ఉన్నత విద్యా మండలి విభజనకు బ్రేక్
ఏడాది వరకు రెండు రాష్ట్రాలకూ సేవలు
గవర్నర్ వద్ద ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విభజనను ప్రస్తుతానికి నిలిపివేయాలని గవర్నర్ నరసింహన్ సమక్షంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర విభజన జరిగినా పదేళ్లపాటు విద్యలో ప్రస్తుత ప్రవేశాల విధానమే ఉంటుందని, రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏడాది వరకు ఉన్నత విద్యా మండలి రెండు రాష్ట్రాలకు సేవలు అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. కానీ, విద్యా మండలిని ముందుగానే విభజించేందుకు ఉన్నత విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దీనిపై సోమవారం జరిగిన సమావేశంలో చర్చించారు. రాష్ట్ర విభజన (జూన్ 2) తరువాత పలు ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉండటం... అలాగే ఎంసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, లాసెట్, పీజీసెట్ వంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఫలితాలు వెల్లడించాల్సి ఉండడం.. అనంతరం ప్రవేశాల ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నందున ఉన్నత విద్యా మండలిని ప్రస్తుతం విభజించవద్దని నిర్ణయించారు.
వచ్చే ఏడాది (2015-16 విద్యా సంవత్సరంలో) ప్రవేశాల కోసం డిసెంబర్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూలు జారీ చేసే సమయం నాటికి మండలి విషయంలో నిర్ణయం తీసుకోవచ్చనే ఆలోచనకు వచ్చారు. పైగా అప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి కనుక ప్రభుత్వాలే చర్చించి నిర్ణయం తీసుకుంటాయనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.