హస్తాన్ని వదలా..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో తానే సారథ్యం వహిస్తానని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మీద శుక్రవారం ఆయన నేరుగా ధ్వజమెత్తడం ద్వారా మరోసారి అధిష్టానానికి తన విధేయత ప్రకటించుకున్నారు. రాష్ర్ట విభజన అంశం తెర మీదకు వచ్చినప్పటి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ హైకమాండ్‌పై ధిక్కార స్వరం వినిపిస్తూ వచ్చారు.
జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాత్రం ఇందుకు భిన్నమైన బాట ఎంచుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తహతహలాడుతూ వచ్చారు. విభజన ప్రక్రియ జరిగే సమయంలో కూడా రామనారాయణరెడ్డి అమ్మ(సోనియా)కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడిన సందర్భం లేదు. విభజన బాధాకరమే అంటూనే ఇదే సందర్భంలో పార్టీ నిర్ణయమే శిరోధార్యం అనేలా వ్యవహరిస్తూ వచ్చారు. సీఎం రాజీనామా చేస్తారనే వార్తలు బయటకొచ్చినప్పటి నుంచి విధేయత మోతాదు మరింత పెంచారు.
జిల్లాలోని పార్టీ శాసనసభ్యులు, ముఖ్య నేతలు పార్టీ మారే పనిలో పడ్డా, తమకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడం, ఇప్పుడు కాకపోయినా ఇంకొంత కాలానికైనా కాంగ్రెస్ హైకమాండ్ తమ కోరిక తీర్చదా అనే ఆశతో తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామంటూ ప్రకటిస్తూ వచ్చారు. లోక్‌సభ, రాజ్యసభలో విభజన బిల్లుకు ఆమోద ముద్రపడిన అనంతరం శుక్రవారం రాజధానిలో తొలిసారి ఆయన ఈ అంశంపై నోరు విప్పారు. అంతా అయ్యాక ఇక చేయగలిగిందేమీ లేదనీ, విభజన బాధాకరమే అయినా కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్‌తోనే వచ్చిందనీ, మంత్రిగా తాను పనిచేశానంటే కాంగ్రెస్ కార్యకర్తగానే తనకీ స్థాయి వచ్చిందని ఆయన చెప్పుకున్నారు. హస్త రక్షకుడిని తానేననీ, కాంగ్రెస్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి నిలబెడతామని ప్రకటించుకోవడం ద్వారా జిల్లాలో నేదురుమల్లి వర్గం మళ్లీ క్రియాశీలకం కాకుండా అడ్డుకట్టవేసే వ్యూహానికి పదును పెట్టారు. త్వరలోనే నెల్లూరులో జిల్లా స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా కాంగ్రెస్ వల్లే సీమాంధ్రకు ప్యాకేజీ వచ్చిందనే నినాదంతో మరోసారి జనం వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. జిల్లాలోని 10 నియోజకవర్గాలు, ఎంపీ అభ్యర్థులందరినీ తన వారినే బరిలోకి దించడం ద్వారా జిల్లాలో కాంగ్రెస్ అంటే తామేననీ, తామంటే కాంగ్రెస్ అనే విధంగా పార్టీ మీద పట్టు సాధించే ఎత్తుగడ వేశారు.
ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాగూ కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదని తెలిసినా, కేంద్రంలో అవకాశం ఉండొచ్చేమోననే ఆశ ఆనంతో ఈ అడుగులు వేయిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్రప్రభుత్వం అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచినా తర్వాత రెండు రాష్ట్రాలకు సీఎంలను, కేబినెట్‌ను నియమిస్తుందని ఆనం గట్టిగా నమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అవసరాల రీత్యా కూడా రాష్ట్ర విభజన అనంతరం జిల్లాలో అందరికంటే ముందుగానే ఆనం రామనారాయణరెడ్డి మళ్లీ కాంగ్రెస్ జెండాను భుజానికెత్తుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.