ఇంత చవకబారు విమర్శలా: బీవీ రాఘవులు
నారాయణకు రాఘవులు లేఖ
సాక్షి, హైదరాబాద్: వామపక్షాలుగా చెప్పుకునేవారికి చౌకబారు విమర్శలు, అవాస్తవ వ్యాఖ్యలు తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు సలహా ఇచ్చారు. రాజకీయ చర్చ, విమర్శ పరిధి దాటి ఉండకూడదని సూచించారు. నిగ్రహం ఉండాల్సిన చోట ఆగ్రహం తగదని హితవు పలికారు. సీపీఎంను విమర్శిస్తూ నారాయణ సోమవారం చేసిన ప్రకటనను తిప్పికొడుతూ రాఘవులు మంగళవారం నారాయణకు లేఖ రాశారు. ‘‘మీ ప్రకటనలో విషయం కన్నా ఆగ్రహం, అపవాదులు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ విమర్శల కన్నా అప్రతిష్ట పాలుచేయాలన్న ఆదుర్ధా ఎక్కువగా ఉంది. కొన్ని సందర్భాలలో వామపక్షాల మధ్య బహిరంగంగా రాజకీయ చర్చ, విమర్శలు జరగడం అసహజమేమీ కాదు.
కానీ మీ ప్రకటనలో వాడిన భాష, చేసిన వ్యాఖ్యలు అవాస్తవం. చౌకబారు విమర్శల వల్ల వామపక్షాలనుకునే వారికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. విభజన- సమైక్యత ఉద్యమాలలో అవకాశవాద వైఖరి అనుసరిస్తున్న పార్టీలు, సంఘాల గురించి పేర్లు ప్రస్తావించే మా అభిప్రాయం చెప్తున్నాం తప్ప అవకాశవాద పార్టీల జాబితాలో సీపీఐని చేర్చి మేం ఎప్పుడూ మాట్లాడలేదు. సీపీఐపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న సీపీఎం నాయకులకు సమాధానంగా మీరు ప్రకటన విడుదల చేసినట్టు చెబుతున్నారు. వాస్తవం ఏమిటంటే మీ విమర్శకు మేం స్పందించామే తప్ప ముందు మేము ఎలాంటి విమర్శా చేయలేదు’’ అని అందులో పేర్కొన్నారు.