సమగ్ర కండలేరుగా తీర్చిదిద్దాలి
రాపూరు, న్యూస్‌లైన్: కండలేరు జలాశయాన్ని సమగ్ర కండలేరుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశించారు. కండలేరు జలాశయ అతిథిగృహంలో బుధవారం ఆయన కలెక్టర్ శ్రీకాంత్, ఇరిగేషన్, తెలుగుగంగ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఐఏబీ తీర్మానం మేరకు ఆయకట్టుకు నీటివిడుదలపై చర్చించామన్నారు. లోలెవల్ స్లూయీస్‌కు నీరు అందిన తర్వాత మనుబోలుకు విడుదల చేస్తామన్నారు.
అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది కండలేరు జలాశయంలో 50 టీఎంసీల నీటిని నిల్వ చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. పొదలకూరు, మనుబోలు, చేజర్ల మండలాల్లోని 50 వేల ఎకరాలకు కండలేరు ఎడమ కాలువ ద్వారా నీరు అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.62 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. కండలేరు నిర్వాసితులకు చెందిన 1,850 ఎకరాలకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భద్రతా కమిటీ సూచనల మేరకు జలాశయంలో కొన్ని పనులు చేపడతామన్నారు. ప్రాజెక్టు పరిధిలో అధిక లోడు వాహనాలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జలాశయం పరిధిలో 316 హెక్టార్ల అటవీ భూములున్నాయని, ఆ శాఖ నుంచి అనుమతి లభించినందున ఆ భూముల్లో నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తామన్నారు. అన్ని పూర్తయితే 1.25 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని వెల్లడించారు. స్పిల్‌వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలుగుగంగ అధికారులను మంత్రి ఆదేశించారు.
రూ.2 కోట్లతో టూరిజం ప్రాజెక్ట్
కండలేరు జలాశయంలో రూ.2 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి ఆనం వెల్లడించారు. కొండపై ఇరిగేషన్ శాఖ 3 ఎకరాలను కేటాయిస్తే పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవనం నిర్మిస్తారన్నారు. తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు బీచ్‌లో 10 ఎకరాల విస్తీర్ణాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో కలెక్టర్ శ్రీకాంత్, ట్రెయినీ కలెక్టర్ వర్షిణి, ఆర్డీవో సుబ్రమణ్యేశ్వర రెడ్డి, ఎస్ఈలు సుబ్బారావు, కోటేశ్వరావు, ఈఈలు సురేష్‌బాబు, విశ్వనాథం, వెంకట రాజు, శ్రీనివాసరావు, డీసీసీబీ అధ్యక్షుడు ధనుంజయరెడ్డి, ఏఎంసీ అధ్యక్షుడు చెన్ను బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
వెయ్యి కోట్లతో హైలెవ్
కాలువ మొదటి దశ
సోమశిల: మెట్ట ప్రాంత ప్రజల సాగు,తాగనీరు అవసరాలు తీర్చేందుకు సోమశిల హైలెవల్ కాలువ మొదటి దశను వెయ్యి కోట్ల నిధులతో ప్రతిపాదించామని, పరిపాలన అనుమతి రాగానే పనులు మొదలవుతాయని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయాన్ని బుధవారం ఆయన కలెక్టర్ ఎన్.శ్రీకాంత్‌తో కలిసి సందర్శించారు. కండలేరు వరద కాలువ హెడ్‌రెగ్యులేటర్, రేడియల్ క్రస్ట్‌గేట్లను పరిశీలించారు. నీటి లభ్యతపై అధికారులతో సమీక్ష నిర్వహించృరు. అనంతరం సోమశిల అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. హైలెవల్ కెనాల్‌కు ఆనం సంజీవరెడ్డి పేరును ప్రభుత్వం ఖరారు చేసిందని వెల్లడించారు.
సోమశిల జలాశయంలో 59 టీఎంసీల నీటిని నిల్వ చేసి మిగిలిన జలాలను కండలేరుకు తరలిస్తున్నామని చెప్పారు. ఆయకట్టుకు వారం రోజుల్లో నీరు విడుదల చేస్తామన్నారు. కండలేరు వరద కాలువకు నీటి విడుదల ఆపిన వెంటనే లీకేజీలను అరికట్టేందుకు మరమ్మతులు చేపడతామన్నారు. ఆయన వెంట సోమశిల ఎస్ఈ సోమశేఖర్, ఈఈ ఢిల్లేశ్వరరావు, తహశీల్దార్ సోమ్లానాయక్, ఎంపీడీఓ ఐజాక్ ప్రవీణ్, నాయకులు వేణుగోపాల్‌రాజు, మెట్టుకూరు కృష్ణారెడ్డి, సుబ్బరాజు, అల్లంపాటి జనార్దన్‌రెడ్డి, ఉప్పల విజయ్‌కుమార్, మెట్టుకూరు రమణారెడ్డి ఉన్నారు.