న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆయిల్, గ్యాస్ బ్లాకుల వేలంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు పాలు పంచుకున్నాయి. ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్‌పీ–8) ఎనిమిదో దశ వేలంలో భాగంగా కేంద్ర సర్కారు 28 బ్లాకులను వేలానికి పెట్టింది. ఇవి 1.36 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి.
ప్రైవేటు రంగంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్–బీపీ సంస్థలు మొదటిసారి ఓఎన్‌జీసీతో కలసి గుజరాత్ తీరంలోని ఓ బ్లాక్‌కు బిడ్ వేశాయి. ఓఎన్‌జీసీతోపాటు మరో ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్, వేదాంత, రిలయన్స్ ఇండస్ట్రీస్–బీపీ జేవీ, సన్ పెట్రోకెమికల్స్ ఇందులో పాల్గొన్నాయి. ఎనిమిదో విడత ఓఏఎల్‌పీలో 28 బ్లాక్‌లకు బిడ్ల దాఖలు గడువు సెప్టెంబర్ 21తో ముగిసింది. దీంతో ఈ వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) విడుదల చేసింది.
ఓఎన్‌జీసీ తాను సొంతంగా 14 బ్లాకులకు బిడ్‌లు దాఖలు చేసింది. ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌తో కలసి మరో నాలుగు బ్లాక్‌లకు బిడ్లు వేసింది. రిలయన్స్–బీపీతో కలసి వేసిన మరో బిడ్ కూడా కలిపి చూస్తే మొత్తం 19 బ్లాక్‌లకు ఓఎన్‌జీసీ పోటీ పడుతోంది. ఇక అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్ మొత్తం 28 బ్లాకులకు సొంతంగా బిడ్‌లు సమర్పించింది. సన్ పెట్రోకెమికల్స్ ఏడు బ్లాకులకు బిడ్‌లు వేసింది. మొత్తం మీద నాలుగు బ్లాక్‌లకు మూడేసి చొప్పున బిడ్లు రాగా, మిగిలిన వాటికి రెండేసి చొప్పున దాఖలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment