న్యూఢిల్లీ: తాజా విడత ముడి చమురు, సహజ వాయువు బ్లాక్‌ల వేలంలో ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ, వేదాంత, రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్సార్షియం, ఆయిల్ ఇండియా, సన్ పెట్రోకెమికల్స్ మొదలైన అయిదు సంస్థలు పాల్గొన్నాయి. 10 బ్లాక్‌లకు సంబంధించి 13 బిడ్లు దాఖలు చేశాయి. అయితే, ఎక్సాన్‌మొబిల్, షెవ్రాన్, టోటల్‌ఎనర్జీస్ వంటి విదేశీ దిగ్గజాలు మాత్రం వేలానికి దూరంగా ఉన్నాయి.
చమురు, గ్యాస్ రంగ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) ఈ వివరాలు వెల్లడించింది. ఓపెన్ ఎక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్‌పీ) ప్రకారం కేంద్రం గతేడాది జూలైలో ఎనిమిదో విడత కింద 10 బ్లాకులను వేలానికి ఉంచింది. డెడ్‌లైన్‌ను పలుమార్లు పొడిగించిన తర్వాత మొత్తానికి గత వారం బిడ్డింగ్ ముగిసింది. డీజీహెచ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఏడు బ్లాకులకు ఒక్కోటి చొప్పున, మిగతా మూడు బ్లాకులకు రెండు చొప్పున బిడ్లు వచ్చాయి. ఆరు బ్లాకుల్లో ఏకైక బిడ్డరుగా నిల్చిన ఓఎన్‌జీసీ మొత్తం మీద పదింటిలో తొమ్మిది బ్లాకులకు బిడ్ చేసింది. రిలయన్స్–బీపీ బిడ్ చేసిన కేజీ బేసిన్ బ్లాకు కోసం పోటీపడలేదు.
మరోవైపు, వేదాంత, ఆయిల్, సన్ పెట్రోకెమికల్స్ తలో బ్లాక్ కోసం బిడ్ చేసి ఓఎన్‌జీసీకి పోటీదార్లుగా నిల్చాయి. చమురు, గ్యాస్ నిక్షేపాలు మరింతగా అందుబాటులోకి వస్తే 157 బిలియన్ డాలర్ల చమురు దిగుమతుల భారం తగ్గుతుందని కేంద్రం ఆశిస్తోంది. ఇంధన నిల్వలకు అవకాశమున్న ప్రాంతాలను అన్వేషణ కోసం వేలం వేస్తోంది. ఈ క్రమంలోనే 2016లో కేంద్రం ఓఏఎల్‌పీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకూ 144 బ్లాక్‌లను వేలంలో కేటాయించింది. ఇవి 2.44 లక్షల చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment