యే ఎరువులు, పెట్రోకెమికల్స్, సీఎన్‌జీ, పైప్డ్ గ్యాస్ మొదలైనవి భారం కానున్నాయి. గ్యాస్ ధర 1 డాలరు మేర పెరిగితే వార్షికంగా ఓఎన్‌జీసీ వంటి సంస్థకు రూ. 4,000 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం భారత్ సహజ వాయువు అవసరాల్లో దాదాపు సగభాగాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం దేశీయంగా ఉత్పత్తయ్యే గాయ్స్ కన్నా రెట్టింపు రేటు చెల్లించాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment