ప్రధాని కార్యాలయ అధికారులతో గవర్నర్ భేటీ
న్యూఢిల్లీ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రెండో రోజు కూడా హస్తినలో బిజీ బిజీగా ఉన్నారు. గురువారం ఉదయం ఆయన ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో సమావేశం అయ్యారు. అయితే ప్రధాని కార్యాలయ అధికారులతో గవర్నర్ ఎందుకు కలిశారనే తెలియాల్సి ఉంది.
ఇక అంతకు ముందు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుతో భేటీ అయిన నరసింహన్ రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించారు. అధిష్టానం పిలుపు మేరకు రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన గవర్నర్... జీవోఎం సభ్యుడైన రక్షణ మంత్రి ఆంటోనీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలను నేడు కవలనున్నట్లు సమాచారం. అలాగే ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కూడా శుక్రవారం సమావేశమయ్యే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇక తెలంగాణ బిల్లుకు శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ ఆమోదాన్ని పొందాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం, అందుకోసం అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని కూడా ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాలలో విస్తృతంగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో గవర్నర్‌ను ఢిల్లీ పిలిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను, సీమాంధ్రలో ఉధృతంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ తీరుతెన్నులపై తన అంచనాలను, అభిప్రాయాలను పెద్దలకు గవర్నర్ వివరించినట్లు సమాచారం.మరోవైపు రాష్ట్రంలో మొత్తంగా శాంతిభద్రతల పరిస్థితి అత్యంత కలవరం కలిగించేదిగా ఉందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి నరసింహన్ స్వయంగా నివేదించారని తెలిసింది.