సంయుక్తంగానే గణతంత్ర దినం
పరేడ్ గ్రౌండ్స్‌లో గవర్నర్ ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన కారణంగా స్వాతంత్య్ర దిన వేడుకలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు విడివిడిగా నిర్వహించినా, గణతంత్ర దినోత్సవాలను మాత్రం సంయుక్తంగానే నిర్వహించనున్నారు. శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి అభీష్టంమేరకు నిర్వహించారు. అయితే జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించాల్సింది రాష్ట్రాల గవర్నర్లు మాత్రమే.
రెండు రాష్ట్రాలకూ గవర్నర్ ఒకరే కావడం, హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తున్నందున గణతంత్ర వేడుకలను ఉమ్మడిగా నిర్వహిస్తారు. ఎప్పటిమాదిరిగానే నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్‌డే ఉత్సవాలు జరుగుతాయని అధికారవర్గాలు తెలిపాయి. ఈ ఉత్సవాలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఉన్నతాధికారులను ఆహ్వానిస్తామని చెప్పాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను, చేపట్టబోయే కార్యక్రమాలను గవర్నర్ ప్రసంగంలో వివరిస్తారని అధికారవర్గాలు తెలిపాయి.