10% తగ్గనున్న సహజ వాయువు ధర!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ రేట్లకు తగ్గట్లు దేశీయంగా ఉత్పత్తయ్యే సహజ వాయువు ధరలను కేంద్రం తగ్గించనుంది. ఏప్రిల్ 1 నుంచి యూనిట్ (మిలియన్ బ్రిటీష్ థర్మల్ యూనిట్) ధరను ప్రస్తుతమున్న 5.61 డాలర్ల నుంచి 5.02 డాలర్లకు తగ్గించే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది సుమారు 10 శాతం తగ్గుదల. దేశీయంగా సహజ వాయువు రేటు తగ్గించడం ఇదే మొదటిసారి కానుంది.ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి గ్యాస్ ఉత్పత్తి కంపెనీల ఆదాయాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపనుంది.
ఈ వారంలోనే దీనిపై నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా ప్రధానమైన గ్యాస్ హబ్‌ల వద్ద రేట్లను బట్టి ప్రతి ఆరు నెలలకోసారి దేశీయంగా ధరలను కేంద్రం సవరిస్తుంది. క్రితం సారి అక్టోబర్‌లో నిర్ణయించిన ధర గడువు మార్చితో ముగియనుంది.