న్యూఢిల్లీ: ఓపెన్ ఏకరేజ్ లైసెన్స్ పాలసీ(ఓఏఎల్‌పీ)లో భాగంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ) 7 బ్లాకులను గెలుచుకుంది. ప్రయివేట్ రంగ కన్సార్షియం రిలయన్స్–బీపీ, ఇంధన రంగ పీఎస్‌యూ ఆయిల్ ఇండియా, సన్‌పెట్రోకెమికల్స్ ఒక్కో క్షేత్రం చొప్పున సాధించాయి.
చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించి 8వ రౌండ్‌లో భాగంగా 10 బ్లాకులను ఆఫర్ చేసినట్లు చమురు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. వెరసి ఓఏఎల్‌పీ–8లో తాజాగా 10 బ్లాకులకు సంతకాలు జరిగినట్లు వెల్లడించారు. ఇదేసమయంలో మూడు కోల్‌బెడ్ మిథేన్(సీబీఎం) బ్లాకులను సైతం కేటాయించినట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఓఏఎల్‌పీ–9వ రౌండ్ బిడ్డింగ్‌కు తెరతీసినట్లు తెలియజేశారు.
తాజాగా ఆఫర్ చేసిన బ్లాకుల అన్వేషణ కార్యకలాపాలకు 23.3 కోట్ల డాలర్ల పెట్టుబడులు వెచ్చించవచ్చని భావిస్తున్నట్లు అధికారిక నోట్‌లో చమురు శాఖ పేర్కొంది. 2022 జులైలో ఓఎల్‌ఏపీ–8వ రౌండ్‌కు బిడ్డింగ్‌ను తెరిచిన సంగతి తెలిసిందే. చమురు శాఖ మొత్తం 10 బ్లాకులను ఆఫర్ చేసింది. పలు దఫాలు గడువు తేదీని సవరించాక 2023 జులైలో బిడ్డింగ్‌ను ముగించింది. హైడ్రోకార్బన్స్ డైరెక్టరేట్ జనరల్(డీజీహెచ్) వివరాల ప్రకారం ఓఎన్‌జీసీసహా వేదాంతా లిమిటెడ్, ఆయిల్ ఇండియా, సన్ పెట్రోకెమికల్స్, రిలయన్స్–బీపీ ఎక్స్‌ప్లొరేషన్(అల్ఫా) ఉమ్మడిగా 13 బిడ్స్ దాఖలు చేశాయి.
బిడ్స్ తీరిలా
కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేసిన 10 బ్లాకులలో ఏడింటికి ఒక్కొక్క బిడ్ దాఖలుకాగా.. మిగిలిన మూడు క్షేత్రాలకు రెండేసి బిడ్స్ లభించాయి. గ్లోబల్ ఇంధన దిగ్గజాలు ఎక్సాన్‌మొబిల్, షెవ్రాన్, టోటల్‌ఎనర్జీస్ బిడ్ చేయలేదు. మొత్తం 9 బ్లాకులకు బిడ్ చేసినఓఎన్‌జీసీ 6 బ్లాకులకు ఒంటరిగా రేసులో నిలిచింది. రిలయన్స్–బీపీ కేజీ బేసిన్‌లోని లోతైన సముద్రగర్భ బ్లాక్‌కు బిడ్ వేసింది. దశాబ్ద కాలంగా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న రిలయన్స్–బీపీ గత ఓఏఎల్‌పీ రౌండ్లలోనూ ఒక బ్లాకును గెలుచుకున్నాయి.
చమురు దిగుమతుల బిల్లును తగ్గించుకునే లక్ష్యంతో ప్రభుత్వం 2016లో ఓఏఎల్‌పీకి తెరతీసింది. తద్వారా చమురు సంస్థలు ఇంధన అన్వేషణకు గుర్తించిన ప్రాంత పరిధిని దాటి ఏ ఇతర ప్రాంతాన్నయినా ఎంపిక చేసుకునేందుకు వీలు కల్పించింది. ప్రత్యేక సీబీఎం బిడ్ రౌండ్–2022లో భాగంగా 3 బ్లాకుల కేటాయింపునకు సంతకాలు పూర్తయినట్లు మంత్రి హర్‌దీప్ సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment