
ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ ( Anant Ambani ), రాధికా మర్చంట్‌ల ( Radhika Merchant ) వివాహం త్వరలో జరగబోతోంది. మార్చి 1 నుంచి 3 వరకు మూడు రోజులపాటు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
అనంత్ అంబానీ బరువు తగ్గడం, ఆ తర్వాత పెరగడం గురించి చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ అనంత్ అంబానీ కొన్ని నెలల్లోనే 108 కిలోలు ఎలా తగ్గగలిగారు అని అందరూ ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటారు. అప్పట్లో ఆయన అంతలా బరువు తగ్గడానికి ప్రధాన కారణం ముంబైకి చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ వినోద్ చన్నా.
ఎవరీ వినోద్ చన్నా?
దేశంలోని ప్రముఖ సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్‌లలో ఒకరైన వినోద్ చన్నా, ఒకప్పుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి పర్సనల్ ట్రైనర్. కఠినమైన ఆహారం, వ్యాయామ నియమావళి ద్వారా కేవలం 18 నెలల్లో 108 కిలోల బరువు తగ్గడానికి అతను సహాయం చేశాడు.
వినోద్ చన్నాది స్వయంగా ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. అతను ఈ రోజు ఉన్న స్థితికి చేరుకోవడానికి చాలా కృషి చేశాడు. అతను ఒకప్పుడు చాలా బక్కపలచగా ఉండేవాడు. దీంతో అతన్ని అందరూ హేళన చేసేవారు. ఒక ఇంటర్వ్యూలో వినోద్ మాట్లాడుతూ.. తాను పెరిగే సమయంలో పోషకాహార లోపంతో బాధపడేవాడినని చెప్పాడు.
ఫిట్‌నెస్ ట్రైనర్‌గా విజయం సాధించడానికి ముందు వినోద్ చన్నా హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డు వంటి చిన్న చిన్న పనులెన్నో చేశాడు. వినోద్ చన్నా పెరిగేకొద్దీ జీవితంలో ఫిట్‌నెస్ ప్రాముఖ్యతను గ్రహించి జిమ్‌లో చేరాడు. ఇదే అతని ప్రయాణాన్ని మలుపు తిప్పింది. అనంత్ అంబానీతో కలిసి పనిచేసిన అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో వినోద్ చన్నా మాట్లాడుతూ.. బరువు తగ్గడంలో అనంత్ అంబానీ నిబద్ధతను తెలియజేశారు. అనంత్ అంబానీ కోసం అధిక ప్రోటీన్, హై ఫైబర్, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారంతో ప్రత్యేక డైట్ ప్లాన్ రూపొందించినట్లు వినోద్ చన్నా తెలిపారు.
ఆయన ఫీజు ఎంతంటే..
అనంత్ అంబానీతో పాటు నీతా అంబానీ, కుమార్ మంగళం బిర్లా, అనన్య బిర్లా, జాన్ అబ్రహం, శిల్పా శెట్టి, హర్షవర్ధన్ రాణే, వివేక్ ఒబెరాయ్, అర్జున్ రాంపాల్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు వినోద్ చన్నా పర్సనల్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎంత చార్జ్ చేస్తారో చెప్పలేదు కదా.. 12 ట్రైనింగ్ సెషన్‌ల ప్యాకేజీకి వినోద్ చన్నా రూ. 1.5 లక్షలు వసూలు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment