రాష్ట్ర విభజన అంశాలు ఏవీ అధిష్టానం పెద్దల వద్ద చర్చకు రాలేదని గవర్నర్ నరసింహన్ తెలిపారు.
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన అంశాలు ఏవీ అధిష్టానం పెద్దల వద్ద చర్చకు రాలేదని గవర్నర్ నరసింహన్ తెలిపారు. తాను కేవలం అధిష్టానం పెద్దలందరినీ మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ఆయన చెప్పారు. నరసింహన్ బుధవారం ఉదయం ఆర్థిక మంత్రి చిదంబరం, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అనంతరం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో వరుసగా భేటీ అయ్యారు. అలాగే పీఎంవో మంత్రి నారాయణ స్వామితో పాటు ఐబీ చీఫ్ ఇబ్రహీంతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా రోజులుగా తాను ఢిల్లీ రాలేదని... అందుకే అందర్ని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు.
కాగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం, యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బాహాటంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, నరసింహన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్, తన నిర్ణయాన్ని ఏవిధంగానైనా అమలు చేయాలని యోచిస్తోంది. నరసింహన్ ...పెద్దలతో చర్చలు అనంతరం రాష్ట్రంలో పలుమార్పులు జరుగొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.